ఈ రోజు వేస్తున్న మొదటి అడుగు విజయాల బాటన పడాలంటే, జీవితంలో చేపట్టబోయే ప్రతీపనికీ ఈ విజయం స్పూర్తి అందించాలంటే కీలకమైన సక్సెస్ సూత్రాలు ఎనిమిదీ ఏమిటో తెలుసుకోవాలి. జ్ఞాపకం పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుందని వీటిని ఇంగ్లీష్ అక్షరాలు మొదటి ఎనిమిదింటిలోనూ(A-H) క్రోడీకరించి ఇవ్వడం జరుగుతుంది.
వెనుక నుంచి ముందుకు వద్దాం.
మొట్టమొదటిది నిజాయితీ(Honesty). మన మాటల్లో, చేతల్లో నిజాయితీ మనల్ని నమ్మదగే వ్యక్తులుగా చేస్తుంది. వ్యక్తిగతమైన, వ్యాపారాత్మకమైన సంబంధాలు కేవలం నమ్మదగిన వ్యక్తులతోనే కదా ఎవరైనా నెరిపేది? ఎక్కువ మందితో నెట్‌వర్కింగ్ విజయానికి దగ్గర దారి అని వ్యక్తిత్వ వికాశ నిపుణులు ముక్త కంఠంతో చెపుతారు.
మనం ఈ రోజు ఇలా ఉన్నాం అంటే దానికి కారణం మనం ఒక్కరమే కాదు. తల్లితండ్రులు జన్మనిచ్చి, జీవితంలో మొదటి పాఠాలు నేర్పిస్తే, గురువులు విజ్ఞానాన్ని అందిస్తారు. స్నేహితులు సంఘంలో స్నేహపాత్రంగా మెలగడానికి అవసరమైన సోషల్ స్కిల్స్‌ని వృద్ది చేసుకోవడానికి సహాయపడతారు. ఇంకా ఇరుగుపొరుగువాళ్ళు, బందువులు, పరిచయస్తులు, మనకి దూరంగా ఉన్నా వారి వారి రచనలతో, సినిమాలతో సృజనాత్మకమైన పనులతో ప్రభావితం చేసే వాళ్ళు అందరూ మనల్ని ఇప్పటి మనంగా తయారుచేసిన శిల్పులు. కాబట్టి `నేను` అనే అహాన్ని వదిలిపెట్టి `అందరువల్లా నేను` అనే భావాన్ని(Gratefulness/Gratitude) అలవరచుకోవాలి.
చీకటి ఉండడం వల్లే వెలుగు యొక్క అవసరం తెలుస్తుంది. కష్టాల వల్ల సుఖాల యొక్క సౌఖ్యం అర్థమౌతుంది. అలాగే అపజయాలని(Failure) ఎదుర్కొన్నప్పుడు, విజయం సాధించాలన్న కాంక్ష రెట్టింపవుతుంది. ఏ అపజయం చివరిది కాదు - తరువాత అందుకోబోయే విజయానికి మొదటి మెట్టు. కాబట్టి ఫెయిల్యూర్‌కి, సక్సెస్‌లో ప్రాధాన భూమిక ఉంది.
సంవత్సరం కష్టపడి చదివితే ఒక క్లాస్ పూర్తవుతుంది. ఏడాది పాటు చదవడం కాలినడక లాంటిదయితే, ఫలితం గమ్యస్థానం. `ర్యాంక్ చూసుకొని ఆనందపడదాం,` అని ప్రతీరోజూ తప్పని సరి కార్యక్రమంలా నిరుత్సాహంతో చదివితే సమయాన్ని ప్రయాణంలోనే పాడుచేసుకొన్నట్టే. ఏ పని అయినా, దానిలో ఆసక్తి, ఉత్సాహం(Enthusiasm) పెంచుకొని కొనసాగిస్తే ప్రతీఅడుగునీ ఆస్వాదిస్తూ ముందుకి సాగవచ్చు.
ఉత్తములు, మధ్యము, అధములు అని మనుష్యులని మూడ రకాలుగా విభజిస్తే - ఏ పనైనా అస్సలు ప్రారంభించని వాళ్ళు అధములు, మధ్యలో విడిచి పెట్టే వాళ్ళు మధ్యములు, నిబద్దతతో కొనసాగించి విజయం సాధించే వాళ్ళు ఉత్తములు. విజేతలని సామాన్యుల నుంచి వేరు చేసే ముఖ్యమైన లక్షణం నిబద్దత (Dedication and determination).
