బోర్లు, కుళాయిలు లేని రోజుల్లో ఊరంతటికీ ఒక్కటే మంచినీళ్ళ బావి ఉండేది. ప్రతీఇంటినుంచీ తప్పేళాలో, బిందులో, కుండలో, రాగిబిందులతో ఉన్న నీటి కావిళ్ళతోనో జనాలు అక్కడికే వెళ్ళేవారు. రాతి ప్రదేశాల్లో ఎంతో లోతుగా తవ్వితే గానీ నీరు పడేది కాదుకనుక, బావులన్నీ పాతాళమంతలోతు ఉండేవి. గిలక సహాయం లేకుండా నీరు తోడడం అసాధ్యం. గిలకపైనుంచి కొబ్బరితాడుకి కట్టిన చేదతో నీళ్ళు తోడేవారు. రెండుచేదలు తోడితే బిందె నిండిపోయేది. తోడుతున్నవాళ్ళు, తమవంతుకోసం ఎదురు చూసేవాళ్ళు, అమ్మలవెనుక చిన్ని చిన్ని గిన్నెలు, చెంబులు పట్టుకొని నిలబడి ఉండే బుడతలు, మొగవాళ్ళు, ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు, పడుచువాళ్ళు అందరికీ ప్రతీరోజూ సమావేశ స్థలం అదే. ఊళ్ళో విశేషాలు ఇప్పటి సోషల్ నెట్‌వర్కింగ్‌లో కంటే వేగంగా ఒకరినుంచి ఒకరికి చేరిపోయేవి. అప్పుడప్పుడు ప్రేమకథలు కూడా ఇక్కడే మొదలయ్యేవి. అందుకే `బావి దగ్గర..` అనే మాటకి చాలా ఆకర్షణ ఉంది. ఎప్పుడో దామెర్ల రామారావుగారు (Link) కూడా `అట్ ద వెల్` అనే పేరుతో ఒక పెయింటింగ్ వేశారు. `అలాగ ఉండేది, ఇలాగ ఉండేది..` అని చెపుతున్నాను కనుక ఇలాంటి పరిస్థితులు ఇప్పుడులేవేమో అనుకోవద్దు. ఇప్పటికీ ఊరికంతటికీ కలిపి ఒకే మంచినీళ్ళ బావి ఉన్న ఊళ్ళు చాలా ఉన్నాయి. అలాంటి బాగిదగ్గ తీసిందే పై ఫోటో!
© Dantuluri Kishore Varma
No comments:
Post a Comment