తారకాసురుడు అనే రాక్షసుడు గురించి వినే ఉంటారు కదా అందరూ? శివుడి కోసం తపస్సుచేసి, ఆత్మలింగం కావాలని వరంకోరుకొన్నాడు. ఈ వరప్రభావంవల్ల అత్యంత శక్తివంతుడై దేవతలని కూడా ఇబ్బందులు పెట్టడంతో, వరం ఇచ్చిన శివుడి అంశ వల్ల జన్మించిన పుత్రుడివల్లే అది సాధ్యమౌతుందని భావించి, కుమార సంభవానికి పధకరచన చేస్తారు దేవతలు.
దక్షయజ్ఞం, సతీదేవి మరణం తరువాత తపస్సు చేసుకొంటున్న శివునికి, పర్వతరాజు హిమవంతుని కుమార్తె పార్వతిపై ప్రేమ పుట్టించడానికి మన్మధుని ప్రయోగిస్తారు. పూల బాణాలు వేసి మంచి చేద్దామనుకొంటే, శివుని కోపాగ్నికి మన్మధుడు ఆహుతి అయ్యాడు. కానీ, తరువాత పరమేశ్వరుడు పార్వతిని పరిగ్రహిస్తాడు.
తారకాసురుని సంహరించే కారణంకోసం జన్మించిన కుమార స్వామినే సుబ్రహ్మణ్యేశ్వరుడు అని కూడా అంటారు. ఈతనే తారకాసురుడి మెడలోఉన్న ఆత్మలింగాన్ని ఐదు ముక్కలుగా చేదించి, అతనిని వదించిన వాడు. ఈ ఆత్మలింగం యొక్క ఐదు భాగాలే పంచారామ క్షేత్రాలలో ప్రతిష్ఠించ బడినవి అంటారు. ప్రత్యేకించి సామర్లకోటలో ఉన్న కుమార భీమేశ్వరస్వామి దేవాలయం యొక్క శివలింగాన్ని కుమార స్వామే స్వయంగా ప్రతిష్ఠించాడట. అందుకే ఈ ఆలయానికి కూడా ఆయన పేరే ఉంటుంది.
ఈ తారకాసురుడి కథ ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, కొన్నిరోజులక్రితం కత్తిపూడినుంచి శంఖవరం మీదుగా వెళుతుంటే, శంఖవరం ఊరిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కనిపించింది. నెమలి వాహనం, రాతితో మలచిన విగ్రహాలూ అవీ చాలా బాగున్నాయి.
దారిలో వెళుతూ చూడవలసిన దేవాలయమే కానీ, ప్రత్యేకంగా వెళ్ళవలసినంత ప్రముఖమైనది కాదు. కానీ, శివాలయంలో శివలింగానికి అభిముఖంగా నందిని ఉంచినట్టు, కుమారస్వామి గుడిలో నెమలి వాహనం నాకు కొంచం ప్రత్యేకంగా అనిపించడం కారణంగా మీతో ఈ విశేషాన్ని పంచుకొంటున్నాను.
© Dantuluri Kishore Varma
No comments:
Post a Comment