ఊరికి ఒకటో, రెండో టెలివిజన్ సెట్లు అంతే. పదిగంటలకి క్రికెట్ మ్యాచ్ అంటే, తొమ్మిదీ యాభైకే ఆన్ చేసేసుకోంటే, తెరమీద డిఫరెంట్ గ్రే షేడుల్లో వెడల్పాటి నిలువు చారలు, గూ))))))))))))) అని ఒక సైరన్ లాంటి మోత. ఇంకా కొద్ది సేపటిలో మ్యాచ్ మొదలవబోతుందని అనౌన్సర్ చెప్పిన వెంటనే గొల్లు మని గోల. పెద్దా, చిన్నా; ముసలీ, ముతకా... గుంపుగా పోగయిపోయిన అందరిదీ ఒకటే ఆత్రుత - `మనోళ్ళు గెలుస్తారా?` అని. మొదటి బంతినుంచీ ఉత్కంఠ! ఫోరుకొడితే కేరింతలు, వికెట్టుపోతే నిట్టూర్పులు. మధ్య మధ్యలో ఆడవాళ్ళు ఇటు తొంగిచూసి `స్కోరెంత?` అని అడగడం. ఒక మినీ స్టేడియం టీ.వీ. గదిలో వెలిసినట్టు ఉండేది.
కృష్ణమాచారి శ్రీకాంత్, సునీల్ గవాస్కర్, మహీందర్ అమర్నాథ్, కపిల్దేవ్, వెంగ్సర్కార్, రవిశాస్త్రి, బిన్నీ, మదన్లాల్, కిర్మానీ, మొహమ్మద్ అజారుద్దీన్, సచిన్ తెండూల్కర్....ఆ జనరేషన్ హీరోలు. 1983 ప్రూడెన్షియల్ వాల్డ్ కప్ లో అండర్ డాగ్స్ లాంటి టీముని విజయాలబాట పట్టించిన కపిల్ సేన; 1986 ఫైనల్లో చేతన్ శర్మ వేసిన ఫుల్టాసుని మియాందాద్ సిక్సర్ కొట్టడంతో ఆస్ట్రో ఏషియన్ కప్పు తన్నుకుపోయిన పాకిస్తాన్ - ఆశ నిరాశల చెరొక కొనలు. మ్యాచ్ చూసిన ఉత్సాహాన్ని మైదానంలో ఆటలోకి తర్జమా చేసుకోవడానికి తహతహ లాడిపోయేవాళ్ళం.
సాయంత్రం అయ్యేకొద్దీ చేతులు దురదలు పెట్టెసేవి. ఎప్పుడెప్పుడు గ్రౌండుకి వెళ్ళిపోయి క్రికెట్ అడేసుకొందామా అని. గ్రౌండ్ అంటే అదేదో పెద్దదికాదు.ఇంటి వెనుక ఖాళీజాగా. క్రికెట్ కిట్ అంటే కొబ్బరిమట్ట, బుర్రటెంక. తర్వాత్తర్వాత చిన్న బ్యాట్, టెన్నీస్ బాల్. వికెట్లకోసం గోడమీద నిలువుగీతలు, ఇటుకలు లేకపోతే వంకరపుల్లలు. రూల్స్ కూడా చాలా పక్కాగా ఉండేవి. బాల్ గోడకి తగిలితే ఫోర్, ఎగిరెళ్ళి తగిలితే సిక్స్, గోడదాటి పోతే ఔటు. ఫీల్డరు లెగ్ సైడే ఉంటాడు కనుక, బాల్ ఆఫ్ సైడుకి కొట్టకూడదు. బ్యాటింగ్ ఆర్డర్ నిర్ణయించడానికి ఒక పద్దతి ఉండేది. ఒక బుడ్డోడిని ఒంగో బెట్టి, వాడి వీపుమీద అరచేతితో చిన్నగా చరిచి, కొంచెం చేయ్యి పైకి లిఫ్ట్ చేసి - ఒకటో, రెండో, మూడో... వేళ్ళు తెరచి చూపించి `ఇది ఎవరికి?` అని అడగడం. బుడ్డోడు ఎవరిపేరు చెబితే ఆనెంబరు వాడిదన్నమాట. ఇక్కడ ఒక జాగ్రత్త తీసుకోవాలి- తెరిచి చూపించిన వేళ్ళు బుడ్డోడు చూడకూడదు. ఒకటో నెంబరు చూపించినప్పుడు వాడు తెలివిగా నీడ చూసి `నాదే` అని చెప్పేసి ఫస్టు బ్యాటింగ్ కొట్టేసే ప్రమాదం ఉంది.
