బ్రతుకు పరుగు పందెం అయిపోయింది. సంతోషం ఎండమావిలా అనిపిస్తుంది. జీవన విధానం సాంకేతికత, సౌఖ్యాల సాక్షిగా రోజురోజుకీ మారిపోతుంది. ఫ్యాన్‌కి బదులుగా ఏసీ కావాలిప్పుడు. సైకిళ్ళ స్థానే బైకులు; వాటిని తోసిరాజని కార్లూ. బజ్జీల స్థానాన్ని బర్గర్లు ఆక్రమించి చాలా రోజులయ్యింది. మల్టీ ఫ్లెక్స్‌లు, మల్టీ క్వీజీన్ రెస్టారెంట్లు రాజ్యమేలుతున్నాయి. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు ప్రతీ ఒక్కరికీ కావలసిందే. వీటన్నింటికీ తోడు ఖరీదైన విద్యా, వైద్యం, రోజు రోజుకీ పెరుగుతున్న ధరలు. సంపాదనకీ, ఖర్చుకీ పొంతన ఉండటం లేదు. ఎంత సంపాదించినా ఇంకా, ఇంకా కావాలి. సోమవారం వస్తుందంటే మళ్ళీ పనిలోకి వెళ్ళాలన్న బెంగ, ఒకటవ తారీకు వస్తుందంటే కొరత బడ్జెట్ చూడాలని ఆందోళన. పులి మీద స్వారీలా కొనసాగించవలసిందే. అలుపు తీర్చుకోవడానికి ఆగామా, ఆ పులే మనల్ని కబళించేస్తుంది. అందుకే ఆపలేని పరుగు, పరుగు, పరుగు..........ఛీ! వీటన్నింటినీ వదిలేసి ఏ అడవిలోనో పర్ణశాలలాంటి ఇంటిలో, ప్రకృతికి దగ్గరగా ప్రశాంతం గా జీవిస్తే ఎంత బాగుంటుంది. ఈ చింతలు, వంతలు, దిగుళ్ళు, తెగుళ్ళు...అన్నింటికీ దూ...రంగా నిశ్చింతగా బ్రతకితే! నిద్ర ముంచుకొని వస్తుంది. ఆలోచనలు చేతన కోల్పోయి, సుషుప్తిలోకి జారిపోతున్నాయి.
నులివెచ్చని సూర్యకిరణాలు ముఖాన్ని తాకుతున్నాయి, పక్షుల కూజితాలు సుప్రబాతం పాడినట్టు వినిపిస్తున్నాయి. బయటనుంచి ఎవరో కట్టెలు కొడుతున్న శభ్ధం వినిపిస్తుంది. ఓరగా వేసిన తలుపు తెరుచుకొని బయటకి వచ్చి చూశాడు. అప్పుడు తెలిసింది తానున్నది ఒక పూరి గుడిసెలో అని. గుడిసె చుట్టూ కొంతమేర పొదలు నరికి శుభ్రం చేసి ఉంది. అది దాటిన తరువాత అన్ని వైపులా ఏపుగా పెరిగిన కంచెలు, పచ్చ గడ్డి, అకాశం వరకూ ఎదిగిన రకరకాల వృక్షాలు, వాటి వెనుక నుంచి పైకి వస్తున్న సూర్యుడు. మంచు పరదాల్లోంచి మచ్చల జీబ్రా చర్మంలా నేలంతా పరచుకొన్న సూర్య రస్మి. దూరంగా మైదానం మలుపు తిరిగి కొండ ఎక్కుతున్నట్టున్న ప్రాంతంలో ఒక కోయ పిల్ల కట్టెలు కొడుతుంది.
అరికాళ్ళక్రింద ఎండిన ఆకులూ, పుల్లలూ నలుగుతూ ఉండగా ఆ పిల్ల దగ్గరకి నడచి వెళ్ళాడు. పలకరింపుగా నవ్వింది. `కాఫీ, టీలుండవు ఇక్కడ. అడవిలోకి పోయి ఏమైనా తెస్తే వండి పెడతాను,` అంది. ఆమె అందించిన గొడ్డలి, తవ్వుగొల అందుకొని అడవిలోకి నడిచాడు.