ఏదో సినిమాలో హీరోకి అందరిలాగా ఉద్యోగం చెయ్యడం ఇష్టం ఉండదు. రొటీన్‌గా చేసే దానిలో కిక్ ఉండదని, పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి చెప్పి మరీ దొంగతనాలు చేస్తుంటాడు. ప్రతీ రోజూ ఒక చాలెంజ్ కావాలి. చాలెంజ్ కోసం, కిక్ కోసం దొంగతనాలు చెయ్యమని కాదు కానీ; జీవిత ప్రయాణంలో ఎదురయ్యే అవరోదాలని చూసి అధైర్య పడకుండా, వాటిని సవాళ్ళు(Challenge)గా తీసుకొని అధిగమించాలి.
బూమరాంగ్(Boomerang) అనే మాటని వినే ఉంటారు. ఇంగ్లీష్ అక్షరం వి ఆకారంలో ఉండే చెక్క. దీనిని ఆయుదంగా వాడతారు. గురి చూసి విసిరితే లక్ష్యాన్ని కొట్టి వెనుకకి తిరిగి వస్తుంది. ఇతరుల గురించి మన మాటలు, చేతలూ కూడా బూమరాంగ్ లాంటివే. మంచి మాట్లాడి, మంచి చేస్తే అదే తిరిగి వస్తుంది. చెడు అయితే చెడునే పొందుతాం. ఎవరో అంటారు - Treat others the way you would like them to treat you అని. అందుకే బూమరాంగ్‌ని జ్ఞాపకం ఉంచుకొని ఇతరుల పట్ల మన ప్రవర్తనని మెరుగు పరచుకోవాలి.
అన్ని దినుసులూ చక్కగా వేసి వండిన కూరలో చిటికెడు ఉప్పు వెయ్యకపోతే ఎలా ఉంటుందో, విజయానికి కావలసిన లక్షణాలు, అవకాశాలూ అన్నీ ఉన్నా సరైన దృక్పదం లేకపోతే శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. దృక్పదం అంటే మన దృష్టి కోణం. ఒకే బాల్కనీ నుంచి ఒకరు బురదని చూసి పరిసరాలని తిట్టుకొంటే, ఇంకొకరు ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాలని చూడవచ్చు. మనం ఉండే చోటుని మార్చలేనప్పుడు, రెండవ విధానమే అభిలషణీయం కదా? దీనినే ఆటిట్యూడ్(Attitude) అంటారు. ఆటిట్యూడ్‌కి ఒక ప్రత్యేకత ఉంది. ఇంగ్లీష్ అక్షరాలలో మొదటిది A, 20వది T .. అలా ఈ పదంలో అన్ని అక్షరాలకీ వాటి క్రమంలో విలువలు ఇస్తూ పోతే(1+20+20+9+20+21+4+5) వాటన్నింటి మొత్తం 100 కి సమానం అవుతుంది. మనకి సరైన దృక్పదం ఉంటే 100 శాతం విజయం సాధించినట్టే.
Attitude
Boomerang behaviour
Challenges
Determination and dedication
Enthusiasm
Failure
Gratefulness
Honesty
- ఈ ఎనిమిదీ కలిస్తే విజయం.
(ఈ టపా చదివిన తరువాత మీకు ఒక సందేహం రావచ్చు. కేవలం ఎనిమిది అక్షరాలలోనే ఎందుకు ఈ సూత్రాలని ఇరికించారు అని. మా స్కూల్ ప్రారంభించి నాలుగు సంవత్సరాలు అయ్యింది. ఈ సంవత్సరం మొట్టమొదటి బ్యాచ్ పదవతరగతి పబ్లిక్ ఎక్జాంస్‌కి వెళుతుంది. ఈ రోజు వాళ్ళకి ఫేర్‌వెల్ పార్టీ జరిగింది. బ్యాచ్‌లో ఎనిమిది మంది ఉన్నారు. ఎనిమిది మంది మిత్రుల్లాగ ఈ ఎనిమిది అంశాలని గుర్తుపెట్టుకోమని చెపుతూ వాళ్ళకి శుభాశీస్సులు అందించడం జరిగింది. అదండీ విషయం. మీరు కూడా వాళ్ళకి బెస్ట్ విషెస్ తెలియజేయండి).
© Dantuluri Kishore Varma
good
ReplyDeleteALL THE BEST TO YOUR STUDENTS & YOUR SCHOOL.
ReplyDeleteనమస్కారం. ఈ(మీ) స్కూల్ కథేమిటి? దానిమీద ఒక టపా రాయొచ్చుకదా!
ReplyDeleteశుభాభినందలతో
తేజస్వి
Nice Post. Keep going!
ReplyDeleteచిన్ని ఆశ గారు, వర్మ గారు, శర్మ గారు ధన్యవాదాలు.
ReplyDeleteస్కూలే నా ప్రధాన వ్యాపకం తేజస్వి గారు. టపా రాసేటంత పెద్దది కాదు. మీకు ధన్యవాదాలు.
ReplyDelete