రోడ్ జంక్షన్‌లో వెలుగులు చిమ్ముతున్న స్ట్రీట్‌లైట్ దగ్గరనుంచి చీకటిగా ఉన్న కాలేజ్‌రోడ్ వైపుకి వేగంగా దూసుకొని వచ్చింది హీరో్‌హోండా బైక్. గవర్నమెంట్ కాలేజ్ పిట్టగోడ ప్రక్కన ఆగింది. ఇగ్నీషన్ ఆపకుండానే, సైడ్ స్టేండ్ వేసి పాతికేళ్ళ కుర్రాడు బైకు దిగాడు. `ఇక్కడ మూత్ర విసర్జన చెయ్యరాదు` అని గోడమీద నోటిసు రాసిఉన్న వైపుకి పేంట్ జిప్ తీస్తూ నడిచాడు. సెకండ్ షో విడిచిపెట్టి గంటన్నర అయ్యింది. ఫ్రెండ్స్‌తో బాతాకానీ వేసి, చాయ్ తాగి బయలుదేరేసరకి ఆ సమయం అయ్యింది. ఇంటికి వెళ్ళే ముందు ప్రతీసారిలాగే ఇదిగో ఇక్కడ ఆగాడు. రోడ్లన్ని నిర్మానుష్యంగా ఉన్నాయి. వీస్తున్న గాలితో అతను వేస్తున్న విజిల్ కలసిపోతుంది. చంద్రుడు లేని ఆకాశం. చుక్కలు మాత్రం తళుకులీనుతున్నాయి. సరుగ్గా అప్పుడు గమనించాడు... ఒక చుక్క క్రమంగా పెద్దదవ్వడం! చూస్తుండగానే భోజనం ప్లేటంత పెద్దదయ్యింది. పదిచంద్రుళ్ళంత ప్రకాశం!
విశాలంగా ఉన్న కాలేజ్ ప్లేగ్రౌండ్ వైపు వేగంగా ప్రయాణిస్తూ వచ్చింది. చిన్నప్పుడెప్పుడో స్టీవెన్ స్పీల్‌బర్గ్ తీసిన ఈటీ సినిమాలో చూశాడు - యు.ఎఫ్.ఓ! అన్ఐడింటిఫైడ్ ఫ్లయ్యింగ్ ఆబ్జెక్ట్. మన భాషలో చెప్పాలంటే గ్రహాంతరవాసుల వాహనం - ఎగిరే పళ్ళెం. రెండు తాడిచెట్ల ఎత్తులో అలాగే నిలిచిపోయింది. శక్తివంతమైన బ్యాటరీ లైట్ ఫోకస్ చేసినట్టు ఒక కాంతి కిరణం అతని మీద ప్రసరింపబడింది. ఏంట్ఈటర్ అనే జంతువు పొడవైన నాలుకను చాపి చీమల్ని నోటిలోకి లాగేసుకొన్నట్టు, ఆ కాంతి కిరణం అతన్ని యూఎఫ్ఓలోకి లాగేసింది. నేషనల్ జియోగ్రఫిక్ చానెల్లో చూపించే అరుదైన జంతువుల్ని ఫోటోషాప్ చేసి కొత్తజంతువుని సృష్టించినట్టు ఉన్నారు నలుగురు గ్రహాంతరవాసులు.
`నన్నెందుకు తీసుకు వచ్చారు?` అన్నాడు అసంకల్పితంగా.
`మీగ్రహం గురించి కొంత సమాచారం కావాలి,` అన్నాడు ఒకడు.
