Pages

Sunday, 22 September 2013

పూదండ ఇంటర్వ్యూ

పూదండ తెలుగు బ్లాగుల ఆగ్రిగేటర్లో నా ఇంటర్వ్యూ ప్రచురించిన పూదండ నిర్వాహకులకు హృదయపూర్వక ధన్యవాదాలు.  


మీకోసం ఈ ఫోటో
ఇదే:
1. తెలుగు బ్లాగు ప్రపంచం లోకి ఎప్పుడు అడుగు పెట్టారు?దానికి గల ప్రేరణలు ఏమిటి..?

గతసంవత్సరం(2012) జూలైలో `మనకాకినాడలో...` బ్లాగ్ రాయడం మొదలుపెట్టాను. నిజానికి అంతకుముందు నేనొక కంప్యూటల్ ఇల్లిటరేట్‌ని. రెండు సంవత్సరాల క్రితం సిస్టం తీసుకొన్నతరువాత క్రమంగా వాడడంలో మెళుకువలు అలవాటు అయ్యాయి. ఇక బ్లాగ్ విషయానికి వస్తే, చిన్నప్పటినుంచీ రాయాలని నాకున్న ఇష్టమే ప్రారంభించడానికి పెద్ద ప్రేరణ. ఒక టపా ప్రచురించిన తరువాత వచ్చే ప్రతిస్పందన ఇంకా, ఇంకా రాయాలనే కోరికను పెంచుతుంది.

2.బ్లాగు టపాలు రాయడం లో మీ అనుభవాలు వివరించండి.

బ్లాగ్ రాయడం నేర్చుకోవడం అనే ప్రోసెస్‌లో ది బెస్ట్ పార్ట్ అనుకొంటాను. చాలా తక్కువమందికి తెలిసిన అద్భుతమైన విషయం గురించి రాస్తే ఎవరికీ నచ్చకపోవచ్చు. అతిసాధారణమైన రోజువారీ విషయాలగురించి రాస్తే ఎంతో మంది చదవవచ్చు. అలాగే ఎంతో ఆలోచించి రాసినదానికంటే, ఎ మొమెంట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ తో రాసింది గొప్ప టపా అవుతుంది. మనకి ఏది నచ్చుతుంది అనేదానికంటే పాఠకులకు నచ్చేది ఏమిటనేది ప్రధానం. 

`నెమోనిక్స్ సిన్స్ టైం ఇమ్మెమోరియల్` అనే టపాని నా ఇంగ్లీష్ బ్లాగ్‌లో చదివి `ఫణిబాబు మ్యూజింగ్స్` బ్లాగర్ ఫణిబాబుగారు పూనా నుంచి ఫోన్లో ప్రశంసించడం జరిగింది. అలాగే ఇంకొన్ని సందర్భాలలో విదేశాల్లో ఉన్న మనతెలుగువాళ్ళు కూడా ఫోన్‌చేసి బ్లాగ్‌ని మెచ్చుకోవడం ఆనందం కలిగించింది. బ్లాగ్ చదివి ఫేస్‌బుక్‌లో మిత్రులు అయినవారు ఉన్నారు. బ్లాగర్ గా మారి ఉండకపోతే, కాకినాడలాంటి చిన్న పట్టణంలో ఉండే నాలాంటి వాడిని పట్టించుకోవలసిన అవసరం ఎవరికి ఉంటుంది?

రిటైరయ్యి లండన్లో కొడుకుదగ్గర ఉంటున్న మా మాష్టారు ఒకసారి కలిసినప్పుడు, "నీ బ్లాగ్ ప్రతీరోజూ చదువుతాను. చాలా బాగుంది," అని చెప్పడం నాకు గొప్ప ఎచీవ్‌మెంట్ లాంటిది.     
3.మీ టపాల లో సృజనాత్మకత,విషయ పరిశీలన బాగా ఉంటాయి.దానికి మీరు చేసే కృషి ఎలాంటిది..?

చదవడం పాసివ్ ఆక్టివిటీ. చదువుతూ ఉండగా మన ఆలోచనలు ఎక్కడెక్కడో విహరిస్తూ ఉండవచ్చు. మనం ఉన్న పరిసరాల్లోనుంచి మాయమైపోయి, రచయిత సృష్టించిన ప్రపంచంలో సంచరిస్తాం. రాయడం అలాకాదు. రాయబోయే విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని దానిని పాఠకులు మెచ్చగల టపాగా మలచాలి. దానికోసం విస్తృతంగా చదవాలి. వివేకానంద గురించి రాసిన టపాలకోసం ఆయన పుస్తకాల్లో ఆయా భాగాల్ని ఎన్నేసి సార్లు చదివానో లెక్కలేదు.

టపాని వ్యాసంలా రాస్తే తక్కువమంది చదువుతారు. ఉదాహరణకి గౌతమీ ఎక్స్‌ప్రెస్‌ని ప్రారంభించి 25 సంవత్సరాలు అయిన సందర్భంలో దానిగురించి `ఓ అందమైన అమ్మాయి ఆత్మకథ` అని పేరు పెట్టి, నిజంగానే అమ్మాయికథ అనిపించేలా రాయడంతో  అత్యధికంగా చదివారు.  

కథలురాసే విషయంలో కూడా ఈ జాగ్రత్త తీసుకొంటాను. సాధారణంగా ట్విస్ట్‌ని చివర ఉండేలా ప్రయత్నిస్తాను. పాఠకులు ఏఏ అంశాల్ని ఇష్టంగా చదువుతారు అనే అంశాన్ని నిరంతరం పరిశీలిస్తూ ఉంటాను.      
4.మీకు బాగా నచ్చిన కొన్ని బ్లాగుల గురించి చెప్పగలరా..?

కాపీ - పేస్ట్ తరహా బ్లాగులు మినహాయించి నాదృష్టికి వచ్చిన మంచి బ్లాగులన్నీ చదువుతాను. ప్రత్యేకించి పేర్లు చెప్పను కానీ తెలుగులో నా అభిమాన బ్లాగర్లు చాలా మంది ఉన్నారు.

5.ఇంకా మీ ఇతర హాబీలు ఏమిటి?

పుస్తకాలు చదువుతాను. ఎప్పుడైనా చక్కటిప్రదేశాలకి వెళ్ళి చూసి వస్తాను. ఫేస్‌బుక్లో దగ్గరదగ్గరగా పదివేలమంది ఉన్న `మనకాకినాడ` అనే గ్రూపుని నిర్వహిస్తాను.

6.మీ జీవితం లో మరిచిపోలేని సంఘటనలు గురించి మాతో ఏమైనా పంచుకోగలరా..?

చాలా మంచి సంఘటనలు, కొన్ని చెడ్డవీ ఉన్నాయి. మీరు అడిగిన వెంటనే చప్పున ఏవి గుర్తుకు రాలేదు. కాబట్టి, మరచిపోలేని సంఘటనలంటే ప్రత్యేకించి వేటిగురించీ చెప్పలేను.
7.బ్లాగరులకు మీ రిచ్చే సందేశం లేదా సలహా ఏమైనా ఉన్నదా..?

సందేశాలిచ్చేటంత పెద్దవాడ్ని కాలేదు. నన్ను ఇలా పరిచయం చెయ్యాలనుకొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ హ్యాపీ బ్లాగింగి! 
© Dantuluri Kishore Varma 

2 comments:

  1. మీ బ్లాగు లాగే మీ ఇంటర్వ్యూ కూడా బాగుంది ,క్లుప్తంగా,వివరంగా.అభినందనలు.

    Typed with Panini Keypad

    ReplyDelete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!