తేజా చెప్పిన కథ
`ప్రమీలా నగర్ మూడవవీధికి వెళ్ళాలి,` అన్నాను.
`దెయ్యాల కొంపలుండే వీధా?` అన్నాడు ఆటో డ్రైవర్.
`దెయ్యాల...కొంపలా...!? ఏమో తెలియదు. ఇదిగో ఎడ్రస్,` అని ఆఫీస్ చిరునామా ఉన్న కాగితం చూపించాను.
ఆటో ప్రమీలానగర్ వీధిలోకి తిరుగుతూ ఉండగా పాడుపడిన ఇల్లు కనబడింది. అది దాటిన వెంటనే నిర్మానుష్యంగా ఉన్న పెద్ద డాబా, గేటుకి తుప్పుపట్టిన తాళంకప్ప వేసి ఉంది. `చీకటి పడ్డాకా ఈ వీధిలో తిరగ బాకండి,` అన్నాడు ఆటో డ్రైవర్. వీధిలో ఉన్న మూడవ ఇంటిముందు ఆటో ఆగింది. ఓర్ అండ్ మాస్ట్(Oar and Mast) షిప్పింగ్ కంపెనీ అని రాసి ఉన్న బోర్డ్ చూస్తూ క్రిందకి దిగాను. ఆఫీస్ ఉన్న బిల్డింగ్ తరువాత ఇంకొక ఇల్లు మాత్రమే ఉంది. వీధిఅంతా నిర్మానుష్యంగా ఉంది.
బట్టల బ్యాగ్, బెడ్డింగ్, టేబుల్ ఫ్యాన్లు క్రిందికి దించుకొని; ఫేర్ చెల్లించిన తరువాత ఆటో వెళ్ళిపోయింది. చప్పుడువిని ఓ ఇరవై ఏళ్ళ కుర్రాడు - అటెండర్ అనుకొంటాను- బయటికి వచ్చాడు. నా లగేజ్‌ని చేతుల్లోకి తీసుకొంటూ, `మా తేజా సారు, కొత్తగా వచ్చారు,` అన్నాడు. పక్క ఇంటి గేటు దగ్గర గుబురుగా పెరిగిన బోగన్‌విల్లా నీడలో నుంచొని ఉన్న మనిషిని అప్పుడు చూశాను. ముప్పైఅయిదేళ్ళు ఉంటాయేమో! `చాలా` ఆకర్షణీయంగా ఉంది. మాకుర్రాళ్ళ భాషలో చెప్పాలంటే కత్తిలా ఉంది.
`పక్కింటి రేఖా ఆంటీ సార్. వాళ్ళాయన దుబాయిలో ఉంటాడట. వాళ్ళ అమ్మా, నాన్న, ఇద్దరు పిల్లలతో ఉంటుంది. చాలా మంచావిడ. మీలాంటి స్మార్ట్‌గా ఉన్నవాళ్ళయితే ఏ `హెల్ప్` కావాలన్నా చేస్తుందట.` అన్నాడు ఆఫీసులోకి దారితీస్తూ. హెల్ప్‌ని వొత్తిపలికాడు. కొంటెగా కన్నుకూడా గీటాడు.
* * *
ఆఫీసులో మామూలు రోజుల్లో పెద్దగా పని ఉండదు. ఎప్పుడైనా వెసల్(షిప్) వచ్చినప్పుడు మూడు, నాలుగు రోజులు రాత్రీ పగలూ తేడా లేకుండా పనిచెయ్యాలి. మళ్ళీ ఏ పదిహేనురోజులకోకానీ ఇంకొక వెసల్ రాదు. ఉండేది ముగ్గురమే నేనూ, ఎకౌంటెంట్, అటెండర్.
ప్రయివేటు కంపెనీ కనుక పెద్దగా జీతాలు ఉండవు. ఏదయినా హోటల్లో ఉండి రూం వెతుక్కోవాలంటే, జేబుకి చిల్లుపడుతుంది. కాబట్టి, తక్షణ కర్తవ్యం ఇళ్ళవేట. అ(దుర)దృష్టవశాత్తూ ఆఫీసు పక్కపోర్షన్ ఖాళీగాఉంది. అకౌంటెంట్ దగ్గర ఇళ్ళబ్రోకర్ షణ్ముగం నెంబరు తీసుకొని కాల్ చేశాను.
