Pages

Sunday, 10 February 2013

ఈ అమావాస్య ప్రత్యేకత ఇదే - చొల్లంగి అమావాస్య

ప్రతీ సంవత్సరం పుష్యమాసం చివరిరోజైన అమావాస్యని చొల్లంగి అమావాస్య అంటారు. కాకినాడలో జగన్నాధపురం వంతెన నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న చొల్లంగిలో వందేళ్ళ క్రితం నిర్మింపబడిన శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ సంగమేశ్వరస్వామి వారి దేవాలయం ఉంది.  చారిటిస్ విద్యా సంస్థలని నెలకొల్పిన మల్లాడి సత్యలింగ నాయకరు ఈ గుడిని కట్టించారు. సమీపంలోనే గోదావరీ నది యొక్క ఏడుపాయల్లో ఒకటైన తుల్యబాగ సముద్రంలో కలుస్తుంది. చొల్లంగి అమావాస్యరోజు ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తే చాలా మంచిదని భావించడంవల్ల, వివిధ ప్రదేశాలనుంచి భక్తులు వేల సంఖ్యలో  వస్తారు. 
`ప్రత్యేకంగా ఈ రోజే, ఇక్కడే ఎందుకు?` అనే ప్రశ్నకి సమాదానంగా ఒక పురాణ గాథనీ, ఒక భౌగోళిక అంశాన్నీ అనుసంధానంచేసి ఈ విశేషాన్ని చెపుతారు.  

దక్ష ప్రజాపతి తన ఇరవై ఏడుగురు కుమార్తెలనీ (వీళ్ళవే 27 నక్షత్రాల పేర్లు) చంద్రుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. చంద్రుడికి రోహిణీ(కొన్ని చోట్ల రేవతి అని చెపుతారు) అంటే మహా ప్రేమ. అందువల్ల ఆమె తోనే ఉంటూ, మిగిలిన భార్యలని నిర్లక్ష్యం చేస్తాడు. కుమార్తెల పిర్యాదు మేరకు ఎన్నోసార్లు అల్లుడికి నచ్చచెప్పాలని ప్రయత్నించినా తన ధోరణి మార్చుకోక పోవడంతో కోపించి అల్లుడిని క్షయవ్యాధికి గురికావాలని శపిస్తాడు.  శాప విమోచనం కలిగించగల శక్తి శివుడికి మాత్రమే ఉన్నదని గ్రహించి, అతనికోసం తపస్సు చేస్తాడు చంద్రుడు. అప్పుడు పుష్యమాసం చివరి రోజయిన అమావాస్యనాడు శివుడు ప్రత్యక్షమౌతాడు. అదండీ, ఈ రోజు ప్రత్యేకత.  తరువాత చంద్రుడి క్షయవ్యాది ఏమైందో తెలుసుకోవాలంటే కథలో ఇంకొంచం ముందుకు వెళ్ళాలి. శివుడు, `ధక్షుని శాపం పూర్తిగా తొలగించలేను కానీ, కొంత ఉపశమింప చేయగలను,` అంటాడు. దాని వలన చంద్రునికి నెలలో సగం రోజులు క్షయం, మిగిలిన సగం రోజులు తిరిగి వృద్ది ఉంటాయి. అవే రెండు పక్షాలు.
ప్రదేశం గురించా? అదే చెప్పబోతున్నాను.  ఇక్కడ ఉన్నది తుల్యబాగ పాయ అనుకొన్నాం కదా. అది అమావాస్య రోజే సముద్రంలో కలిసిందట. సాగర సంగమం జరిగిన రోజూ, ప్రాంతం అన్నమాట. అమావాస్య  మరునాటి నుంచీ సప్త సాగర యాత్ర మొదలౌతుంది. ఏడు పాయలూ కలిసే చోట్లు కోరంగి, చొల్లంగి, తీర్థాలమొండి, రామేశ్వరం, బ్రహ్మసమాఖ్యం, మాసంగితిప్ప, అంతర్వేది. చొల్లంగి తీర్థంలో అప్పన్న ఎద్దుల్ని ఊరేగిస్తారు. దీనికి కారణం ఏమిటంటే, ఇదే రోజు పరమశివుడు నందీశ్వరుడికి మోక్షం ప్రసాదించాడట. గరగ నృత్యాలు ఉంటాయి. 

