ఒక అమ్మాయి చక్కగా డ్యాన్స్ చేస్తుంటే, `నెమలికి నేర్పిన నడకలివీ..` అని పాడతారుకానీ, నిజానికి అందంగా నడిచి, పురివిప్పి నాట్యంచేసేది ఆడనెమలి కాదు. మగ నెమలి. నెమలి నాట్యంచేస్తుంటే చూడటానికి రెండుకళ్ళూ చాలవు. అలాగే ముఖంచుట్టూ జూలుతో హుందాగా నడచి వచ్చే మృగరాజు రాజసంముందు అన్నీ దిగదుడుపే. `అడవిలో మగ పక్షులకీ, మగ జంతువులకీ అంత అందాన్ని ఇచ్చి, జనారణ్యంలో మాత్రం దానికి వ్యతిరేకంగా చేశాడేమిటీ ఆ సృష్ఠికర్త!` అని చాలా మంది వాపోతుంటారు.
@ NFCL Mini Zoo, Kakinada (Click here to see the details) |
నెమలంటే జ్ఞాపకానికి వచ్చింది - చదువులతల్లి సరస్వతీదేవి పాదాల దగ్గర ఎల్లప్పుడూ నెమలి ఉంటుంది. కుమారస్వామి వాహనం నెమలి. కురుక్షేత్ర యుద్దంలో అభిమన్యుడి రధానికిఉన్న జెండాపై నెమలే ఉంటుందట. మొగల్‌సుల్తాన్ షాజహాన్ ముచ్చటపడి నెమలి సింహాసనాన్ని చేయించుకొంటే పెర్షియా నుంచి దండయాత్రకి వచ్చిన నాదిర్షా ఆ సింహాసనాన్నీ, కోహినూర్ వజ్రాన్ని చక్కా దోచుకుపోయాడు. నెమలి అందానికి ఫిదా అయిపోయి ఎప్పటినుంచో దానికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చేశాం. మనజాతీయపక్షిగా చేసుకొన్నాం.
చిన్నప్పుడు నన్నెవరైనా బొమ్మగియ్యమని అడిగితే కొండలమధ్య సూర్యుడు, ఓ ఇల్లు, కొబ్బరిచెట్లు, పడవ.. వాటితోపాటూ ఓ నెమలీ గీసేవాడిని(నా చిత్రకళాసాధన అక్కడితో ఆగిపోయింది). నెమలిని గియ్యడం సులభం. అందుకో లేక దాని అందానికి మురిసిపోయో తెలియదుకానీ మనవాళ్ళూకూడా దేవాలయాలమీద, ఇళ్ళగడపలమీద, మంచాల సైడ్‌పేనల్స్ మీద, చీరలమీద, తివాచీలమీద, ఎగ్జిబిషన్ల ఎంట్రన్స్‌ల దగ్గర నెమళ్ళఅలంకారం చేస్తుంటారు. కావాలంటే చూడండి - ఈ మధ్యన ఒక ఎగ్జిబిషన్ ప్రవేశద్వారం దగ్గర నెమలిని ఇలా పెట్టి, లైటింగ్ అమర్చారు.
జైపూర్లో సిటీప్యాలెస్ ప్రధానద్వారంచుట్టూ అద్భుతమైన నెమళ్ళు చెక్కి ఉంటాయి. వాటిముందు ఇలాంటివి సూర్యుడి ముందు దివిటీల్లా ఉండడం మాట వాస్తవమేకానీ, ఇంక్రెడిబుల్ ఇండియాని జ్ఞాపకం చెయ్యడానికి ఒక స్పార్క్‌లాగ ఇవి ఉపయోగపడడం వాస్తవమే కదా? ఈ వీడియో చూడండి.
© Dantuluri Kishore Varma
No comments:
Post a Comment