సింగిల్ బెడ్రూం పోర్షన్ విత్ అటాచ్డ్ బాత్రూం. అద్దెతక్కువ. `తన్నితే బూరెలబుట్టలో పడటం అంటే ఇదేనండి. ప్రక్కనే మంచి హెల్పింగ్ నేచరున్న ఆంటీగారు కూడా ఉన్నారు,` అన్నాడు షణ్ముగం అడ్వాన్స్ తీసుకొంటూ.
సామాన్లు ఇంటిలో పెట్టించాను. సాయంత్రం ఆరు అవుతుండగా, ఆఫీసు మూసెయ్యడానికి తయారవుతున్నాం. అప్పుడువచ్చింది రేఖా ఆంటీ సరాసరి నా టేబుల్ దగ్గరకి. ఆమె నడచి వస్తుంటే కదులుతున్న నడుము ఒంపుల్లో చిక్కుకొన్న నా చూపులు, గతుకులరోడ్డులో ప్రయాణించినట్టు ఎగిరెగిరి పడ్డాయి.
`కొత్తగా వచ్చారట? మా పక్కింటిలోనే దిగడం సంతోషం. ఏదయినా కావాలంటే మొహమాటపడకుండా అడగండి. సాయంత్రం భోజనం పంపిస్తాను,` అంది. మాటల్లో శ్లేష కావాలని పలికించినట్టే ఉంది.
`లేదండి. ఓ మూడురోజులు పనిమీద బయటి ఊరు వెళ్ళాలి. ఇప్పుడే బయలుదేరుతున్నాను. చాలా థాంక్స్!` అన్నాను.
`ఇప్పుడే జేరారు, అప్పుడే క్యాంపా?` అని మతులుపోయేలా ఓ చిరునవ్వు నవ్వి, వెళ్ళిపోయింది.
* * *
అనుకొన్నపని ఒకరోజు ముందే పూర్తయిపోయింది. ఊరిలో ట్రెయిన్ దిగేసరికి రాత్రి పది అవుతుంది. రన్నింగ్ ఆటోలో ప్రమీలా నగర్ జంక్షన్ దగ్గర దిగి, ఇంటివైపు నడవడం మొదలుపెట్టాను. చిన్నగా గాలి వీస్తుంది. `చీకటి పడ్డాకా ఈ వీధిలో తిరగ బాకండి,` అన్న ఆటో డ్రైవర్ మాటలు సడన్‌గా జ్ఞాపకం వచ్చాయి. వెన్నులోనుంచి వొణుకు వొళ్ళంతా పాకింది. నుదుటిమీద చెమట్లు పడుతున్నాయి. గాలివేగం పెరిగింది. మావీధిలోకి మలుపు తిరుగుతుండగా పాడుబడిన ఇంటిలో కిటికీల్లోనుంచి గుబురుగా పెరిగి బయటకి వచ్చిన మొక్కలు గాలికి కదులుతుంటే ప్రేతాత్మలు చేతులుచాచి ఆహ్వానిస్తున్నట్టు ఉన్నాయి. సరిగ్గా అప్పుడే `టప్`మని కరెంట్ పోయింది. వీధిలైటు ఆరిపోయింది. గేటు తీసుకొని లోపలికి వెళ్ళాను.
అంతరాత్మ ఘోషించడం గురించి పుస్తకాల్లో చదవడమే గానీ ఎప్పుడూ స్వయంగా నాకు అనుభవమవ్వలేదు. కానీ, తాళాల గుత్తి తీసి నా పోర్షన్‌వైపు వెళుతుండగా, `వద్దు, వద్దు` అని బలంగా అనిపిస్తుంది. ఇంటిలో కటిక చీకటి. ఎక్కడ ఏముందో తెలియదు. నిజంగా ఇది దెయ్యాలవీధి అయివుంటే! తాళాలు తియ్యడం విరమించుకొన్నాను. లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోవడం కంటే కరెంటు వచ్చేవరకూ డాబా మీద గడపడం మచిది.
