Pages

Friday 4 January 2013

కుప్ప నూర్పుళ్ళు

పెద్దపండుగ ముందు కొన్నిరోజులు నాన్నగారు పొలంలోనే ఉండిపోవలసి వచ్చేది. ఉదయం, సాయంత్రం పాలికాపు ఇంటికి వచ్చి భోజనం క్యారేజీ తీసుకొని వెళ్ళేవాడు. ఎప్పుడయినా ఉదయంపూట క్యారేజీ కోసం వచ్చిన పాలికాపుతో పొలం వెళ్ళేవాళ్ళం.  వరిపొలం మధ్యలో మకాం ఉండేది. మకాం అంటే ఒక ఎకరం పొలంలొ మట్టినింపి, మెరకచేసిన ప్రదేశం. ఒక పెద్ద నుయ్యి,   మావిడి చెట్లు,  ఆవులు, ఎడ్లు, గేదెలని కట్టడానికి కట్టురాటలు,  ఎడ్లబళ్ళు, నాగళ్ళు లాంటి పనిముట్లు పెట్టుకోవడానికి కొంతజాగా, ఒక పాక, ప్రక్కవాళ్ళ పొలం సరిహద్దుని తెలియజేడానికి కట్టవ ఉండేవి.  నేనువాడిన కొన్నిమాటలకి కొంతమందికి అర్థం తెలియకపోవచ్చు, అందుకే వాటి గురించి కొంచెం చెబుతాను. కట్టు రాటలు అంటే పశువులని కట్టడానికి భూమిలోకి దిగగొట్టిన లావుపాటి కర్రముక్కలు - ఇప్పటి క్రికెట్ ఆటలో వికెట్ల లాంటివి.  కట్టవ అంటే మట్టితో ఒక అడుగు ఎత్తు గట్టు ఏర్పాటుచేసి దానిమీద బ్రహ్మజెముడు లాంటి ముళ్ళ మొక్కలని వేస్తారు.  సరిహద్దు అవతలినుంచి మనుషులు, పశువులు రాకుండా చేసే అడ్డుకట్టు ఇది. 

పండుగ నెలలో కుప్పనూర్పుళ్ళ హడావుడి ఉండేది. కోసిన వరిచేనుని ఆరిన తరువాత, మకాంలోకి చేరవేసి, ఎడ్లబళ్ళతో తొక్కించేవారు. దీనిని కుప్పనూర్పు అంటారు. వరికుప్పమీద మూడు, నాలుగు బళ్ళని వొకదానివెనుక మరొకటిగా గుండ్రంగా తిప్పేవారు. వరికంకుల్ని తొక్కించడం వల్ల పూర్తిగా రాలిపోయి క్రిందకి చేరిన వరిని, వరిగడ్డినీ వేరుచేసేవారు. తరువాత చేటలతో ధాన్యాన్ని ఎగరబోసి, దుమ్ము, దూళీ వేరుచేసేవారు.  ఈ కార్యక్రమం పూర్తికావడానికి వారంరోజులో, పదిరోజులో పట్టేది. అందుకే యజమాని ఈ సమయంలో తప్పనిసరిగా మకాంలో ఉండిపోవలసి వచ్చేది.  అందుకోసం మంచె వేసేవారు. మంచె అంటే పాతకాలపు పందిరి మంచంలా ఉండేది. పట్టెడకు బదులుగా తాటి పట్టెలు, పరుపుకి బదులుగా వరిగడ్డీ, దానిమీద గోనెసంచులు కలిపి కుట్టిన బరకం. పైనుంచి మంచు పడకుండా తాటాకు గుడారంలాంటి ఏర్పాటు.