`మీరు...మీరు... తెలుగు మాట్లాడు తున్నారు. తెలుగు వాళ్ళా!`
`ఆశ్చర్యపోవద్దు. మా కర్ణభేరికి ముందు ఫిల్టర్లు ఉంటాయి. ఎదుటివాళ్ళు మాట్లాడే భాష ఏదయినా డీకోడ్ చేసి మాకు అర్థమయ్యే విధంగా మారుస్తాయి. అలాగే మా పళ్ళ సందుల్లో ఉండే ఫిల్టర్లు మేం మాట్లాడే దాన్ని మీ భాషలోకి తర్జమా చెస్తాయి.`
`సినిమా చూసి ఇంటికి వెళుతున్న నన్ను ఇలా కిడ్నాప్ చెయ్యడం అన్యాయం.`
అతని ఆందోళనని వాళ్ళేమీ పట్టించుకోలేదు. `సినిమా అంటే ఏమిటి?` అన్నాడు అందులో ఒకడు.
గ్రహాంతరవాసులకి మన భూమిమీద విషయాలేమీ తెలియవని అర్ధమైపోతుంది. అయినా, ఇంత టెక్నాలజీ ఉన్న వీళ్ళకి గూగుల్‌లో వెతికితే ఈ విషయాలు తెలియవా! అనుమానాలని ప్రక్కనపెట్టి అన్నాడు, `చెపితే వదిలేస్తారా?` అని.
`చెప్పకపోతే ల్యాబరేటరీలో పెట్టి కోస్తాం. చెప్పు త్వరగా ,` అన్నారు.
`సినిమా అంటే కలల్ని అమ్మే పెద్ద వ్యాపారం. అమ్మాయిలు, ఫైటింగులు, సెంటిమెంట్లు, పంచ్‌డైలాగులు కలిపి కొడితే వారంరోజుల్లో మూడురెట్లు లాభం వస్తుంది. జనం ఎగబడి చూస్తారు. దీనికంటే పెద్దవినోదం మరొకటిలేదు, రాజకీయంతప్ప `
`రాజకీయమా!` అన్నాడు మరొక ఈటీ.
మన భూలోక వాసికి ఒకటి అర్థమైయ్యింది - వ్యవస్థలకి లేదా వ్యాపకాలకి సంబంధించిన నామవాచకాలను వాళ్ళు అవగాహన చేసుకోలేకపోతున్నారు. కొంచెంవివరంగానే చెప్పాలి. ఇలా కొనసాగించాడు.
మాకు నాలుగు రకాలైన ప్రజలు ఉన్నారు. అతి సామాన్యమైన నిరక్షరాస్యులు, తెలివైనవాళ్ళమని భావించే వాళ్ళు, నిజంగా తెలివైన వాళ్ళు, బలముండి సిగ్గులేనివాళ్ళు. వీళ్ళల్లో ఎవరైనా నాయకుడిగా పోటీలో నిలబడవచ్చు. మిగిలిన వాళ్ళు వోట్లు వేసి వాళ్ళని గెలిపించి, తమ సమస్యల గురించి చర్చించి నిర్ణయాలు చెయ్యమని అధికారం ఇస్తారు. దీన్ని ప్రజాస్వామ్యం అని పిలుస్తాం. ఇది ప్రజల చేతిలో ఉండే గొప్ప ఆయుధం. కానీ, ఒక్కసారి నాయకుడిగా ఎన్నికైన తరువాత చాలా మంది ప్రజలమాట మరచిపోయి, తాము చెప్పినట్టు ప్రజలు వినాలని కోరుకొంటారు....` కొంచెం సేపు ఆగి కొనసాగించాడు.... `బలవంతుడైన స్వార్ధపరుడు నాయకుడైతే ప్రజా సంక్షేమంకోసం వెచ్చించాల్సిన డబ్బుని తన స్వంతం చేసుకొంటాడు. ఓడిన వాడు కడుపుమంటతో వాడిని తిడతాడు. టెలివిజన్‌లో చూస్తున్న జనాలకి నాయకుల నిజస్వరూపాలు తెలుస్తూ ఉంటాయి. వాళ్ళని అసహ్యించుకొంటూ చూస్తారు. అదే వినోదం.`