ఎవరైనా `నువ్వు బౌలరువా, బాట్స్ మానా?` అని అడిగితే, `ఆల్రౌండర్` అని చెప్పుకోవడం భలే గర్వంగా ఉండేది. వాళ్ళు ఎప్పుడైనా వెటకారంగా `అబ్బా!` అంటే; ఆటలో మన ప్రతాపం తెలియని వాళ్ళ అజ్ఞానానికి జాలిపడే వాడిని. `క్రికెట్ ఎలా ఆడాలీ?` అనే పుస్తకం కొనుకొన్నాను ఆసమయం లోనే. ముఖ్యంగా బ్యాటింగ్ మీదే కాన్సెంట్రేషన్ అంతా. ఎందుకంటే, బౌలింగ్ అంత ఏమీ నేర్చుకోవలసిన విషయం కాదని గొప్ప నమ్మకం. ఫేస్ అంటే ఎంతవీలయితే అంత దూరం నుంచి పరిగెత్తుకొని వచ్చి వెయ్యడం. నీరసంవచ్చి దూరంపరిగెత్తలేనప్పుడు వేసిది స్పిన్- As simple as that! ఒకసారి ఏదో టెస్ట్ మ్యాచ్ లో గవాస్కర్కి ఒక ఓవర్ ఇచ్చారు(అప్పటికే భారత్ విజయం నిశ్చయమైపోయింది). వికెట్ దగ్గరనుంచి స్క్రీన్ వరకు నడచుకొని వెళ్ళిపోయి అక్కడినుంచి పరిగెత్తుకొని వచ్చి బౌల్ చేశాడు. మరొకటి అబ్దుల్ ఖాదిర్ లాగా వేసి తెగనవ్వించాడు.
స్ట్రెయిట్ డ్రైవ్, స్వీప్, రివర్స్ స్వీప్, పుల్, డిఫెన్స్, హుక్ షాట్, స్క్వేర్ డ్రైవ్, కట్... బాగా చదువుకొని హై స్కూల్ గ్రౌండుకి వెళ్ళేవాళ్ళం (అప్పటికి పెద్దమ్యాచ్లు ఆడే వయసు వచ్చింది లెండి). మన బ్యాటింగ్ అయిన తరువాత కానీ తెలిసేది కాదు స్విమ్మింగ్, క్రికెట్, డ్రైవింగుల్లాంటివి పుస్తకాలు చదివి నేర్చుకోలేమని. కానీ ఏమిలాభం? అప్పటికే మన పేరుమీద `డక్` ఉండేది. ఒక్కోసారి కృష్ణమాచారి శ్రీకాంత్ లాగ చెలరేగి పోయేవాడిని - కళ్ళు మూసుకొని బ్యాట్ ఊపితే ఫోరో, సిక్సో పోవలసిందే! ఇక్కడ మన ప్రతాపం కంటే, బౌలరుకే ఎక్కువ వీర తాడులు వేసుకోవాలి.
నేషనల్ దూరదర్శన్ Body Line అని ఒక 13 వారాల సీరియల్ ప్రసారం చేసింది. ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాట్స్ మేన్ డాన్ బ్రాడ్ మేన్ ని నిలువరించడానికి, అప్పటి ఇంగ్లాండ్ కేప్టెన్ డగ్లాస్ ఉపయోగించిన కుతంత్రం. బౌలర్ బాల్ ని వికెట్ల మీదకి కాకుండా, షార్ట్ లెంగ్త్ గా వేసి శరీరానికి తగిలేలా చెయ్యడం. Body line అంటే జ్ఞాపకం వచ్చింది, కార్క్ బాలుతో క్రికెట్ ఆడుతున్నప్పుడు దెబ్బలు గట్టిగా తగిలేవి. ప్యాడ్లు కట్టుకోకుండా ఆడడం వల్ల మోకాళ్ళ క్రింద గట్టిగా బంతి తగిలితే ఇంచుమించు కార్క్ బాలంత బొప్పికట్టేది. ఇంటర్ మీడియట్ పరీక్షలకు కొన్ని రోజుల ముందు, ఒక మ్యాచ్ ఆడుతూ ఫుల్ టాస్ వేసిన బంతిని హుక్ కొట్టబోయి, అంచనా తప్పడంతో కుడిచేతి చూపుడువేలు గోరు పచ్చడి చేసుకొన్నాను. దానితో బొటనవేలు మధ్యవేలు ఉపయోగించి ఎగ్జాంస్ రాయవలసి వచ్చింది.
క్రికెట్ కబుర్లు చెప్పమంటే ఎవరైనా గంటలకొద్దీ చెప్పగలరు. గల్లీల్లో, బీచ్చుల్లో, ఇంటి ఖాళీజాగాల్లో, మైదానాల్లో...ఆఖరికి డ్రాయింగ్ రూముల్లోనయినా ఈ ఆట ఆడని వాళ్ళు ఎంతమంది? ఈ ఆట మెచ్చనివాళ్ళు ఎంతమంది?
© Dantuluri Kishore Varma