పొలంలోకి వెళ్ళిన తరువాత మాకు రైతు ఆట మొదలయ్యేది. ఒక టవల్ తీసుకొని తలపాగా చుట్టేసి, మంచె ఎక్కేసేవాళ్ళం. కరకజ్జం అనే స్వీట్ మాకోసం తయారుగా ఉండేది అక్కడ. శనగపిండితో చేసిన లావు కారప్పూసని లేత బెల్లంపాకంపట్టి, మకాంల దగ్గరకి తెచ్చి, కొత్త ధాన్యానికి మార్పిడిగా అమ్మేవారు. మాకు చాలా ఇష్టమైన కరకజ్జాన్ని మా నాన్నగారు ఖాళీ భోజనం క్యారేజీల్లో నిలువచేసి ఉంచేవారు.  దాన్ని తింటూ కొంతసేపు పనివాళ్ళ మీద అజమాయిషీ చెయ్యడం. వాళ్ళు ఏదయినా ఆట పట్టిస్తే ఉడుక్కోవడం.    కుప్ప నూర్పుళ్ళ బళ్ళు అన్నింటినీ ఎవరో ఒకరు నడపనవసరం లేదు. మొదటి బండిమీద ఒక వ్యక్తి ఉంటే, వెనుకవి ముందున్న బండిని అనుసరిస్తూ తిరుగుతాయి. మా ఎడ్లబండి సవారీ సరదా ఇక్కడ బాగా తీరేది. రెండవ బండిలోనో, మూడవదానిలోనో ఎక్కి, ఒక చేత్తో కళ్ళెం, ఇంకొక చేతితో అదిలింపు కర్రా పట్టుకొని `హొ్‌య్, హో్‌య్` అంటుంటే, విమానం నడుపుతున్నంత సరదాగా ఉండేది.
నూర్పుళ్ళు, ఎగరబోతలు అయిపోయినతరువాత పాలేర్లకి జీతాలు కొలిచేవారు. పెద్దపాలేరుకి పదిహేను కాటాలు, చిన్నపాలేరుకి పదో ఎన్నో కాటాలూ కొలిచేవారు. కాటాలంటే ధాన్యం బస్తాలు. కమతంలో ఉండే వాళ్ళతో పాటూ మిగిలిన సేవలు అందించేవారికి కూడా ఇటువంటి జీతబత్యాలే ఉండేవి. వాళ్ళందరూ కూడా వార్షిక జీతాలు కొలిపించుకొని వెళ్ళేవారు. మిగిలిన ఫలసాయాన్నీ పెద్ద త్రాసు(దీనినే కాటా అనేవారు) లో తూచి, బస్తాలు దబ్బనం, పురుకోసలతో మూతులు కుట్టి, బళ్ళమీద ఎక్కించేవారు. `బండెనుక బండికట్టి, పదహారుబళ్ళు కట్టి...` అన్నట్టు బళ్ళన్నీ ధాన్యలక్ష్మితో ఇంటిదారి పట్టేవి. వాటితో పాటూ మేమూనూ. 

పొలంలో పనులన్నా, వ్యవసాయదారులన్నా జ్ఞాపకాల గుబాళింపుతో కూడిన ఇష్టం,  ప్రత్యక్షంగా వ్యవసాయం చెయ్యకపోయినా కూడా..

© Dantuluri Kishore Varma 

4 comments:

  1. పండుగ రోజుల్లో ఇలాంటి జ్ఞాపకాలు...కాసేపు చిన్ననాటి రోజులకి తీసుకెళ్ళారు.

    ReplyDelete
  2. మీ స్పందనకు ధన్యవాదాలు చిన్ని ఆశ గారు.

    ReplyDelete
  3. పొలంలో పనులన్నా, వ్యవసాయదారులన్నా జ్ఞాపకాల గుబాళింపుతో కూడిన ఇష్టం, ప్రత్యక్షంగా వ్యవసాయం చెయ్యకపోయినా కూడా.. ee mata chaalandi varmagaaru.. kevalam ee istame nannu India vachina prathisaari polamloki nadipinchedi and maa thaathagaarini aaraalu teeinchelaa chesthundanukuntaa..... Meeru chaala chakkaga varninchina paalerlu valla kamathaala gurinchi ippudu chaalaa mandiki teliyadanukuntaa sir.. maarina saamajika paristhuthula drustyaa.. Excellent article sir..

    ReplyDelete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!