అసలు నేను అక్కడినుంచి పారిపోయి ఉండవలసింది. స్టుపిడ్‌లాగ డాబామీదకి వెళ్ళాను. నల్లగా నాచుపట్టిన మెట్లు, పడుకొన్న మృగంలాగ ఉన్న ఓవర్‌హెడ్ టేంక్. వాటర్‌టేంక్ నీళ్ళల్లో చెత్త పడకుండా రేకుతో చేసిన ఫ్రేం ఒకవైపు మేకులు ఊడిపోయి గాలికి పెద్దగా శబ్దం చేస్తూ కొట్టుకొంటుంది. ఎవరైనా మనుష్యులు కనిపిస్తే బాగుండును. రేఖా ఆంటీ ఇంటివైపు నడిచాను. వెనక్కి, కుమారస్వామి ఇంటివైపు తిరగాలంటే భయం వేస్తుంది. పెళ్ళయిన సంవత్సరంలోనే రోడ్డు ప్రమాదంలో చనిపోయిన అతని కూతురూ, అల్లుడూ గురించి తెలుసు. ఆ సంగతి ఇంతకుముందే అటెండర్ చెప్పాడు. రేఖా ఆంటీ ఇంటిలో ఎలాంటి అలికిడీ లేదు. అప్పుడే, పెద్దగా ఈదురుగాలి వచ్చింది. రెండు పెద్ద పెద్ద వర్షపు చినుకులు మీద పడ్డాయి. గాలితో పాటూ ఎవరో గుసగుసగా మాట్లాడుతున్న చప్పుడు. మెడమీద వెంట్రుకలు నిక్కబొడుచుకొంటుండగా గిరుక్కుమని వెనుకకి తిరిగాను....
నేను చూసిన దృశ్యాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. కుమారస్వామి డాబామీద రెండు ఆకారాలు గాలిలో తేలుతున్నాట్టు వేగంగా మెట్లవైపు వెళ్ళడం నా కళ్ళతో చూశాను.....
* * *
శేషగిరి చెప్పిన కథ
దెయ్యాలకొంపట! అసలు నాలాంటివాడికి కావలసింది అదే. నా నలభై అయిదేళ్ళ జీవితంలో దెయ్యాల్లాంటి మనుష్యులని చాలా మందిని చూశాను. మనం భయపడితే అలాంటివాళ్ళకి కానీ, అసలు ఉన్నాయో లేవో తెలియని ఆత్మలకి కాదు. పైపెచ్చు నేను చేసే వ్యాపారానికి షణ్ముగం చెప్పిన ఇల్లు లాంటిదే కరెక్ట్. క్రికెట్ మ్యాచ్‌లు జరిగే సమయంలో బోలెడు హడావుడి ఉంటుంది. చాలా మంది ఫ్రెండ్స్ వస్తారు. డబ్బుకట్టలు చేతులుమారతాయి. ఈ వ్యవహారాలన్ని పబ్లిక్‌లో పెట్టుకోగలమా? అందుకే, వెంటనే ఇళ్ళబ్రోకర్ షణ్ముగం చూపించిన కుమారస్వామి ఇంటిలో దిగిపోయాను. సాయంత్రం నాలుగు పెగ్గులేసి, హోటల్నుంచి తెచ్చుకొన్న చికెన్ బిర్యానీ తిని పడుకొంటే హాయిగా నిద్రపట్టింది. నిజంచెప్పద్దూ, ఈ మధ్యకాలంలో నేను అంత ప్రశాంతంగా నిద్రపోయిందిలేదు.
ఉదయం పేపరు చదువుకొంటుంటే ఆవిడ వచ్చింది. కోరికలు కూరిన మిఠాయి పొట్లంలా ఉంది. పేరు రేఖ అట.
`ఈ ఇంటిలో ఒంటరిగా ఉండటానికి భయం వెయ్యదా?` అంది.
`మీరు తోడువస్తారా?` అన్నాను. ఒక్కక్కళ్ళని చుస్తే వెంటనే ప్రొసీడయిపోవాలనిపిస్తుంది.
`ఇరుగుపొరుగు వాళ్ళం, ఆమాత్రం సాయం చేసుకోలేమా?` అంటూ పక్కుమని నవ్వింది. అలా నవ్వడం కావాలని పైటకొంగు జార్చడానికి ఒక అవకాశం అని నాకు తెలుసు. చప్పున ముందుకు వొంగి ఆమె చెయ్యి పట్టుకొన్నాను.
`ఆ..ఆ.. ఖంగారు పడకండి. సాయం కావలసింది సాయంత్రానికి కదా? కేరేజీ తీసుకొని వస్తాను,` అని వచ్చినంత వేగంగానూ వెళ్ళిపోయింది.
* * *
మబ్బుపట్టింది. వర్షం వచ్చేలా ఉంది. చిన్న ఈదురుగాలి మొదలైంది. రాత్రి తొమ్మిది ఐనా రేఖ రాలేదు. చాలా అసహనంగా ఉంది. అసలు వస్తుందా?
