ఆదివారం సాయంత్రం బాలరాజు బీచ్ వొడ్డున కూర్చొని ఉన్నాడు. కెరటాలు వచ్చి వొడ్డును తాకుతున్నాయి. విషాదపు అలలు మనసును తాకుతున్నట్టు! బాలరాజు విషాదానికి పెద్దకారణాలు ఏమీలేవు. చేతిలో ఉన్న పొట్లంలో మిగిలిన నాలుగు పల్లీలూ తినేసి ఇంటికి వెళ్ళడమే. కాకపోతే ఆ మరునాడు సోమవారం - అదే బాలరాజు విషాదకారణం. చిన్నప్పటినుంచీ అంతే. ఆ ఒక్కరోజూ కేలెండర్లో లేకపోతే ఎంత బాగుండును అనుకొనేవాడు. ఇప్పటికి కూడా వాడిలో మార్పు రాలేదు.
పల్లీలు తినడం మీద దృష్టిలేదు. ఒక్కొక్కటి వొలుచుకొని గింజలని అన్యమనస్కంగా నోటిలో వేసుకొంటున్నాడు. చివరి పల్లీని కూడా తినేసినతరువాత చేతిలో ఉన్న పొట్లం కాగితాన్ని విసిరేస్తూ చూశాడు - దానిలో రాసివున్న మాటల్లో ఒకదాన్ని..... వారానికి ఒక్కసారి వచ్చే ఆదివారాన్ని కూడా నాశనం చేసుకొంటున్నాను... కాగితం మడతలు విప్పి తొందర, తొందరగా చదవడం మొదలు పెట్టాడు. అది ఎవరిదో జ్ఞాపకాల డైరీలో చిరిగిపోయిన పేజీ
* * *
టార్గెట్లతో, డెడ్‌లైన్లతో ప్రాణాలు తోడేస్తున్నారు. ఉద్యోగం చేసుకొంటున్నాం అన్న సంతోషంలేదు. పని అంటే భయం. ఆదివారం వచ్చిందంటే ఆ శెలవు గడచిపోయి సోమవారం మళ్ళీ ఆఫీసుకి పోవాలనే ఆలోచనతో వారానికి ఒక్కసారి వచ్చే ఆదివారాన్ని కూడా నాశనం చేసుకొంటున్నాను.
సైకోసోమేటిక్ అంటారట ఈ రోజు జరిగిన విషయంలాంటిదాన్ని. ఎలాగయినా ఆఫీస్‌కి ఎగనామం పెట్టాలంటే ఏం జరగితే బాగుంటుందో తెగ ఆలోచించాను! దారిలో బైక్ స్లిప్ అయ్యింది. చెయ్యివిరిగింది. కావాలనే పడ్డానేమో అని నాకు అనుమానం. అనుమానం అనేకంటే నమ్మకం అనవచ్చనుకొంటాను.
హాస్పిటల్ ఖర్చు, జీతం నష్టం, కట్టు విప్పించుకొని తిరిగి ఆఫీసుకి వెళ్ళినతరువాత రెట్టింపు అవబోయే పని. ప్చ్! పూతిక పుల్ల ముగ్గురిని చంపిందన్నట్టు, సైకోసోమాటిజం నా దుంప తెంపింది. మానసిక వొత్తడిని తగ్గించుకోవడానికి(Stress Control) ఆరోజే కొంచెం సేపు ద్యానం చేసుకొంటే సరిపోయేది.
ఎడమ చేతికి కట్టుతో ఇంటిదగ్గర కూర్చొని తెగ ఆలోచించాను - టార్గెట్లు ఎలా పూర్తి చెయ్యవచ్చో అని. కొత్త, కొత్త ఆలోచనలు మెదడులోనికి వరదాలా వచ్చేస్తున్నాయి. మరచిపోతానేమో అని పాత డైరీలో ఎప్పటి కప్పుడు రాశాను(Planning).
ఎప్పుడు మామూలు అవుతానా(Health)? ఎప్పుడు పనిలో పడదామా? అని మనసు ఆరాటపడుతుంది. మళ్ళీరోడ్డు ఎక్కినప్పుడే కదా నేను అనుకొన్న ఆలోచనలని అమలు పరచగలను?
ఆకలితో కడుపు నకనకలాడిన వాడు వొడ్డించిన విస్తరాకుమీద పడినట్టు పనిలోకి ఉరికాను(Implementation of the plan). ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇంటూ ప్లేస్ అన్నట్టు నా ప్లాన్ తరువాత ప్లాన్ విజయవంతం అవడం మొదలయ్యింది. మా కంపెనీ సేల్స్ టీంలో మిగిలినవాళ్ళు అందరూ నాకంటే మైళ్ళు వెనుకబడిపోయారు. పని రాక్షసుడిలా తయారయ్యాను. సోమవారం అంటే మనసు ఉత్సాహంతో ఉరకలేస్తుంది.
కంపెనీ యాన్యువల్ మీటింగ్‌లో నా విజయ రహస్యం గురించి చెప్పమని అడిగారు.
`జీవితం సముద్రం లాంటిది. విజయం అవతలి గట్టుమీద ఉంటుంది. దాన్ని చేరుకోవాలంటే షిప్ కావాలి. షిప్(SHIP) అనే మాటలో ఒక్కో అక్షరం ఒక్కో విజయసూత్రాన్ని తెలియజేస్తుంది,` అని చెపుతూ షిప్‌ని నిర్వచించాను.
S - Stress Control
H - Health
I - Implementation
P - Planning
పైన చెప్పిన విజయసూత్రాలలో నిజానికి ప్లానింగ్ తరువాత ఇంప్లిమెంటేషన్ వస్తుంది. కానీ, గుర్తుపెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుందని అలా ఏర్పాటు చేశానని వివరిస్తూ నా కథ వినిపించాను.
హాలు చప్పట్లతో మారుమ్రోగిపోయింది. ఇది ఒక షిప్పు కథ. ఒక విజేత కథ.
* * *
ఇది చదివిన తరువాత బాలరాజు మారాడో, లేదో నాకు తెలియదు. ఒకవేళ మీరే బాలరాజు అయివుంటే మారేవారా?
© Dantuluri Kishore Varma