సహబ్లాగర్, మిత్రుడు శ్రీనివాస్ గారు నిర్వహిస్తున్న `మనసంతా నువ్వే` అనే ఫేస్ బుక్ గ్రూపులో ప్రేమలేఖల పోటీ పెట్టారు.
చాలామంది రాశారు. నేనుకూడా ఇదిగో ఇలా...
ఓయ్,
చాలామంది రాశారు. నేనుకూడా ఇదిగో ఇలా...
ఓయ్,
ఏంటి ఇలా మొదలు పెట్టానని అదిరి పడకు. ప్రేమ మాటలు అన్ని చోట్లా ఒకేలా ఉంటాయని విసుక్కొంటావుగా, అందుకే నా స్టయిల్లో ఇలా వచ్చాను.
వర్షం
వెన్నెల
సంగీతం
మంచి పుస్తకాలు
ప్రేమించడం
నన్ను ప్రేమించే నా వాళ్ళని సంతోషంగా ఉంచడం
ఇంకా...
ఇలాంటి కొన్ని విషయాలు నాకు ఇష్టం. కొన్నిరోజులకి పూర్వం, నువ్వు పరిచయం కాకముందు ఓ వెన్నెల రాత్రి మైదానంలో అలా నడుస్తున్నప్పుడు, చల్లగాలి మెల్లగా వీస్తున్నప్పుడు, చెవిలో వినిపిస్తున్న కమ్మని సంగీతం, చేతిలో పుస్తకం ఓ చిరుదిగులుని మనసులో విడిచి పెట్టేవి.తొలకరి జల్లులు కురుస్తున్నప్పుడు, తడిసిన మట్టి వాసన మత్తెక్కిస్తున్నప్పుడు అలాగే అనిపించేది. మనసుకి కలిగే ప్రతీ ఫీలింగుకీ ఒక పేరు పెట్టుకోలేం కానీ, ఎప్పుడో ఓ రోజు అదేమిటో కచ్చితంగా తెలుసుకోగలుగుతాం. `ఇప్పటికయినా తెలిసిందా?` అంటున్నావా? ఆవిషయం చెప్పడానికీ, నీ మీద పిర్యాదు చెయ్యడానికీ ఈ ఉత్తరం!
నీతో మాట్లాడి పూర్తిగా అరగంటైనా కాలేదు. మళ్ళీ మాట్లాడాలనే కోరిక ఈ లేఖని రాయిస్తుంది. ఒకసారి నువ్వు నవ్వినప్పటి జ్ఞాపకం మువ్వల పట్టీల శబ్ధంలా నా గుండెల్లో `ఘల్లు` మంటే, ఇంకోసారి నువ్వు ఐ లవ్ యూ చెప్పినప్పటి తీపి గుర్తు గుండెల్లో వెలిగించిన చుచ్చుబుడ్డి కాంతి కళ్ళల్లో మెరిసినట్టు నా మొహం నాకే ముద్దొస్తుంది. అంతలోనే నువ్వు నా ప్రక్కన లేవన్న స్పృహ నిస్పృహ కలిగిస్తుంది. చూశావా ఇదీ దిగులే!
`నీ ఫీలింగేమిటో అర్థమయ్యిందా?` అని నువ్వు అడిగిన ప్రశ్నకి సమాదానం ఇదే. అప్పుడెప్పుడో నువ్వు పరిచయం కాకముందు నాకు కలిగిన దిగులు పేరు ప్రేమ! `ఎవరి మీద!?` అంటావా? నీ మీదే. అలా ఆశ్చర్య పోవద్దు. `నేనెవరో తెలియదట, కానీ అప్పటికే నామీద ప్రేమట!` అని కోపం చూపించకు.
వెన్నలా, వర్షం అని ఈ ఉత్తరం మొదట్లో నేను చెప్పిన మాటలన్నీ ఒక జిగ్సా పజిల్లో ముక్కల్లాంటివి. వాటన్నింటినీ నాకిచ్చి, అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించుకోమని అంటే, ఎన్నిసార్లు మార్చి మార్చి పేర్చినా ఒక ముక్క తగ్గేది. అసంపూర్తి చిత్రం ఎప్పుడూ ఆనందాన్ని ఇవ్వదుకదా? అప్పుడు నాకు తెలియకుండా నీకోసం వెతుక్కొనే నా తపనే, నా దిగులు. అది ఖచ్చితంగా నీ మీద ప్రేమే!
బీచ్ దగ్గరకి వెళ్ళి నిశ్సబ్ధంగా కూర్చుంటానా, దూరంగా సముద్రంలో మునుగుతున్న డాల్ఫిన్ నోస్, అలల మీదనుంచి వచ్చే చల్ల గాలి, ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాలు, పెద్ద శబ్ధంతో ఒడ్డుమీద విరిగి పడుతున్న కెరటాలు నిన్ను మళ్ళీ జ్ఞాపకం చేస్తాయి. చూశావా మళ్ళీ నా భావాలని సరిగా చెప్పలేకపోతున్నాను! అసలు నిన్నెప్పుడైనా మరచి పోతే కదా, మళ్ళీ, మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడానికి?
