చాలా సార్లు అవకాశం కష్టం అనే ముసుగు ధరించి వస్తుందట. కష్టాలు, బాధలు, ఆటంకాలు రాకూడదని కోరుకొంటే వాటితో పాటు వచ్చే అవకాశాలు కూడా రావడం మానేస్తాయి. అలాగని మన జీవితాల్లోకి ఇబ్బందులు రావాలని కోరుకోమని కాదు. ఒకవేళ కష్టనష్టాలను భరించవలసి వచ్చినప్పుడు, వాటిని సహనంతో ఓర్చుకొంటే తరువాత అంతా మంచే జరుగుతుంది అనే ఆశావహదృక్పదం అలవరచుకోవాలని అలా చెపుతారు.
పాకిస్తాన్‌లో తాలిబన్ ప్రభావిత ప్రాంతాల్లో మహిళలమీద చాలా ఆంక్షలు ఉంటాయి. వాళ్ళకి బడికి వెళ్ళి చదువుకొనే స్వాతంత్ర్యంకూడా ఉండదు. బ్రతుకు దుర్భరంగా ఉంటుంది. స్కూల్‌కి వెళ్ళే అమ్మాయిలు ఏవిధమైన వ్యతిరేకతని ఎదుర్కొంటున్నారో ఒక అమ్మాయిచేతే బ్లాగ్ రాయిస్తే బాగుంటుందని బిబిసి వాళ్ళు భావించి మలాలా యూసఫ్‌జాయ్ అనే ఒక ఏడవతరగతి అమ్మాయిని ఎన్నుకొన్నారు. అదికూడా ఆమె తండ్రి స్కూళ్ళు నిర్వహిస్తున్న వ్యక్తికనుక సాధ్యమైంది. బడికివెళ్ళడమే జీవన్మరణ సమస్య అయినప్పుడు, తాలిబన్లకి వ్యతిరేకంగా రాయడమా?
స్కూల్‌బస్‌లో ఇంటికివెళుతుండగా, తాలిబన్లు బస్‌ని ఆపి, మలాలాని తలమీదకాల్చారు. అదృష్టవశాత్తూ ఆమె మరణించలేదు. ఈ సంఘటన జరిగి సుమారు ఒక సంవత్సరం అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా అరవైకోట్ల అమ్మాయిలు ఎదోఒకకారణంగా చదువుకి దూరంగా ఉంచబడుతున్నారు. వాళ్ళతరపున మాట్లాడగలిగిన ఒక ప్రతినిధిగా ఇప్పుడు మలాలా గుర్తించబడుతుంది. ఎన్నో అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ఐయాంమలాలా అనే పుస్తకం రాసింది. మలాలా ఫండ్‌ని నిర్వహిస్తుంది.
నిన్న న్యూయార్క్‌లో గ్లామర్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ అనే వార్షిక కార్యక్రమం ఒకటి జరిగినప్పుడు, ఎంతో మంది నటీమణులు, పాప్ సింగర్లు, యంగ్‌పొలిటీషియన్లు.. వాళ్ళందరితో పాటూ మలాలా కూడా హాజరయితే - జనాలనుంచి మలాలాకి మాత్రమే హృదయపూర్వకమైన, ఉత్సాహవంతమైన ప్రతిస్పందన వచ్చిందట. `వి లవ్ యూ, మలాలా` అని హర్షధ్వానాలు చేశారట.
సంవత్సరంక్రితం కేవలం కొద్దిమందికి మాత్రమే తెలిసిన ఒక ధైర్యంకల టీనేజర్, ఇప్పుడు ఒక అంతర్జాతీయ సెలబ్రిటీ. మరచిపోకూడని విషయం ఏమిటంటే ఆమె ఈ స్థాయికి రావడానికి మొదటి అడుగు మరణం అంచు వరకూ ఆమెని తీసుకువెళ్ళిన కష్టం - తాలిబన్ల దుశ్చర్య.
© Dantuluri Kishore Varma
No comments:
Post a Comment