ఆగ్రాలో తాజ్‌మహల్ని, హైదరాబాద్‌లో బిర్లామందిర్‌ని, బెంగులూరులో లాల్‌బాగ్‌ని చూసి ఆనందపడతాం. టూరుకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ముఖ్యమైన ప్రదేశాల వివరాలను తెలుసుకొని, తిరిగివచ్చి, అంతా చూశామని సంతృప్తిచెందుతాం. నిజానికి మనంచూసేది అంతాకాదు - కొంతమాత్రమే! మిగిలినది కూడా చూడాలంటే అక్కడ ఉన్న జనాలని చూడాలి, వాళ్ళరోజువారీ కార్యక్రమాలని గమనించాలి, వాళ్ళతో మాట కలపాలి. బస్టాపుల్లో, ఆటోల్లో, టీదుకాణందగ్గర, మార్కెట్‌లో... స్థానికులు ఊరిగురించి సమాచారం ఇవ్వడానికి నిజంగా ఉత్సాహం చూపిస్తారు. `బాబూ, ఇక్కడ మంచి భోజనం హోటల్ ఏది?` అని అడిగితే ట్రావెల్ బ్రోషర్లలో కనిపించే రెస్టారెంట్లకంటే మెరుగైనవాటిని చూపిస్తారు. కొంతకాలంగా లండన్లో, బోస్టన్లో, ఇంకా మరికొన్ని ప్రదేశాలలో సిటీవాక్స్ అనే టూర్లు నిర్వహిస్తున్నారు. సందర్శకులవెంట గైడ్లు వస్తారు. కెమేరాలు తీసుకొని వెళ్ళి, నడుస్తూ, ఆగుతూ, జనాలతో మాట్లాడుతూ, హిస్టరీ పుస్తకాలలో దొరకని విశేషాలని అర్థం చేసుకొంటూ, ఫొటోలుతీసుకొంటూ ముందుకు సాగడమే. వీటికి వస్తున్న ఆదరణని గమనించి బెంగులూరు లాంటి చోట్లలోకూడా నడుస్తూ నగరాన్ని చూసే అవకాశాన్ని కల్పిస్తున్నారు.
ఊరికెళ్ళినప్పుడు జనాలతో మాట్లాడడం మాట అలావుంచితే, మన సొంతవూరిలోనే అటువంటి పని చెయ్యడం మానేసి చాలాకాలం అయ్యింది. చింతపండుకోసమో, సగ్గుబియ్యంకోసమో కిరాణాకొట్టుకి వెళ్ళం. కాయగూరలకోసం మార్కెట్‌కో, రైతుబజారుకో కూడా వెళ్ళం. మనల్ని చూడగానే ముఖమంతా నవ్వుపులుముకొని పలకరించే కొట్టువాడినీ, కాయగూరలమ్మినీ కోల్పోయాం. మాల్స్‌కి వెళ్ళి ట్రాలీల్లో సరుకులు వేసుకొని, లైన్లో నుంచొని, బిల్లు చెల్లించి వచ్చేస్తాం. ఇక ఆటోవాడినో, రిక్షావాడినో(link) మాట్లాడించడానికి మనఊళ్ళో మనబండి దిగి వాడి బండి ఎక్కే అవసరమే రాదుకదా! బయట మల్టీప్లెక్స్‌లు, ఇంటిలోకి టీవీలు, చేతిలోకి సోషల్‌నెట్‌వర్క్‌లు వచ్చిన తరువాత వర్చువల్ ప్రపంచం విశాలమైపోయి, వాస్తవప్రపంచం కుంచించుకుపోయింది.
అప్పుడెప్పుడో కష్టేఫలే శర్మగారు(link) ఈ విషయంగురించి ఒక చక్కని మాట అన్నారు `మనకి పక్కవారిని పలకరించడానికే సమయం లేదండి, పోగేతతో,(link)` అని. నిజమేకదా, పలుకరించక ఎంతకోల్పోతున్నామో!
© Dantuluri Kishore Varma
వర్మాజీ! పలకరింత పులకరింత తెస్తుంది. మనుషులు దగ్గరైతే మనసులు దగ్గరవుతాయి. ఎవరి జాగ్రతలో వారుండాలనుకోండి. పలకరింపులేక జీవితం నిస్సారంకాదా! టపాలో నన్నూ ఇరికించేసేరు కదా! :)
ReplyDeleteమెచ్చుతునక లాంటి మాట చెప్పారు శర్మగారు. ధన్యవాదాలు. :)
Deleteమానవ సంబందాలను కోల్పోయి, యంత్ర(యాంత్రిక) సంబందానికి , అసహజ వాతావరణమే నాగరికత అనుకొనే స్థాయికి ఎదిగాము (దిగాము)
ReplyDeleteమెరాజ్‌గారు మీరన్నది అక్షరాలా నిజం.
Delete