శ్రీ సంగమేశ్వరస్వామి వారి దేవాలయంలో శ్రీ రామ చంద్రుడు, హనుమంతుల గుడులు కూడా ఉన్నాయి. కారణం తెలుసుకోవాలంటే త్రేతాయుగానికి వెళ్ళాలి. అరణ్యవాస సమయంలో బంగారు లేడి ఉదంతం తెలుసుకదా? ఆ లేడి సీతా దేవికి కనిపించిన ప్రాంతం బద్రాచలం అంటారు. అక్కడినుంచి దానిని రాముడు చాలా దూరం తరుముకొంటూ వచ్చి బాణంతో కొడితే మారీచుడి మొండెం తూరంగిలో, తల కోరంగిలో పడ్డాయి. రాముడి బాణం రెండింటికీ మధ్య చొల్లంగిలో పడింది. 
చొల్లంగి కాకినాడ నుంచి యానం వెళ్ళే దారిలో ఉంది. దేవాలయం, స్నాన ఘట్టాలు చొల్లంగిలో ఉన్నా ప్రధానమైన తీర్థం ఎం.ఎస్.ఎన్. చారిటీస్ దగ్గరనుంచి, జగన్నాధపురం వంతెన వరకూ జరుగుతుంది. వందలకొద్దీ కొట్లు రోడ్డుకి ఇరువైపులా పెట్టేస్తారు. అది, ఇది అని కాకుండా రకరకాల వస్తువులు అమ్ముతారు. తీర్థాల సంగతి ప్రత్యేకంగా చెప్పేదేముంది, మనమందరం చిన్నప్పుడు చూసి ఉన్నవాళ్ళమే కదా! ఈ రోజు వాహనాలను  దారి మళ్ళించి జి.వేమవరం జామికాయల తూము నుంచి పెనుగుదురు వంతెన, అన్నమ్మ ఘాటీ మీదుగా పంపుతారు.  

జమ్మిచెట్టు సెంటర్ దగ్గర పెద్ద వాటర్ టాంక్ ఉన్న మునిసిపల్ పార్క్ వెనుక రోడ్డులో రంగులరాట్నాలు, జెయింట్‌వీల్స్, మేజిక్ షో స్టాళ్ళు తీర్థానికి నాలుగు రోజుల ముందే ఏర్పాటు చేసి, తీర్థం తరువాత నాలుగయిదు రోజులు ఉంచేస్తారు. కర్జూరం, జీళ్ళు, వేరుశనగ అచ్చులు అమ్మే స్టాళ్ళు జనాలతో కిటకిట లాడతాయి. తాజా జీడి పాకాన్ని మేకుకు వేసి బంగారం రంగులోకి వచ్చేవరకూ లాగడం చూడడానికి బాగుంటుంది. పట్టిన పట్టు విడవకుండా విసిగించే వ్యక్తిని పోల్చడానికి, జీడిపాకంలా సాగుతున్నాడనే నానుడి ఇది చూసే వచ్చి వుంటుంది.  
మొత్తం మీద చొల్లంగి తీర్థం హడావుడి రెండు, మూడు రోజులు ఉంటుంది. రాత్రి పదకొండు, పన్నెండు గంటలవరకూ ఇసుకవేస్తే రాలనంతమంది జనాలు షాపింగ్ చేస్తూ ఆనందిస్తారు.అన్నట్టు చొల్లంగి అమావాస్య ఈ రోజే (Feb 10, 2013).

