నారదుడు భూలోక సంచారం చేసి వచ్చాడు. రకరకాల వృత్తుల్లో జనాలు సంతోషంగా సేవ చేస్తూ బ్రతుకుతున్నారు. డాక్టర్లు, యాక్టర్లు, నాయకులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు... అందరూ మొహమ్మీద చిరునవ్వు చెరగకుండా పనులు కానిస్తున్నారు. విద్యార్ధుల శ్రద్ధ అమోఘం. తల్లితండ్రులకు వాళ్ళపిల్లల్ని చదివించడమే ప్రధానలక్ష్యం! భూలోకం నిజంగా స్వర్గదామం కదూ? అని మురిసిపోతున్నాడు. అదే విషయాన్ని ఆనందంగా విష్ణుమూర్తికి విన్నవించాడు.
`నీ బొందేం కాదూ!` అని విసుక్కొని, తనచూపుడువేలు పైకెత్తి శున్యంలో నలుచదరంగా టీవీ తెర ఆకారంలో గీశాడు విష్ణుమూర్తి. తెర ప్రత్యక్షమయ్యింది. దానివైపు చూపించి, `చూడు,` అన్నాడు. విష్ణుమాయ కారణంగా అంతకుముందు నారదుడు చూసి మురిసిపోయిన సన్నివేశాల్లో నవ్వుతూ సేవచేస్తున్న జనాలయొక్క బొమ్మలు, వాళ్ళ మనసుల్లో అసలు మాటలు వినిపించాయి.
Photo: Bapu`s Pelli Pustakam |
* * *
(సన్నివేశాల్లో ఎవరు, ఎవరో చెప్పడంలేదు. సంభాషణని బట్టి సులభంగానే గ్రహించవచ్చు అని)
ఎల్.కే.జీ కి లక్ష రూపాయల ఫీజా?
ఏమనుకొన్నారు మా స్కూలంటే? మీవాడ్ని బొచ్చు చేపని తోమినట్టు గంటలకి, గంటలు తోముతాం. ప్పది సబ్జెక్ట్లు, ఇరవై లైఫ్ స్కిల్స్, ఎప్పుడో పుష్కరం తరువాత రాయబోయే ఇంజనీరింగో, డాక్టరో కోర్సుకి ఇప్పటినుంచే ఇన్‌టెన్సివ్ కోచింగ్!
చక్కగా చదువుకొని వృద్దిలోకి రా నాయనా.
ఆ విషయం మీరు చెప్పాలా? చదువుతా, మంచి ఉద్యోగం సంపాదిస్తా, లక్షలూ, కోట్లూ గడిస్తా.. మిమ్మల్ని వృద్దాశ్రమానికి అంకితంచేస్తా.
చక్కని పరిపాలన అందించాలనే నిన్ను ఎన్నుకొన్నాం.
అబ్బా.. చక్కని పాలన కావాలేం! కోట్లు ఖర్చుపెట్టి రాజకీయాల్లోకి రావడం పనికి మాలిన ప్రజాసేవ చెయ్యడానికి కాదు. `నీకెంత, నాకెంత?` అనేదే తారకమంత్రం ఇక్కడ.
భలే రుచిగా ఉంది, ఈ కూర ఎలా వొండారు నాయనా?
ఫుడ్డు కలరు, టేస్టింగ్ సాల్టు, కల్తీనూనె, చెత్తా చెదారాం... బాగుందని రోజూ మాదగ్గర తిన్నావంటే కేన్సరు వచ్చి చస్తావ్!
వైద్యో, నారాయణో హరి!
కాలునొప్పా? ఐదొందలు ఫీజుకొట్టు ముందు. పోయి ఈ వంద టెస్టులూ చేయించుకొని రా. తరువాత వెయ్యిరూపాయల మందులురాస్తాను. లేబొరేటరీవాళ్ళు, మందులకంపెనీ వాళ్ళు బ్రతకాలి కదా? వాళ్ళ సంగతి అలా ఉంచు మాకు నాలుగువేళ్ళూ నోట్లోకి పోవాలా, వద్దా?
డైరెక్టర్ గారూ, విడుదలవ్వబోతున్న మీ సినిమాని చక్కటి సందేశంతో, కుటుంబకథా చిత్రంగా మలచారట?
విజయవంతమైన ఫార్ములాని యాక్టర్లని మార్చి మళ్ళీ వొండాం. బొంబాయి నుంచి హాట్ హీరోయిన్‌ని పట్టుకొస్తే, మాతో సహకరించలేదు. వాళ్ళ అమ్మా, నాన్నలని వెంటబెట్టుకొని వచ్చింది షూటింగుకి.
వోటరుగారు, మీవోటు ఎవరికండీ ఈ సారి?
అందరికీ స్కీములున్నట్టే మాకూ ఉన్నాయి. మంచి చదువు, మంచి కొలువు, మంచి వైద్యసదుపాయాలు, మంచి అభివృద్ధి ఇవ్వగల సచ్చీలుడికే మా వోటు.
* * *
`చూశావా నారదా? వాళ్ళ నవ్వుల వెనుక నిజస్వరూపాలు అవి. పైకి కనిపించేది ఎలా ఉన్నా, ప్రతీ ఒక్కడికీ ఏదో స్కీము ఉంటుంది. అందరి స్కీములూ పారతాయి కానీ పాపం వోటరుదే...` అన్నాడు విష్ణుమూర్తి.
ఘాడంగా నిట్టూర్చి, చిడతలు వాయించుకొంటూ మరో లోకంవైపు సాగిపోయాడు నారదుడు.
© Dantuluri Kishore Varma
Good article . comic and educative
ReplyDeleteధన్యవాదాలండీ!
Deleteme daggara manchi comedy and sense of humor undi guru garuu...
ReplyDeleteథాంక్స్ రమేష్‌గారు :)
Delete