Pages

Thursday, 6 February 2014

సాధనమున పనులు సమకూరు ధరలోన.

తొంభైఐదుసంవత్సరాలకి పైగా జీవించిన అన్నమయ్య ముప్పైఆరువేల సంకీర్తనలని రచించాడు. రోజుకి ఒకటి చొప్పున రాసి, పాడినా  తొంభైఐదు ఏళ్ళలో అన్ని కీర్తనలని కూర్చడం అసాధ్యం. అసాధ్యమైనది సుసాధ్యం చేశాడు కనుక ఆయన వంశంలోనే ఆ గొప్పతనం ఉండిఉంటుంది అనుకోవచ్చు. కానీ అన్నమయ్య తండ్రికానీ, తాతగారుకానీ సంకీర్తనా చార్యలు అనే దాకలాలు ఏమీలేవు. పండితుల వంశం అయి ఉండవచ్చు. కానీ పాండిత్యాన్ని వేంకటనాధునిపై భక్తితో రంగరించి వీనులవిందైన సంగీతాన్ని సృష్టించడం అన్నమయ్యకే సాధ్యమయ్యింది.


వేమన చెప్పినట్టు - 

అనగ ననగ రాగ మతిశ యిల్లుచునుండు
దినగ దినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినురవేమ!

పాడగా, పాడగా తెలియకుండానే ఇన్ని వేల సంకీర్తనలు పోగుపడి ఉంటాయి. ఇక్కడ నేను చెప్పాలనుకొన్న విషయం ఏమిటంటే ఏదయినా సాధించాలనుకొన్నప్పుడు చేస్తూ పోవడమొక్కటే ప్రధానమైన అంశం అని. యూరోప్‌లో విలియం టర్నర్ అనే గొప్ప వాటర్‌కలర్ పెయింటర్ ఉండేవాడు. డబ్బై అయిదేళ్ళు జీవించి 19,000 పెయింటింగులని వదిలి వెళ్ళాడు. ఆయన ఒకసారి తన స్నేహితుడికి ఉత్తరం రాస్తూ `నా ఒకే ఒక్క విజయరహస్యం పరిశ్రమ` అని రాశాడట. డాక్టర్ థామస్ మన్రో అనే ఆయన యువకుడైన టర్నర్‌ని ఉద్యోగంలో పెట్టుకొంటాడు. చెయ్యవలసిన పని కోజన్స్ అనే పెయింటర్ సగం, సగం వేసి వదిలేసిన వాటిని నకళ్ళు చేసి పూర్తిచెయ్యడం. రోజూ ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకూ పనిచేసేవాడట. మూడో, నాలుగో చిత్రాలు పూర్తయ్యేవి. వెయ్యగా, వెయ్యగా నైపుణ్యం  పెరిగింది. వేగం అలవాటయ్యింది. క్రమంగా బ్రష్ రంగులో ముంచి కాగితమ్మీద అద్దితే అదే గొప్ప కళాఖండమయ్యింది.

చదువులో, ఉద్యోగంలో, వ్యాపారంలో ఎన్నో నైపుణ్యాలని ఒంటబట్టించుకోవలసి ఉంటుంది. ఇంగ్లీషులో చక్కగా మాట్లాడటం రాకపోతే ఉద్యోగం దొరకక పోవచ్చు. సహోద్యోగులతో కలిసి ఒకటీముగా పనిచెయ్యకపోతే ఉద్యోగమే పోవచ్చు, పోటీని అర్థంచేసుకొని కొత్త మార్కెటింగ్ స్ట్రేటజీస్‌ని ఉపయోగించకపోతే వ్యాపారాన్ని మూసుకోవలసి రావచ్చు. మరి, నైపుణ్యాలు ఎలా మెరుగు పరచుకోవాలి అంటే - మళ్ళీ వేమనగారిని అడగవలసిందే - సాధనమున పనులు సమకూరు ధరలోన.  
© Dantuluri Kishore Varma

No comments:

Post a Comment

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!