తొందరగా వచ్చెయ్యకూడదా, నాకు ఈ ప్రేమలేఖలు రాసుకొనే ఇబ్బంది తప్పుతుంది. నువ్వు దూరంగా ఉంటే నీ గురించి వందల ఆలోచనలు మనసులో ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటాయి. నీకు రాద్దామని మొదలుపెడతానా, ఒక్కసారిగా అన్నీ ముందుకు తోసుకొని వచ్చి `నన్ను రాయి` అంటే `నన్ను రాయి` అని ఉత్తరాన్ని మార్కెట్‌ప్లేస్ చేసేస్తాయి.
`ఏమొహో చిగురుటదరముల- యెడనెడ కస్తూరి నిండెను. భామిని విభునకు రాసిన పత్రిక కాదుకదా...?` అని అన్నమయ్య ఆశ్చర్య పోతాడు. వేంకట నాధునికి అదరాలమీద అలిమేలు మంగ తన పెదవులతో ప్రేమలేఖలు రాస్తే, కస్తూరి రాసినట్టు ఎర్రబడిపోయాయట. నా ఉద్దేశ్యంలో ఇలాంటివే అత్యుత్తమమైన లేఖలు. నువ్వు కూడా నాకోసం అలాంటి లేఖలు రాయడానికి ప్రయత్నించవచ్చు కదా?
" I would ask for more, if I had the sky with all its stars, and the world with all its endless riches. But I would be content with the smallest corner of the earth if only you were mine."
విశ్వకవి చెప్పినట్టు ప్రపంచంలో ఏ మూలయినా, చిన్న జాగా ఉన్నా నీ సాహచర్యంతో ఆనందంగా జీవించచ్చు. అందుకే నీకోసం ఎదురు చూస్తూ......
© Dantuluri Kishore Varma
చాలా బాగుంది కిషోర్ గారూ!
ReplyDeleteఇలా అమ్మాయిలా వ్రాయడం మాటలు కాదు...
మంచి ప్రయత్నం...
వెన్నలా, వర్షం అని ఈ ఉత్తరం మొదట్లో నేను చెప్పిన మాటలన్నీ ఒక జిగ్సా పజిల్లో ముక్కల్లాంటివి. వాటన్నింటినీ నాకిచ్చి, అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించుకోమని అంటే, ఎన్నిసార్లు మార్చి మార్చి పేర్చినా ఒక ముక్క తగ్గేది. అసంపూర్తి చిత్రం ఎప్పుడూ ఆనందాన్ని ఇవ్వదుకదా? అప్పుడు నాకు తెలియకుండా నీకోసం వెతుక్కొనే నా తపనే, నా దిగులు. అది ఖచ్చితంగా నీ మీద ప్రేమే! .............అసలు నిన్నెప్పుడైనా మరచి పోతే కదా, మళ్ళీ, మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడానికి?
విశ్వకవి చెప్పినట్టు ప్రపంచంలో ఏ మూలయినా, చిన్న జాగా ఉన్నా నీ సాహచర్యంతో ఆనందంగా జీవించచ్చు. అందుకే నీకోసం ఎదురు చూస్తూ......సూపర్బ్...@శ్రీ
ధన్యవాదాలు శ్రీగారు. గ్రూపులో అమ్మాయి రాసినట్టుగానే రాసినా, ఇక్కడ చిన్న చిన్న మార్పులు చేసి అబ్బాయి లేఖగా మార్చేశాను. మీ ప్రోత్సాహంతో కవిత్వం చెప్పిస్తున్నారు.
ReplyDeleteచాలా బాగుంది. అన్నట్టు మీరు వానలో తడిసే ఉంటారు.. అందుకే ఇలా వ్రాయగల్గుతారు..అని నేను కాదండీ అందరూ అంటుంటారు :)
ReplyDeleteవానలోని, ప్రేమలోనీ తడవని వారు ఎవరు ఉంటారు చెప్పండి వనజా వనమాలిగారు? :)
ReplyDeleteకష్టేఫలే శర్మగారు, మీ కామెంట్ పొరపాటున డిలీటయిపోయింది (ప్రేమికుల ప్రేమగురించి మాట్లాడే వయసు దాటినట్టుంది, నాకు. బాగుంది)
ReplyDelete~అయినా ప్రేమకు వయసు వుంటుందంటారా శర్మగారు!
కష్టేఫలే శర్మగారు, మీ కామెంట్ పొరపాటున డిలీటయిపోయింది (ప్రేమికుల ప్రేమగురించి మాట్లాడే వయసు దాటినట్టుంది, నాకు. బాగుంది)
ReplyDelete~అయినా ప్రేమకు వయసు వుంటుందంటారా శర్మగారు!
చూశారా ప్రేమకి నా కామెంట్ కూడా ఇష్టం లేకపోయి డిలీట్ అయిపోయింది. :)
అది నా పొరపాటే శర్మగారు. ప్రేమకేమీ సంబంధంలేదు! అయినా ప్రేమలో స్థాయిలు అన్నింటి గురించీ రాసే 100 శాతం క్వాలిఫికేషన్, వయసూ మీకే ఉన్నాయి. :)
ReplyDeleteVarma garu, I have selected your blog as a blog of the week for the readers of our news website,please check here www.goutaminews.blogspot.com
ReplyDeleteme daggara manchi timing undi guru garuu., sarigga varsham paduthuntene me blog chadavalanipistadi ento mari., ante varsham padakunna chaduvuthananukondi..
ReplyDeleteవర్షం పడుతున్నా, పడకున్నా మీరు ఈ బ్లాగ్ చదువుతూ ఉండాలని కోరుకొంటూ ధన్యవాదాలు రమేష్‌గారు.
Delete