Pages

Sunday 2 February 2014

సుభద్రా ఆర్కేడ్

కాలేజీకి వెళ్ళివస్తూ భానుగుడి జంక్షన్ దగ్గర మంగీలాల్ స్వీట్‌షాపులో టీ తాగేవాళ్ళం. అప్పుడే వేసిన మిరపకాయ బజ్జీలో, సమోసాలో, పాకంలో మునిగి తేలుతున్న గులాబ్ జామూన్లో, జిలేబీనో తిని పదినిమిషాలు వాటి పనిపట్టడానికి, ఓ ఇరవై ముప్పైనిమిషాలు కబుర్లు చెప్పుకోవడానికి వెచ్చించి ఇంటిదారి పట్టేవాళ్ళం. ఇది ఒక పాతిక సంవత్సరాల క్రితం మాట. ఫేవరెట్ హ్యాంగ్ ఔట్ ప్లేసెస్‌లో ఇది ఒకటి. ఇలాంటివి ఇంకా అక్కడక్కడా ఉండేవి - జగన్నాథపురంలో ఉడిపీ హోటల్, గాంధీనగర్లో అయ్యరుహోటల్, సినిమారోడ్డులో వీనస్ హోటల్ లాంటివి. వీటిదగ్గర ఫ్రెండ్స్ వచ్చి తినేది తక్కువ, కబుర్లు చెప్పుకొనేది ఎక్కువ. ఎవరికి అనిపించిందో తెలియదు కానీ వీళ్ళందరినీ ఒకే చత్రం క్రిందకి తీసుకొని వచ్చి ఏకచత్రాదిపత్యపు హ్యాంగ్ అరౌండ్ ప్లేసుని ఏర్పాటుచెయ్యాలని - సుభద్రా ఆర్కేడ్‌ని కట్టి పడేశారు.  
అనుకోవడానికి ఎది ఒక షాపింగ్ సెంటరే కానీ, ప్రతీరోజూ ఇక్కడికి వచ్చి వెళ్ళేటంతమంది జనాలు, కాకినాడలో మరే ప్రదేశానికీ వెళ్ళరేమో అనిపిస్తుంది. ఇంటర్నెట్ సెంటర్లు, గాడ్జెట్ షాపులు, గిఫ్ట్ ఆర్టికల్స్, ఫ్లోరిస్టులు, ఐస్క్రీం షాపులు, బుక్‌షాపులు.. అన్నింటికీ మించి పార్కింగ్ ప్లేస్. కాలేజ్ బ్యాగ్‌లు బుజాలకి తగిలించుకొని అక్కడక్కడా నుంచొని, పార్క్ చేసిన బైకులమీద వాలిపోయి, అటూ ఇటూ నడుస్తూ, ఐస్క్రీం చప్పరిస్తూ... వాళ్ళు చెప్పుకొనే కబుర్లు... కాలేజీ విషయాల దగ్గరనుంచి - కెరీర్ ఆప్షన్స్ వరకూ, ప్రేమకహానీల దగ్గరనుంచి - ఫెయిల్యూర్ స్టోరీల వరకూ, ఫ్యాషన్ల దగ్గరనుంచి - ఫంక్షన్ల వరకూ, సమాజ సేవ దగ్గరనుంచి - సోషల్ నెట్వర్క్ వరకూ... ఎన్నో. కాలేజీ వయసు దాటినవాళ్ళు అయితే బడ్జెట్లు, బాధ్యతలు, సినిమాలు, రాజకీయాలు, పిల్లల పెళ్ళిళ్ళు, చదువులు, వ్యాపార లాభ నష్టాలు... మాటల ప్రవాహం సాగిపోతూ ఉంటుంది. 
మొన్న ఎవరో కుర్రాడు సిస్టం రిపెయిర్ చెయ్యబడును అని పాంప్లెట్ సుభద్రా ఆర్కేడ్ వెనుకవైపు గోడమీద అంటిస్తే, పార్క్ చేసిన బైకుని బయటకు తీస్తూ అది చూసి, ఫోన్‌చేసి పిలిపించి నా సిస్టంని బాగు చేయించుకొన్నాను. రకరకాల వ్యాపారాలు, సేవలకి సంబంధించిన అటువంటి పాంప్లెట్‌లు అక్కడక్కడా అంటించి ఉంటాయి. హ్యాంగ్ అరౌండ్ ప్లేస్ ని లాభదాయకంగా ఉపయోగించుకోవడం - చక్కని ఉపాయం కదా?   
© Dantuluri Kishore Varma

2 comments:

  1. సాయంత్రం వరకు ఎవరి ఉద్యోగాలు వారు చేసుకోవడం. సాయంత్రం ఆఫీసు అవగానే ప్రెండ్స్ ఫోన్ చేసి "ఈ రోజు ప్రొగ్రాం ఏమిటి బాసు" అంటే భయ్యా సుబద్ర అర్కెడ్ కి వచ్చేయి.. అక్కడ కలుసుకున్నాక ఏమిచేయాలో డిసైడ్ ఆవుదాము...
    ఇలా ఎన్ని సార్లు సాయంత్రాలు అర్కెడ్ దగ్గరకి వెళ్ళి అక్కడ ఎన్ని ప్రొగ్రామ్స్ ని ప్లాన్ చేసుకున్నామో...
    నాకు ఈ మధ్యనే పెళ్ళి అవడంతో ప్రెండ్స్ ని కలవడానికి కుదరలేదు కానీ, అంతకు ముందు వరకు రోజూ అర్కెడ్ వద్దే మా అడ్డా ఉండేది సార్...

    మీ పోస్ట్ చదివినా పాత మధురసృత్తులు గుర్తుకు వచ్చాయి... చాలా బాగుంది సార్...

    ReplyDelete
    Replies
    1. ఒక జెనరేషన్ జ్ఞాపకాలన్నీ ఇంచుమించు ఇలానే ఉంటాయి రాజీవ్ గారు. అందుకేకదా ఈ ప్లేస్ చాలా మందికి ఫేవరెట్ అయ్యింది! :) కొంచెం ఆగి మీ అనుభూతులని షెర్‌చేసుకొన్నందుకు ధన్యవాదాలు.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!