కాలకృత్యాలు తీర్చుకోవాలి ముందు. ఎక్కడినుంచో నీరు పారుతున్న చప్పుడు వినిపిస్తుంది. చాలా దూరం నడిచాడు. చివరికి ఒకచోట కొండవాగు కనిపించింది. స్నానం చేసి తిరిగి వస్తుంటే ఒకచోట గతరాత్రి అడవి పందులు నేల తవ్వి తిరగేసిన ప్రదేశం కనిపించింది. అక్కడక్కడా సగం కొరికి వదిలేసిన దుంపలు కనిపిస్తున్నాయి. అక్కడ ఇంకా చాలా ఉండవచ్చు. తరువాత ముదర వెదురు గడల కణుపులు నరికి వెదురు బియ్యం సేకరించాలి. ఇద్దరికి సరిపడా దుంపలు, బియ్యం, కొన్ని చింతకాయలూ పోగుచేసే సరికి సూర్యుడు నడినెత్తిమీదకి వచ్చాడు.
దూర దూరంగా ఎక్కడెక్కడినుంచో పొగ సుడులు తిరుగుతూ ఆకాశం వైపు వెళుతుంది. ఈ అడవిలో ఇంకా ఇళ్ళు ఉన్నాయన్న మాట! కడుపులో ఆకలి నకనలాడుతుంది. నిన్న రాత్రి ఫేస్ బుక్కులో పెట్టిన స్టేటస్ అప్డేట్ కి ఏమయినా లైకులూ, కామెంట్లూ వచ్చాయో, లేదో!
వెదురు బియ్యం అన్నం, ఉడకబెట్టిన దుంపలు, నంజుకి చింతకాయలు. ఆవురావురు మంటూ తిన్నాడు. ఆకలి రుచి ఎరగదంటే ఇదేనేమో!
`మీ గూడెంలో జనాలు కలుసుకోరా?` అన్నాడు. `సంత రోజుల్లో, ఏదయినా జాతర అయినప్పుడు,` అంది కోయ పిల్ల.
`మరి కాలక్షేపం?`
`పని ఉంటది కదా? అదే పొద్దు పోయేదాకా,` అంది.
చెట్ల క్రింద ఉడతలు పరుగులు పెడుతున్నాయ్. సుర్యుడు పశ్చిమంవైపు కొండల వెనక్కి జారుకొంటున్నాడు. పక్షులు గుంపులుగా ఎక్కడినుంచో, ఎక్కడికో ఎగిరిపోతున్నాయి. పొదల్లోంచి కప్పలు, కీచురాళ్ళు చప్పుళ్ళు మొదలయ్యాయి. చెట్ల బెరడు నుంచి తీసిన మైనంలో ముంచిన ఒక గుడ్డని కర్రకి చుట్ట బెట్టి, కాగడా వెలిగించింది. చుట్టూ కొండలు చీకటిలో పెద్ద పెద్ద గొరిల్లాల్లాగ ఉన్నాయి.
`ఇక్కడ ఏదీ బాగా లేదు. అనవసరంగా ఈ అడవిలోకి వచ్చి పడ్డాను,` అనుకొన్నాడు.
`ఇక్కడే పడుకోవాల,` అంది గుడిసలో కటిక నేలను చూపించి. లోనికి అడుగు పెడుతూ ఉండగా కాలిమీద మంట పుట్టింది. ఏదో పాకిన చప్పుడు. `అబ్బా!` అన్నాడు బాధతో.
కాగడా వెలుతురులో కాలిమీద సూదితో పొడిచినట్టు రెండు రక్తపు గుర్తులు కనిపిస్తున్నాయి. కోయపిల్లకి అవి ఏమిటో బాగా తెలిసినట్టే ఉంది.`నాగుపాము,` అంది.
భయం జరజరమని వెన్నుపూసలోనుంచి మెదడువరకూ పాకింది. `ఇప్పుడెలా?` అన్నాడు ఆందోళనగా. తొందరగా గుడిస బయటకి పరుగుపెట్టి, ఏవో ఆకులు తెచ్చి, పాము కరిచిన చోట రసం పిండింది.
`ఇది పాము విషానికి విరుగుడా?` అన్నాడు. ఆందోళనతో గొంతు పిడచకట్టుకు పోతుంది.
