Photo : The Hindu |
నాలుగైదురోజుల క్రితం హిందూ న్యూస్‌పేపర్లో ట్యూనా ఫిష్‌ని మోసుకొని పోతున్న ఒకమత్యకారుడి ఫోటోని వేశారు. దానితోపాటూ ట్యూనా చేపలు తక్కువగా పడుతున్న కారణంగా మత్యకారులు ఆందోళన చెందుతున్నారని న్యూస్‌కూడా రాశారు. తడి ఇసుకమీద నడిచిపోతున్న పాదాలు, వొడ్డును తాకుతున్న కెరటాలు, బ్యాక్‌గ్రౌండ్‌లో మబ్బులు పట్టిన నీలి ఆకాశం.. ఫోటో చూస్తుంటే తెలియకుండానే హైలెస్సో, హైలెస్సా అనే పాట చెవుల్లోవినిపిస్తుంది.
* * *
కాకినాడలో మత్యకారుల సంఖ్యఎక్కువ. మాస్కూల్ విద్యార్థుల తల్లితండ్రుల్లో కూడా కొంతమంది బోటు యజమానులు ఉన్నారు. వాళ్ళపిల్లల చదువు విషయంలో మమ్మల్ని కలవడానికి స్కూలుకి వచ్చినప్పుడు వాళ్ళ సాధకబాధకాలు కూడా ప్రస్తావనకి వస్తుంటాయి. అటువంటి ఒక సందర్భంలో ఫిషింగ్‌హాలిడే గురించి కొంత సంభాషణ జరిగింది. జగన్నాథపురం వంతెనదగ్గర, కాకినాడ సముద్రతీరంలోనూ మరపడవలని దూరంనూంచి చూడటమే కానీ, వాళ్ళు చేసే పనిగురించి పెద్దగా తెలియదు. కనుక ఎవరైనా చెపితే వినడానికి ఆసక్తికరంగా ఉంటుంది. హిందూ న్యూస్‌పేపర్లో మొన్న చూసిన ఫోటో - చెవుల్లో వినిపించిన హైలెస్సో పాటతో పాటూ, ఈ సమాచారాన్ని కూడా జ్ఞాపకానికి తెచ్చింది. ఆ సంగతులని మీతో పంచుకోవడానికి ఈ టపా.
సముద్రంలోకి చేపలవేటకి వెళ్ళే మరపడవలు మనతీరప్రాంతంలో సుమారు రెండువేలు ఉంటాయి. వాటిలో 700 కాకినాడవైతే, 600 విశాఖపట్టణానివి. మిగిలినవి కృష్ణపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, ఓడలరేవులవి. సముద్రంలోనికి వేటకు వెళ్ళేముందు డీజిల్ కొట్టించుకొని, పట్టుబడిన చేపలూ రెయ్యలూ నిల్వచెయ్యడానికి ఐసు నింపుకొని, సముద్రంలో ఉండే పదిరోజులో, పదిహేనురోజులో తినడానికి బియ్యం, కాయగూరలు, నీళ్ళు ఇంకా చాలా వేసుకొని పడవసిబ్బంది అంతా బయలుదేరతారు. ఒక్కసారి పట్టుబడికి వెళితే సుమారు లక్షన్నర వరకూ ఖర్చు అవుతుందట. ఈ ఖర్చులు భర్తీ అయ్యి లాభం రావాలంటే పెద్దమొత్తంలో రొయ్యలూ, చేపలూ దొరకాలి.
అదృష్టం బాగుంటే పెట్టినదానికి రెట్టింపు, రెండురెట్లూ కూడా వస్తుందట. బాగాలేకుంటే లక్షో, ఎంతో ఎగిరిపోతుంది. వేటకి వెళ్ళినతరువాత ఏ తుఫాను వచ్చే సూచనలో ఉండి వెనక్కి రావలసి ఉంటే మొత్తం పెట్టుబడి పోయినట్టే. పట్టుబడి సరిగా ఉండని సందర్భాలు కూడా తరచూ ఉంటాయి. దానికి కారణం విపరీతంగా మత్యసంపదను ఉపయోగించుకొంటూ ఉండడమే. అందుకే ప్రతీసంవత్సరం చేపపిల్లలు తయారయ్యే సమయంలో (సుమారు ఏప్రిల్ 15 నుంచి మే 31వరకూ) 47రోజులు ఫిషింగ్‌హాలిడేని కేంద్రప్రభుత్వం అమలుపరుస్తుంది. దీనివల్ల మత్యసంపద మళ్ళీ వృద్దిచెందుతుంది. జూన్ ఒకటినుంచి కేజీలకొద్దీ రొయ్యలూ, టన్నులకొద్దీ చేపలు దొరకడం మొదలౌతుంది... హైలెస్సో, హైలెస్సా...
శుభసంకల్పం సినిమా నుంచి హైలెస్సో పాట చూడండి సరదా, సరదాగా.
© Dantuluri Kishore Varma
హహ మొత్తం చదివాక
ReplyDeleteఒకటే అనిపిస్తుంది
హైలెస్సో హైలెస్సో అంటే
కస్తాలెమొ హై అనీ
రాబడేమో లెస్సూ అనీ
కిషోర్ వర్మ గారు...
అక్షరాలతో ఆడుకొన్నారు జానీగారు. ధన్యవాదాలు.
Delete