`మరి ప్రజలు వాళ్ళను దించెయ్యవచ్చుకదా?`
ఇందాక చెప్పిన నాలుగు రకాల్లో బాగా తెలివైనవాళ్ళు నాయకుల చేతుల్లో కీలుబొమ్మల్లా ఉండి, వాళ్ళ అధికారానికి పరోక్షంగా సహకరిస్తుంటారు. తెలివైన వాళ్ళమనుకొనే వాళ్ళు ఉపన్యాసాలు ఇవ్వడానికి తప్ప దేనికీ పనికి రారు. కనీసం ఓటుకూడా వెయ్యరు. సామాన్యులు జరుగుతున్న తతంగాన్ని నిశ్సబ్ధంగా గమనిస్తారు. అయిదేళ్ళతరువాత తమదగ్గర ఉన్న ఓటనే బ్రహ్మాస్త్రంతో తలరాతలు మార్చడానికి. కానీ, దురదృష్టవశాత్తూ మళ్ళీ జరిగిందే జరుగుతూ ఉంటుంది. ఒక స్వార్ధపరుడు పోతే, మరొకడు తగులుతాడు. మా కర్మ!`
`మీదగ్గర నేర్చుకోవలసిన గొప్పవిషయాలేమీ లేవు. నిన్ను పంపిస్తున్నాం,` అన్నారు అంతరిక్షవాసులు.
భూలోక వాసికి చాలా సంతోషం అయ్యింది. కానీ ఒక సందేహం ఉంది - తననే ఎందుకు తీసుకొని వచ్చారని. ఆమాటే వాళ్ళని అడిగాడు.
`దేశ రహస్యాలని, ప్రాణాలు పోయినా ప్రక్కదేశాలకే తెలియనివ్వం. అలాంటిది వేరే గ్రహాల వాళ్ళకి ఇవ్వాలంటే `ఇక్కడ మూత్రవిసర్జన చెయ్యరాదు` అని బోర్డు పెట్టినచోటే ఆపని చేసే నీలాంటి సూడో ఇంటెలెక్చువల్సే ఇవ్వగలరు. మంచీ, చెడుగురించి ఉపన్యాసాలు ఇస్తారు. మీదాకా వచ్చేసరికి చిన్న నిబంధనని కూడా పాటించరు. నువ్వు చెప్పిన స్వార్ధ రాజకీయనాయకుల కంటే మీరే పెద్ద స్వార్ధపరులు. కేవలం అవకాశం లేక నిజాయితీగా మిగిలిపోతారు తప్ప, విలువలమీద నమ్మకం ఉండికాదు. అందుకే నిన్ను పట్టుకొచ్చాం,` వాళ్ళు చివరి మాట చెబుతూ ఉండగా, లైట్‌బీం వాడిని తీసుకువెళ్ళి బైకు ముందు నిలబెట్టింది.
© Dantuluri Kishore Varma
`దేశ రహస్యాలని, ప్రాణాలు పోయినా ప్రక్కదేశాలకే తెలియనివ్వం. అలాంటిది వేరే గ్రహాల వాళ్ళకి ఇవ్వాలంటే `ఇక్కడ మూత్రవిసర్జన చెయ్యరాదు` అని బోర్డు పెట్టినచోటే ఆపని చేసే నీలాంటి సూడో ఇంటెలెక్చువల్సే ఇవ్వగలరు. మంచీ, చెడుగురించి ఉపన్యాసాలు ఇస్తారు. మీదాకా వచ్చేసరికి చిన్న నిబంధనని కూడా పాటించరు. నువ్వు చెప్పిన స్వార్ధ రాజకీయనాయకుల కంటే మీరే పెద్ద స్వార్ధపరులు. కేవలం అవకాశం లేక నిజాయితీగా మిగిలిపోతారు తప్ప, విలువలమీద నమ్మకం ఉండికాదు.
ReplyDeleteBaagundi :)
Thanks Satish garu.
Delete