Thursday, 14 February 2013

అమ్మ బొమ్మ

నెమోనిక్స్(mnemonics) అనే శాస్త్రం గురించి వినే ఉంటారు. ఏదయినా విషయాన్ని జ్ఞాపకంపెట్టుకోవడానికి ఉపయోగించే గుర్తులకి సంబందించినది. కొంచం సులభంగా చెప్పాలంటే ఇంద్రదనస్సులోని ఏడురంగులనీ అదే వరసలో గుర్తించుకోవడానికి VIBGYOR అనే మాట ఉపయోగిస్తున్నాం కదా? తొమ్మిది గ్రహాల పేర్లనీ గుర్తు పెట్టుకోవడానికి ఒకాయన చాల సులభమైన పద్దతి కనిపెట్టాడు. My Very Easy Method; Just Set Up Nine Planets అని. ఈ వాఖ్యంలో ప్రతీ మాట యొక్క మొదటి అక్షరం ఒక్కో గ్రహాన్ని సూచిస్తుంది - Mercury, Venus, Earth,  Mars, Jupiter, Saturn, Uranus, Neptune, Pluto అని. 

ఒక కుర్రోడికి గణితంలో రెండు చిక్కులు వచ్చాయి. మొదటిది, అందరికి లాగానే ఆల్జీబ్రా గుండె గాబరా. రెండవది, అర్థమెటిక్ స్పెల్లింగే రావడం లేదు సరిగ్గా. `వందసార్లు ఇంపోజిషన్ ఇచ్చాను అయినా  మధ్యలో ఐ ఒదిలేసి చస్తావేరా బడుద్దాయ్,` అని లెక్కల మాష్టారు తెగ తిడుతుంటే బిక్కమొహం వేస్తున్నాడు. చుట్టం చూపుగా వచ్చిన మావయ్య ఒక కిటుకు చెప్పాడు A Rat In The House May Eat The Ice Cream అని. బుర్రలో బల్బు వెలిగింది. వాఖ్యాన్ని నాలుగు సార్లు చదువుకొని క్విక్ ఫిక్స్ లాగ మెదడులో అంతికించేసుకోవచ్చు. `మరి ఆల్జీబ్రా అంటే భయం పోయేదెలా? దానికి ఇంకా సులువైన మార్గం చెప్పు,` అన్నాడు. `ఓ దానికేం భాగ్యం. తప్పనిసరిగా. ఆల్జీబ్రానే కాదు, జీవితంలో దేన్ని సాధించడానికైనా, ఒకే ఒక సులభమైన మంత్రం ఉంది. అది రోజూ ఆచరిస్తుంటే కొండయినా కదలి రావలసిందే,` అన్నాడు. `చెప్పు, చెప్పు తొందరగా,` అంటున్నాడు. నేర్చుకోవాలనే ఉత్సాహాం ఒక బీజంలా మనసులో నాటుకొంది. సరైన దిశా నిర్దేశం చేస్తే అది ఒక మహా వృక్షంలా ఎదుగుతుంది. పెదవులమీద ధరహాసం  మెరుస్తూ ఉండగా మావయ్య చెప్పాడు, `Practice makes a man perfect - ఇదే ఆ మంత్రం. అన్నీ చిట్కాలతో సాధించడం కుదరదు. కష్టపడి పనిచేసినప్పుడే ఫలితం ఉంటుంది. రోజూ అభ్యాసం చెయ్యి. భయం దూరంగా పారిపోతుంది. విజయం చేతులు చాచి నీ వైపు పరిగెత్తుకొని వస్తుంది.`

భాషకి లిపిని ఏర్పాటు చేసే వరకూ సంక్లిష్టమైన శ్లోకాల రూపంలో ఉన్న మన విజ్ఞాన సంపదని ఔపోసన పట్టి, మౌఖికంగా తరతరాలకూ అందించిన మహా పురుషులకి కూడా అభ్యాసంతో పాటూ, ఇటువంటి జ్ఞాపకం పెట్టుకొనే చిట్కాలు కూడా ఉండేఉంటాయి. పండితులు గుర్తుపెట్టుకొనే విధం ఒకలా ఉంటే, పామరులది మరొక పద్ధతి. క్లిష్టత లేని లలితమైన పదాలతో పాటలుగా అందిస్తే, బొమ్మల్లో చూపిస్తే మరుపన్నదే రాదు. జానపదుల బుర్రల్లో రామయణ, భారతాలు ఈ రకంగానే శాశ్వతంగా నిలిచిపోతాయి.

ఎవరైనా ఎప్పటికప్పుడు నేర్చుకోక తప్పదు. పెరిగే విజ్ఞానం తోపాటూ, విజయావకాశాలు మెరుగవుతూ ఉంటాయి. చదవడం, వినడం, చూడడంద్వారా అర్థంచేసుకొన్న విషయాలని మెదడులో నిక్షిప్తం చేసుకోవడానికి ధారణ, జ్ఞాపకశక్తి చిహ్నాలూ ఉపయోగించుకోవాలి. అవసరమైనవాటిని సరైన సమయంలో వ్యక్తీకరించగలగడం చాలా ప్రధానమైన విజయ సూత్రం. అందుకే భాషమీద పట్టు సాధించాలి. దీనినే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటున్నాం. చదువుకోసమే చదువు కాదు. మంచి, చెడు విచక్షణ ఉండాలి. హంస పాలనీ నీళ్ళనీ వేరుచెయ్య గలిగినట్టు చెడునుంచి మంచిని వేరుచేసుకొని పొందడానికి ఆధ్యాత్మిక కోణం కావాలి. అడవి ద్వారా ప్రయాణిస్తున్న బాటసారి, దారిలో కనిపించిన పురివిప్పి నాట్యం చేస్తున్న నెమలిని చూసి పరవశించి పోతే, సమయం గడచిపోయి చీకటిలో దిక్కుతోచక కష్టపడవలసి వస్తుంది. అలాగే, ఆకర్షణలకి దాసోహం అంటే బ్రతుకులో అజ్ఞానాంధకారం మిగులుతుంది.   

