Pages

Saturday 26 January 2013

ఆంధ్రా శబరిమలై

అయిదవ నెంబరు జాతీయ రహదారిమీద ఉన్న కత్తిపూడి గ్రామం నుంచి శంఖవరం 13 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడినుంచి సిద్దివారిపాలెం అనే ఊరు పదికిలోమీటర్లు. ఈ ఊరిలోనే ఆంధ్రా శబరిమలై అని నామకరణం చేసి 2011లో ఒక దేవాలయాన్ని నిర్మించారు. జనావాసాలకి దూరంగా కొండల్లో నిర్మించడం వల్ల, అక్కడంతా అడవి ప్రదేశంలా అనిపిస్తూ మిగిలిన దేవాలయాల దర్శనంకంటే కొంచం ప్రత్యేకంగా ఉందని కొందరు మిత్రులు చెప్పడం వల్ల అక్కడికి బయలుదేరి వెళ్ళాం.
శంఖవరం ఊరు దాటిన తరువాత ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసి సిద్దివారిపాలెంలో కొండల మధ్యనుంచి మట్టిరోడ్డు మీద కొంతదూరం వెళితే,  ఎత్తయిన ప్రదేశంలో దేవాలయం కనిపిస్తుంది.
కొండవాగులమీద నిర్మించిన వంతెనలు, పచ్చి వెదురుగడలని సైకిళ్ళకి కట్టుకొని నడిపించుకొని వెళ్ళే మనుషులు, అప్పుడప్పుడూ వెళుతున్న వాహనాలు, పొలాల్లో పనిచేసుకొంటున్న కూలీలు, దూరంగా కొండవాలులో కట్టుకొన్న గుడిసెలు (వీటిని చూసి మనం `ఆ కొండపైన కూడా పాకలు కట్టుకొని ఉంటారా!` అని ఆశ్చర్య పోతాం), రోజంతా పలుచటి పొరలాగా కమ్ముకొని ఉండే మంచు - అన్నింటినీ చూసుకొంటూ గుడికి చేరుకొన్నాం. గుడికి కొంచం ముందర ఒక వాగుమీద ఇరుకైన వంతెన ఉంది. బస్సులవంటి బరువైన వాహనాలు వంతెన దాటించ వద్దని, వంతెన బలహీనంగా ఉందని హెచ్చరిక రాసిఉంది. మాది తేలికైన కారే కనుక ఆలయం సమీపం వరకూ తీసుకొని పోయాం. ప్రస్తుతం అసౌకర్యాలున్నా మన్నించమని, వచ్చే మూడేళ్ళలో రోడ్లు, కాటేజీలు, వంతెనల నిర్మాణం జరుగుతుందని ఒక బోర్డు పెట్టారు.

శబరిమలైలో లాగ కాకుండా ఇక్కడ మహిళలకు కూడా ప్రవేశం ఉంది. నిర్మాణ శైలి కేరళలోని గుడిని పోలి ఉంది. ప్రతీ  అయ్యప్ప గుడిలో లాగే పద్దెనిమిది మెట్లు ఉన్నాయి. చిన్ని అయ్యప్ప మూలవిరాట్టు బాగుంది.

మాల ధారణ చేసిన స్వాములు ఇరుముడులు సమర్పించుకోవడానికి ఇక్కడికి వస్తున్నారని, మకరసంక్రాంతి రోజున జ్యోతిదర్శనం ఏర్పాట్లు కూడా చేశామని నిర్వాహకులు చెప్పారు. ఈ ఊరికి సుమారు నాలుగైదు కిలోమీటర్ల దూరంలో అంకంపాలెం అనే గ్రామంలో అసలైన శబరిమలై క్షేత్రంలో లాగానే ఉప ఆలయాలు నిర్మించారట. సమయం సరిపోక మేం అక్కడికి వెళ్ళలేదు.

రాజమండ్రీ నుంచి కానీ, కాకినాడనుంచికానీ ఇక్కడకి వెళ్ళాలంటే కత్తిపూడి దగ్గర శంఖవరం మీదుగా వెళ్ళే బస్సులు లేదా ఆటోలు  అందుకొని వెళ్ళవచ్చు. బస్సులు అంత తరచుగా ఉన్నట్టు లేవు.

యూట్యూబ్ స్లైడ్‌షో చూడండి.
ఉత్తర శబరి అని రాజమండ్రీ ఇస్కాన్ సమీపంలో గోదావరి గట్టుమీద కూడా ఒక అయ్యప్ప దేవాలయం ఉంది. మీకు ఆసక్తి ఉంటే ఇక్కడ చూడండి.  

కాకినాడనుంచి, రాజమండ్రీ వెళ్ళే కెనాల్ రోడ్డులో ఉన్న ద్వారపూడిలో  అయ్యప్ప దేవాలయం ఇక్కడ చూడండి.

© Dantuluri Kishore Varma

4 comments:

  1. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు శర్మగారు.

    ReplyDelete
  2. చాలా బావుందండీ ఆంధ్ర శబరిమలై గుడి. మంచి అనుభూతులు మీవి.

    ReplyDelete
  3. ధన్యవాదాలండి చిన్ని ఆశ గారు.

    ReplyDelete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!