గోదావరి నదీపాయలైన గౌతమి, వశిష్టల మధ్య ఒకవైపు బంగాళాఖాతంతో ఉన్న డెల్టా ప్రాంతం - కోనసీమ. త్రికోణాకారంలో కోన(కొండ)ని పోలిఉన్న సీమ(ప్రాంతం) కనుక దీనిని కోనసీమ అంటారట. తూర్పుగోదావరిజిల్లాలో పదహారు మండలాలు కోనసీమలో ఉన్నాయి. అవి అమలాపురం, సఖినేటిపల్లి, రాజోలు, మలికిపురం, పి.గన్నవరం, అంబాజీపేట, మామిడికుదురు, కొత్తపేట, ఆత్రేయపురం, అయినవిల్లి, అల్లవరం, ఉప్పలగుప్తం, రావులపాలెం, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ.పోలవరం మండలాలు.
గోదావరిమీద బ్రిడ్జీలు నిర్మించడానికి పూర్వం కోనసీమనుంచి బయట ప్రదేశానికి రాకపోకలు లాంచీలమీద, పడవలమీద జరిగేది. ఇప్పటికీ లాంచీ ప్రయాణాలు పాతబడిపోలేదు. గోదావరినది దాటుతున్నప్పుడు దూరంగా మధ్య, మధ్యలో కనిపించే లంకల్లాంటి ఇసుకమేటలు, చిన్నచిన్న అలలు లాంచీ అంచులకి తగిలి నప్పుడు మీదపడే నీటి తుంపరలు, చల్లగా వీచే గాలి, లాంచీలో జనాల రణగొణద్వని- పదిహేను, ఇరవై నిమిషాల ప్రయాణం డ్రీం జర్నీలా ఉండేది.
సమృద్ధిగా నీటివనరులు, అత్యంత సారవంతమైన నేలా ఉన్న కారణంగా పంటలు చాలా బాగా పండుతాయి. కనుచూపుమేర విస్తరించిన వరిపొలాలు, కొబ్బరితోటలు, కాలువల్లో నింపాదిగా సాగే పడవలతో కేరళానుంచి ఒకముక్క కత్తిరించి ఆంధ్రాలో అతకించినట్టు ఉంటుంది కోనసీమ. కోనసీమలో రైతే రాజు. పొలానికి నీరు పెట్టుకోవడం, దుక్కిదున్నుకోవడం, విత్తనాలు జల్లుకోవడం, నాట్లువేసుకోవడం, కలుపుతీసుకోవడం, ఎరువులు, పురుగుమందులు జల్లుకోవడం, కోతలు కోసుకోవడం, కుప్పలునూర్చుకోవడం, ధాన్యాన్ని మార్కెట్టుకో, ఇంటికో చేర్చుకోవడం, మళ్ళీ పైర్లు చల్లుకోవడం...ఏడాదంతా పనే! దాళవాలకి నీరు వదలనప్పుడో, తుఫాన్లు కన్నెర్రజేసినప్పుడో, పంటలకి కిట్టుబాటుధర సరిగా లేనప్పుడు తనంతట తాను క్రాపు హాలిడే ప్రకటించుకొన్నప్పుడో తప్పించి రైతుకి శలవు లేదు. ఇక్కడ వరి తరువాత ఎక్కువగా పండించే పంట అరటి. రావులపాలెంలో అరటి మార్కెట్ రాష్ట్రంలోనే ప్రముఖమైన వాటిల్లో ఒకటి. తెలతెల వారుతూ ఉండగా, మంచు తెరలు ఇంకా భూదేవి మేనిపైనుంచి తొలగకముందే సైకిళ్ళమీద రైతులు అరటిగెలలు మార్కెట్లకి తీసుకువెళుతుండడం ఒక మనోహరమైన దృశ్యం.
కోనసీమలో ఎన్నో దేవాలయాలున్నాయి. ర్యాలిలో జగన్మోహినీ కేశవస్వామి, మురమళ్ళలో వీరేశ్వరస్వామి, ముక్తేశ్వరంలో క్షణముక్తేశ్వరస్వామి, అప్పనపల్లిలో వేంకటేశ్వరస్వామి, అంతర్వేదిలో నరసింహస్వామి, అయినవిల్లిలో శ్రీ సిద్దివినాయకస్వామి, మందపల్లిలో శనేశ్వరస్వామి ఇక్కడి కొన్ని ప్రముఖమైన దేవాలయాలు.
`గుళ్ళూ, గోపురాల్లాంటివేనా ఇంకా ఏమైనా ఉన్నాయా?` అంటారా? అన్నీ చెప్పాలంటే ఒక్క టపా సరిపోదు. అలా అని చెప్పకుండా ఉండాలంటే మనసొప్పదు. అందుకే మీకోసం, నాకోసం కొన్ని విశేషాలని ఇక్కడ ఇస్తున్నాను. అవి ఏమిటంటే.. ఆదుర్రులో బౌద్ద స్థూపం, మలికిపురంలో దిండీ రిసార్ట్స్, ముమ్మిడివరంలో బాలయోగి ఆశ్రమం అమలాపురంలో కోనసీమకే మొట్టమొదటి డిగ్రీ కాలేజ్ ఎస్.కే.బీ.ఆర్ కాలేజ్. ఆత్రేయపురం పూతరేకులు, బండారులంక చీరలు, కోనసీమ కొబ్బరికాయలు, ఆప్యాయంగా పలకరించే ప్రజలు ఈ ప్రాంతం ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. ఎవరో చెప్పినట్టు కోనసీమ అంటే వర్షంలా కురిసిన చిలకాకుపచ్చరంగు కల. ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు! కెమేరాని ఎటుతిప్పి తీసినా అందమైన దృశ్యమే వస్తుంది.
ఈ సారి ఇక్కడికి వచ్చినప్పుడు జనసామాన్యాన్ని కూడా చూడండి. కలుపుతీసే పల్లె పడుచులు, మైదానంలో మేకలని కాసుకొనే ముసలికాపరి, చెట్లకొమ్మలకి తాడు ఉయ్యాల కట్టి ఊగే చిన్నపిల్లల గుంపు, కాలువలో ప్రపంచాన్ని మరిచి ఈతలుకొట్టే యువకులు, సంధ్యా సమయంలో పడవతెడ్డుమీద గెడ్డం ఆనించి సూర్యాస్తమయాన్ని చూస్తున్న నావవాడు, ఆవులమందని ఇంటిదారిపట్టిస్తున్న కుర్రాళ్ళు... ఏదయినా మీ కెమేరా కంటికి అందమైన ఫోటోని ఇవ్వవచ్చు.
ఫేస్‌బుక్‌లో కోనసీమ అనే పేజీని ఇక్కడ చూడండి
© Dantuluri Kishore Varma