క్షణాలు గంటల్లా అనిపిస్తుండగా మెల్లగా తెరుచుకొన్న తలుపులోనుంచి ముందు మల్లెపూల పరిమళం ముక్కును తాకింది. తరువాత వంగపువ్వురంగు జార్జెట్ చీరలో అప్సరసలా ఆమె నడిచి వచ్చింది.
నా కళ్ళల్లో మెరుపు చూసిందేమో! `ముందు భోజనం తరువాతే ఏమైనా,` అంది.
రాత్రి పది అవుతుందేమో! బయట ఈదురుగాలి వీస్తున్న చప్పుడు వినిపిస్తుంది. `టప్` మని కరెంట్ పోయింది. ఇల్లాంతా చీకటిమయం అయిపోయింది.`ఇప్పుడెలా? క్యాండిల్స్ కానీ, టార్చ్ కానీ లేవు,` అన్నాను.
`డాబా మీదకి వెళదాం,` అంది.
`వర్షం!`
`పరవాలేదు, వర్షంలో చాలా బాగుంటుంది.`
`ఆరుబయట.. ఎవరూ చూడరా?`
`ఎవరున్నారు చూడడానికి? పక్కింటిలో మొన్న దిగిన తేజా రావడంతోనే క్యాంపుకి వెళ్ళాడు. ఇంకా రాలేదు. వచ్చేటప్పుడే చూశాను. తలుపు తాళం వేసి ఉంది.
`అయితే పద,` అన్నాను. మనంచేసే పని గుట్టుచప్పుడు కాకుండా ఉండాలనేది నా పోలసీ. మాంసం తింటున్నామని దుమ్ములు మెడలో వేసుకోం కదా?
మబ్బులు పట్టి చాలా మసకగా ఉంది ఆకాశం. ఎప్పుడైనా వర్షం రావచ్చు. గాలి ఉదృతంగా వీస్తుంది. పక్క ఇంటి డాబా మీద వాటర్‌ట్యాంకుది అనుకొంటాను రేకు పెద్ద చప్పుడుతో `టక టక` మని కొట్టుకొంటుంది.
పైమెట్టుమీద వుండగా చూశాను, ప్రక్క డాబామీద కట్రాయిలా నిలుచున్నా ఆకారాన్ని. మొహం అటుతిప్పి ఉందో, ఇటుతిప్పి ఉందో తెలియడం లేదు. గుండెఝల్లు మంది. ఎప్పుడూ లేనిది వొంటినిండా రోమాలు నిక్కబొడుచుకొన్నాయి.
`ఎవరు?` అన్నాను ఆమెతో గుసగుసగా. అప్పటికే ఆమెముఖం తెల్లగా పాలిపోయి ఉంది. ఏమో తెలియదు అన్నట్టు రేఖ చేతితో సౌ్oజ్ఞ చేస్తుండగా ఆ ఆకారం గిర్రుమని వెనక్కి తిరిగింది. ఒక్కక్షణం కూడా ఆలశ్యం చెయ్యలేదు. చెయ్యీచెయ్యీ పట్టుకొని మూడేసిమెట్లు ఒక్కో అంగలో దిగుతూ పరుగెట్టాం. నిజ్జం! నా కళ్ళతో దెయ్యాన్ని చూడడం అదే మొదటిసారి!
* * *
అయ్యా అదండీ సంగతి. ఇంతకీ నేనెవరో గుర్తుపట్టారా? ఈ కథ మొదలు పెట్టిన ఇంటిబ్రోకర్ షణ్ముగాన్నండయ్యా! తేజా చెప్పిన కథ విన్న తరువాత నాకు నోటమాట రాలేదు. కానీ, శేషగిరి వచ్చి తనకథని చెప్పిన తరువాత జరిగిన విషయం క్లియర్‌గా అర్దమయ్యింది. డాబా మీద వాళ్ళు చూసింది తేజానేనని చెప్పాను. కానీ, తేజాకి మాత్రం అతను చూసింది ఎవరినో నేను చెప్పలేదు. తన సీక్రెట్ ఎవరికీ చెప్పడానికి వీల్లేదని శేషగిరీ వార్నింగ్ ఇచ్చాడు. తేజా ఆ రోజే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు.
The End
© Dantuluri Kishore Varma