పదవతరగతి, ఇంటర్‌మీడియట్ పబ్లిక్ పరీక్షలు దగ్గరపడుతున్నాయి. విద్యార్థులలో పరీక్షల వొత్తిడి రోజురోజుకీ పెరుగుతుంది. తల్లితండ్రులూ, ఉపాద్యాయులూ తమమీద పెట్టుకొన్న అంచనాలను అందుకోగలమో, లేదో అనే ఆందోళణ పిల్లలకి ఉంటుంది. చదివింది మరచిపోవడం, చదవాలనుకొన్నది చదవలేకపోవడం, అన్నం సయించక, నిద్రపట్టక ఇబ్బందిపడడం లాంటి స్ట్రెస్ లక్షణాలు కనిపిస్తుంటాయి. వాళ్ళకి ధైర్యం చెప్పడం పెద్దవాళ్ళ బాధ్యత. వాళ్ళమీద వాళ్ళకి నమ్మకం కలిగేలా తల్లితండ్రులు, ఉపాద్యాయులూ మంచిమాటలు చెప్పాలి. పరీక్షలు కేవలం నెలరోజులు ఉన్న నేపద్యంలో విద్యార్థులు చక్కని టైంటేబుల్ రూపొందించుకొని, అమలుజరపాలి. వొత్తిడిని తగ్గించుకొనే విధానాలు అవలంభించాలి. ఈ క్రింద సూచించిన విధంగా చదివితే చక్కని ఫలితాలు పొందవచ్చు.
1. ముందరి సంవత్సరాల పరీక్షాపేపర్లు పరిశీలించి ఏఏ చాప్టర్లకి ఎన్ని మార్కులు కేటాయించ బడ్డాయో తెలుసుకోవాలి. స్వయంగా పరిశీలించలేని పక్షంలో టీచర్ల సహాయం పొందవచ్చు. ఈ విధంగా చెయ్యడంవల్ల ఏ విషయాలు ఎక్కువ ముఖ్యమైనవో తెలుస్తుంది.
2. ఇప్పుడు ప్రతీసబ్జెక్ట్‌లోనూ చాప్టరలకి కలర్‌కోడింగ్ చేసుకోవాలి. పూర్తిగా చదివేసిన వాటికి ఆకుపచ్చ, అసంపూర్తిగా చదివిన వాటికి పసుపు, అస్సలు చదవని వాటికి ఎరుపు రంగు మార్కింగ్ చేసుకోవాలి. పైన వొకటవ పాయింట్‌లో చెప్పిన అత్యంత ముఖ్యమైన చాప్టర్లు ఎరుపు రంగులోకానీ, పసుపురంగులోకానీ ఉంటే వాటికి సమయాన్ని కేటాయించుకొని సంపూర్ణంగా చదవాలి. ఇక్కడ బట్టిపట్టే విధానం అవలంభించకూడదు. అర్థంచేసుకొని, పాయింట్లవారీగా గుర్తుపెట్టుకోవాలి. మైండ్‌మ్యాపింగ్, నెమోనిక్స్ లాంటి పద్దతులద్వారా జ్ఞాపకం ఉంచుకోవాలి. చిన్న, చిన్న సందేహాలు ఉంటే వెంటనే నివృత్తిచేసుకోవాలి. ఇంతకుముందే పూర్తిగా చదివేసిన చాప్టర్లకి ఆకుపచ్చరంగు కలర్ కోడింగ్ ఇచ్చుకొన్నారు కదా? వాటికి కూడా ప్రతీరోజూ కొద్ది సమయం కేటాయించి రివిజన్ చేసుకోవాలి.
3. చాప్టర్ వారీ ప్రశ్నాపత్రాలు, పూర్తిసిలబస్ మీద పేపర్లు అందుబాటులో ఉంటున్నాయి. మీ ప్రిపరేషన్ పూర్తయిన తరువాత వాటిని ఆన్సర్ చెయ్యాలి. నిపుణులచేత దిద్దించుకోవాలి. చేసిన తప్పులని పరిశీలించి వాటిని సరిదిద్దుకోవాలి. దానికోసం మరికొంత సమయాన్ని కేటాయించవచ్చు.
4. చదవడం ఎంత ముఖ్యమో, ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఫాస్ట్‌ఫుడ్స్ తినవద్దు. సమయానికి భోజనం చేస్తూ, మధ్యలో ఎప్పుడైనా పళ్ళు తినవచ్చు. ఎక్కువగా నీళ్ళు తాగడం చాలా మంచిది. రోజుకి కనీసం ఏడు లేదా ఎనిమిది గంటల నిద్ర అవసరం.
5. మనప్రయత్నం ఎంత నిబద్దతతో చేస్తున్నాం అనేది ప్రధానం. ఫలితం గురించి ఆలోచించడం వల్ల స్ట్రెస్ పెరుగుతుంది. అనుకొన్న మార్కులు వస్తాయా, లేదా అనే ఆందోళన కలుగుతూ ఉంటే పుస్తకాలు ప్రక్కనపెట్టి నాలుగు, ఐదు నిమిషాలు మెడిటేషన్ చేసుకోండి. పరీక్షల తరువాత మీ స్నేహితులతో గడపబోయే సమయం గురించి ఆలోచించుకోండి.
6. ఏకధాటిగా గంటల కొద్దీ చదవవద్దు. ప్రతీ గంటకీ, లేదా రెండుగంటలకి ఒకసారి చిన్న బ్రేక్ తీసుకోండి. గదిలో ఉండకుండా ఆరుబయటకు వెళ్ళండి. కొంతదూరం నడక కూడా మంచిదే. అవకాశం ఉంటే స్నేహితులతో కలిసి చదవండి. చదివిన విషయాలగురించి చర్చించుకొంటే ఇంకా ఎక్కువగా గుర్తుండే చాన్స్ ఉంటుంది.
7. సినిమాలగురించి, ఫేస్‌బుక్ గురించి, క్రికెట్‌మ్యాచ్‌ల గురించి బెంగపెట్టుకోవద్దు. తాత్కాలికంగా వాటికి టాటా చెప్పేయండి.
కేవలం పదవతరగతి, ఇంటర్‌మీడియట్లకే కాదు ఏ పరీక్షలకైనా ఆందోళనని ప్రక్కకినెట్టి, ఇలా తయారయితే విజయం మీదే!
© Dantuluri Kishore Varma
No comments:
Post a Comment