- ఈ పేరా చదువుతుంటే లెక్చరు విన్నట్టుగా, బోరుకొట్టింది కదా? కానీ సక్సెస్ కావాలంటే ఇవన్నీ ఇంగ్రేడియంట్స్. వీటిని గుర్తుపెట్టుకోవాలి. కష్టం అంటారా? అయితే మీకోసం ఒక అమ్మ బొమ్మ ఇస్తున్నాను. కళ్ళతో చూసి, మనసులో నిలుపుకోండి. 
1. నలుపు అజ్ఞానానికి చిహ్నం. తెలుపు అంటే జ్ఞానం. అందుకే తెల్లటి వస్త్రాలు ధరించి ఉంది. 

2. కాళ్ళదగ్గర హంసలు, వెనుక నెమలి ఉన్నాయి. ఆకర్షణల్లో పడకుండా, విచక్షణతో మెలగమని అర్థం. 

3. అమ్మకు నాలుగు చేతులు ఉన్నాయి. రెండు చేతుల్లో వీణ- కళలకు గుర్తు. ఒకచేతిలో పుస్తకం, ఇంకొక దానిలో జపమాల - విలువలు లేని విద్య, ఆధ్యాత్మిక కోణం లేని చదువు నిరర్థకం. 

4. ఆమె పేరు వాగ్దేవి - వాక్కును ప్రసాదించేది అని. సరస్వతి అని మరొక పేరు ఉంది. సరస్వతి అంటే ప్రవహించేది అని. వాక్కుని ప్రవహించేలా చేసే శక్తి ఆమెకు ఉంది. గాడెస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ కమ్యూనికేషన్.

మన పెద్దవాళ్ళు విజయానికి కావలసిన మూలకాలేమిటో పట్టిక తయారు చేసి ఇవ్వకుండా, అమ్మ బొమ్మలో మలచి ఒక నెమోనిక్ లాగ మనకి ఇచ్చారు. రోజూ నమస్కారం చేసుకొంటూ, వాగ్దేవిని మనసులో నిలుపుకొంటే, మనం చెయ్యాల్సినది ఏమిటో అవగతమౌతుంది.

శ్రీ పంచమి శుభాకాంక్షలు.
© Dantuluri Kishore Varma 

12 comments:

 1. Your Students are lucky to have you as Teacher in present days.

  ReplyDelete
 2. చాలా బాగా రాశారండీ. కష్టమైన విషయాలు ఇలా సులభంగా గుర్తుపెట్టుకునే చిట్కాలు చెప్తే జీవితాంతమూ గుర్తుండిపోతాయి. చిన్నప్పుడు మా తెలుగు మేస్టారు చెప్పిన ఇలాంటి ఒకటి ఎప్పటికీ గుర్తుంది.
  ఇంగ్లిష్ లో ఎక్కువగా spelling mistake చేసే పదం Occasion. దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవటానికి ఇలా చెప్పారు: ఒక్కా యస్ ఐ ఓ యన్ అని చెప్పారు. చాలామంది s బదులు t , లేదా రెండు s లు రాస్తుంటారు.
  సరస్వతీ దేవి పుట్టినరోజు రేపని తెలియజేసినందుకు ధన్యవాదాలు!
  మీకు కూడా, శ్రీ పంచమి శుభాకాంక్షలు!

  ReplyDelete
 3. "అమ్మ బొమ్మ" తో అన్నిటిని సమన్వయ పరచి , చదువులు తల్లి జన్మదిన సంద్ధర్భం గా చక్కని సందేశాన్ని అందజేశారు. మీ వ్యాసం చదువుతుంటే

  "సాధనమున పనులు సమకూరు ధరలోన " అనే సూక్తి గుర్తుకువచ్చింది.

  సుభాకాంక్షలతో - ఇందిర రాజగోపాల్

  ReplyDelete
 4. అరుణగారు మీరు నా బ్లాగుని సందర్శించడం మొదటిసారి అనుకొంటున్నాను. మీకు స్వాగతం. మీ అభినందనకి ధన్యవాదాలు.

  ReplyDelete
 5. నిజమే చిన్ని ఆశగారు. మైండ్ పవర్‌ని ఇలాంటి జ్ఞాపకశక్తి చిట్కాలతో ఎన్నో రెట్లు పెంచుకోవచ్చునట. మీ స్పందనకి ధన్యవాదాలు.

  ReplyDelete
 6. ఇందిరా రాజగోపాల్ గారు నమస్కారం. మీకు నా బ్లాగుకి హృదయపూర్వక స్వాగతం. చాలా విలువైన మాట చెప్పారు. దన్యవాదాలు.

  ReplyDelete
 7. అజ్ఞాత గారు ధన్యవాదాలు.

  ReplyDelete
 8. I must thank you Vanajavanamali garu for your appreciation.

  ReplyDelete
 9. Kishore Varma garu. Well written article, thank you.
  in Point 3 above, you wrote "Viluvalato Koodina Vidya, Adhyadmika Konam leni Chaduvu Niraradhakam". You probably meant, Viluvalu leni vidhya. Or if you meant Viluvalato koodina vidhya manchidi, then you need to split it into two sentences.

  ReplyDelete
  Replies
  1. మీ కరెక్షన్‌కి ధన్యవాదాలండి. పొరపాటును చక్కదిద్ది వాక్యాన్ని మార్చాను.

   Delete

Related Posts Plugin for WordPress, Blogger...

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!