`తెలియదు దొరా. ఇది ఏస్తే బతకొచ్చు అంటారు. పాములు కరిచి, జొరాలొచ్చి పాణాలమీదకి వస్తే ఏవేవో పసర్లు ఏస్తాం. బతికితే గొప్ప, లేదంటే రాత,` నుదిటిమీద బొటన వేలితో అడ్డంగా రాసుకొంటూ చెప్పింది.
`మరి వైద్యుడు!?`
`వైద్యుడెవరూ ఉండరు దొరా ఇక్కడ. కానీ, ఆ పై కొండమీద గుహలో ఒక సాములోరు ఉంటారు. మంత్రాలేస్తారు,` అంది.
పాముకాటు ఎంత ప్రమాదమో అతనికి తెలుసు. బ్రతకాలంటే ఉన్న ఏ అవకాశాన్ని వదులు కోకూడదు. కాగడా అందుకొని, `పద, దారి చూపించు,` అన్నాడు.
పరుగు, పరుగు, పరుగు.... ఆయాసం వస్తుంది, గొంతు ఎండిపోతుంది. ప్రాణంకోసం పరుగు ప్రపంచం చివరిదాకా పరుగెత్తినట్టు ఉంది. కొండగుహ కాంతి పుంజాలతో వెలిగిపోతూ ఉంది. తెల్లని గడ్డం, పండు ముసలి శరీరం, తలవెనుక కాంతి చక్రం - మునీశ్వరుడు తపోముద్రలో కూర్చుని ఉన్నాడు. వొగుర్పుల శభ్ధానికి కళ్ళుతెరిచి `వచ్చావా?` అన్నాడు.
సమయం మించి పోతుంది. ఒక్క క్షణం కూడా వృదా పరచడానికి లేదని అతనికి తెలుసు. `నన్ను బ్రతికించండి,` అన్నాడు ముకుళించిన హస్తాలతో.
`ఎందుకూ?` స్వామి నుంచి సూటి ప్రశ్న. అతను నివ్వెర పోయాడు. `స్వామీ బ్రతడం ఎందుకా? సర్వజ్ఞానులు మీరా ఇలా అడిగేది!?` అన్నాడు.
మునీశ్వరుడి కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రగా ఉన్నాయి. `ఇంకాస్త సౌకర్యంగా బ్రతకడానికి అడవులనుంచి గ్రామాల్లోకి, అక్కడినుంచి పట్టణాల్లోకీ వెళుతున్నాం. సాంఘిక జీవనంకోసం కోలనీల్లో, అపార్ట్‌మెంట్లలో నివశిస్తున్నాం, ఎక్కువ సుఖం కావాలంటే ఎక్కువసంపాదన కావాలి. అందుకే రోజుకి ఎనిమిది గంటలకి బదులుగా పద్నాలుగు గంటలు పని చేస్తున్నాం. విద్య, వైద్యం లేకుండా మనకి రోజు గడవదు. జీవన ప్రమాణం, ఆరోగ్యం, సాంఘికజీవనం, విజ్ఞానం, సౌకర్య వంతమైన జీవితం.. వీటికొసమే పట్ణవాశం. కానీ, ఏ రోజూ మనం బ్రతుకుతున్న జీవితం గురించి తృప్తిలేదు. దూరపుకొండలు నునుపు అన్నట్టు మన ఆలోచనలు ఎప్పుడూ పర్ణశాలల చుట్టూ తిరుగుతుంటాయి. పనిలో, బాధ్యతల్లో ఆనందం ఉందని తెలుసుకోలేనివాడు ఎక్కడా ఆనందంగా ఉండలేడు. పో, ఇక్కడినుంచి,` అని అతని గుండెలమీద తన్నాడు.
ఆ కుదుపుకి మెలుకువ వచ్చింది. నోరు పిడచ కట్టుకుపోయి ఉంది. నుదిటి మీద పట్టిన చెమట చంపలమీదుగా కారి, తలగడను తడిపేస్తుంది. చీకటిలో వాల్ క్లాక్ చేస్తున్న చప్పుడు భయంకరంగా వినిపిస్తుంది. లేచి వెళ్ళి మంచినీళ్ళు తాగి వచ్చి పడుకొన్నాడు. మళ్ళీ ప్రొద్దున్నే తొందరగా లేవాలి. ఆఫీసులో చాలా పని ఉంది.
© Dantuluri Kishore Varma