© Dantuluri Kishore Varma 

16 comments:

  1. చాలా చక్కని ప్రదేశాన్ని పరిచయం చేస్తూ మంచి వివరణ ఇచ్చారు. అమావాస్య - ఆదివారంతో కలిసి వచ్చినపుడు విశిష్టమైన ఫలితాన్నిస్తుంది. చొల్లంగి తీర్థానికి వెళ్లి కొన్ని యేళ్ళయ్యింది :(

    ReplyDelete
  2. ఈ వ్యాఖ్య ప్రచురించవలసిన అవసరం లేదు
    శ, స ల మధ్య కొన్ని చోట్ల తడబడ్డారు. వీలయితే వాటిని కూడా సరిచేయండి, అన్యధా భావించరని ఆశించి చెప్పాను. నొప్పిస్తే మన్నించండి

    ReplyDelete
  3. ధన్యవాదాలు రసజ్ఞ గారు. తెలుగు రాస్తున్నప్పుడు మీరు చెప్పినప్పినట్టు కొన్ని సార్లు తప్పులు వస్తున్నాయి. వాటిని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాను.

    ReplyDelete
  4. బాగుంది.

    ReplyDelete
  5. కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల గురించి చక్కగా అన్ని విషయాలూ రాస్తున్నారు. ప్రాంతీయం కరువయి పాశ్చాత్యం పెరిగిన ఈరోజుల్లో మీలాంటి వారి కృషి ప్రాంతీయనికి ఎంతైనా అవసరం. మీ ప్రతి టపా చదువుతున్నాము. చాలా ఆనందం.

    ReplyDelete
  6. నారాయణ స్వామిగారు, శర్మగారు మీ అప్రీసియేషన్‌కి ధన్యవాదాలు.

    ReplyDelete
  7. చిన్ని ఆశగారు, వీలయినంత మటుకు తూర్పుగోదావరిలో జరుగుతున్న విశేషాలని, ఇక్కడి ప్రదేశాలు, ప్రాముఖ్యతలని రాయడానికి ప్రయత్నిస్తున్నాను. కొన్నిరోజులకి మనకాకినాడలో... బ్లాగు ఒక ప్రామాణికిమైన రిఫరెన్స్‌గా ఉపయోగపడితే అదే ఆనందం. రీడ్ అండ్ ఫర్గెట్ లా కాకుండా ఎప్పటికప్పుడు నా పొరపాట్లని సరిదిద్దుతూ, నచ్చిన విషయాన్ని మెచ్చుకొంటూ మరిన్ని టపాలని రాయడానికి ప్రోత్సహిస్తున్న మీలాంటి శ్రేయోభిలాషులకి కేవలం ధన్యవాదాలు అని మాత్రమే చెప్పగలుగుతున్నాను. ఈ మాటని కేవలం ముక్తసరి స్పందనగా తీసుకోవద్దని మనవి.

    ReplyDelete
  8. thank u for your valuable information

    ReplyDelete
    Replies
    1. chala santhosham kishore varma garu. memu chinnappudu jagannadhapuram park edurukunda vunde intlo vundevallam. ippudu park li vatar tank kattesaru. daba pai nilabadi chollamgi theerdham antha chuse vallam. maa nannagaru theerdham loo konna bulli bulli aata vasthuvulu anni gurthu vachayi. paatha gnyapakalanu "aapatha madhuraalu" gaa andari mundu vunche mee prayatnyaaniki ive maa johaarlu.

      Delete
    2. మీకు నచ్చడం చాలా సంతోషమండి. ధన్యవాదాలు.

      Delete
  9. అది ఫిబ్రవరి 5. సంవత్సరం 1962. కాకినాడ ఇంజనియరింగు కళాశాల లొ, అయిదు సంవత్సరాల్లో రెండొ సంవత్సరం. సైకిళ్ళ మీద చొల్లంగి తీర్థానికి సముద్ర స్నానానికి ఉదయం నాలుగ్గంటలకే నలగురం బయలుదేరాం.
    ఆ రోజు అత్యంత విశేషం. ఏమిటంటే 'అష్టగ్రహ కూటమీ. ఆ రోజు నవగ్రహాల్లొ ఎనిమిది (అది మాక్సిమం) 'మకర ' రాశి లో ఉండడం.
    పూర్ణకుమార్

    ReplyDelete
    Replies
    1. యాభై ఏళ్ళ క్రితంనాటి మీ చిన్నప్పటి జ్ఞాపకాన్నీ ఈ టపా వెలికి తీసిందన్న మాట! మీ స్పందనకి శతకోటి ధన్యవాదాలు పూర్ణకుమార్ గారు.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!