Pages

Saturday 21 December 2013

నాతో పందెం కాయకు!

ఈ రోజు నా పుట్టినరోజు. ఫ్రెండ్స్‌తో కలిసి చిన్న పార్టీ. ఫ్రెండ్స్ అంటే ఎదో పదిమందిమి కాదు. కేవలం ముగ్గురమే -సాయి, వీరేంద్రా, నేనూ. ఆనంద్ థియేటర్ ప్రక్కన ఉన్న పేస్ట్రీ షాపులో ఉన్నాం. తినేసి, తరువాత సినిమాకి పోవడం ప్రోగ్రాం.  

`చాలా కాలానికి కాకినాడ వచ్చావు. అదీ నీ పుట్టిన రోజు నాడు. మాకు చాలా ఆనందంగా ఉంది. నీ పుట్టినరోజు అని కాదురోయ్. నువ్వు ఇలా పార్టీ ఇవ్వడం బాగుందని,` అన్నాడు సాయి.

`నాన్నగారికి మళ్ళీ ఇక్కడికే ట్రాన్స్‌ఫర్ అయ్యింది. నిఖిల్ కాలేజీలో జాయినవుతున్నాను. రేపే,` అన్నాను. 

`అదంతా ఫేస్‌బుక్‌లో స్టేటస్ అప్డేట్ చేశావు కదరా? మళ్ళీ సోది ఎందుకు? మాకు తెలియంది ఏదయినా చెప్పు. లేదంటే, నీకు తెలియంది నేను చెపుతాను విను. నేనూ అదే కాలేజ్! మళ్ళీ మనిద్దరం క్లాస్‌మేట్స్ అవుతున్నాం. అహోయ్!` అన్నాడు వీరేంద్ర. 

`ఒరేయ్, ప్రాంక్స్(Pranks) ప్లేచేసి చాలా కాలం అయ్యింది. ఈ రోజు సరదాగా ఎవరినైనా ఆటపట్టించి, మాకు మంచి బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వాలి,` అన్నాడు వీరేంద్ర. అప్పటికే స్ప్రింగ్‌రోల్స్ తినేసి షాప్‌బయటికి వచ్చేశాం. వాడి దృష్టి థియేటర్‌కి ఎదురుగా పార్కింగ్ ప్లేస్‌లో స్విఫ్ట్‌ని పార్క్ చేసి క్రిందకి దిగుతున్న ఓ నలభై ఏళ్ళ వ్యక్తిమీద నిలిచి ఉండడం గమనించాను. 

`నేనే మీకు ఇవ్వాలా? అదేం కుదరదు. కావాలంటే పందెం కాయి,` అన్నాను. 

`వంద! అదిగో ఇప్పుడే ఆ కారు దిగిన అంకుల్‌ని ఆటపట్టించాలి నువ్వు,` అన్నాడు వీరేంద్ర.. సాయి నవ్వుతూ తమాషా చుస్తున్నాడు. ఇలాంటి పందాలు మాకు మామూలే. కాబట్టి వెంటనే అంగీకరించి ముందుకు నడిచాను.  

ఆయన దగ్గరకి వెళ్ళి `ఎక్స్యూజ్‌మీ, సర్,` అన్నాను. ఏమిటన్నట్టు చూశాడు. `నూకాలమ్మగుడికి ఎలా వెళ్ళాలో చెపుతారా?` అన్నాను. 

`ఈ వోవర్ బ్రిడ్జ్ దాటిన వెంటనే కుడిచేతి వైపుకి తిరిగి కొంచం ముందుకి వెళితే ట్రాఫిక్ ఐలెండ్ వస్తుంది. అది దాటిన వెంటనే కుడిచేతి వైపునే ఉంటుంది గుడి ,` అన్నాడు. అని ముందుకు నడిచాడు.

కొంచెం తటపటాయించినట్టు నటించాను. అతని వెనుకే రెండడుగులు వేసి, `సర్, మరోలా అనుకోకండి. మీరు చెప్పిన ఎడ్రస్ కరెక్టే కదా?` అన్నాను.

`వాట్ డు యూ మీన్?` అన్నాడు.

`అది కాదు సర్, ఇప్పుడే ఇంకొకాయనని అడిగాను. ఆయన మీరు చెప్పిన దానికి ఆపోజిట్ డైరెక్షన్ చూపించాడు.` 

`అతనికి ఊరు కొత్త అయి ఉంటుంది,` అన్నాడు.

`ఆయన తెలివైన వాడిలా కనిపించాడు. కాబట్టే నమ్మాలనిపిస్తుంది.`

`నమ్మాలనిపిస్తే నమ్మి వెళ్ళలేక పోయావా? నన్నెందుకు మళ్ళీ అడగడం? ఇప్పుడు నేను అతనంత తెలివిగా కనిపించడం లేదా?` అన్నాడు కోపంగా, `కానీ, ఇది తెలివితేటల సమస్యకాదు. నూకాలమ్మ గుడికి అలాగే వెళ్ళాలి.` 

`నూకాలమ్మ గుడికి దారి ఎవరు అడిగారు మిమ్మల్ని? మీరు కన్‌ఫ్యూస్ అయినట్టున్నారు. నేను అడిగింది భానుగుడికి దారెటని,` అన్నాను. నాకు నవ్వు ఆగటంలేదు. నా పెదవులమీద అణిచిపెట్టుకొంటున్న కొంటెనవ్వుని అతను గమనించాడు. `ఈడియట్,` అని వడివడిగా వెళ్ళిపోయాడు.   

దూరంగా నుంచుని తమాషా చూస్తున్న నా ఫ్రెండ్స్ దగ్గరకి విజయగర్వంతో వెళ్ళాను. వీరేంద్ర వోటమి ఒప్పుకొన్నట్టు నాచేతిలో వందరూపాయలు పెట్టాడు. 

`నాతో ఎప్పుడూ పందెం కాయకు,` అన్నాను.

`నాతో కూడా కాయకు. ఎందుకంటే, నువ్వు రేపు జాయినవ్వబోతున్న నిఖిల్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆయన. అంటే, మన ప్రిన్సీ!` అన్నాడు వీరేంద్ర . 
© Dantuluri Kishore Varma 

8 comments:

  1. hata vidhi! ala jariginda?
    bavundi kishore garu :)

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు సునీత గారు :)

      Delete
  2. పందాలు కాయడం, ఆట పట్టించేందుకు మాట మార్చడం చిన్ని చిన్ని ఆనందాల జీవితం .... యౌవ్వనం రోజులు గుర్తుకు తెస్తూ, బాగుంది పోస్ట్
    అభినందనలు దంతులూరి కిషోర్ వర్మ! శుభోదయం!!

    ReplyDelete
    Replies
    1. లైఫ్‌ని ఆనందమయం చెయ్యడానికి ఇలాంటి చిన్న చిన్న తమాషాలు కావాలండి - కనీసం కథల్లో అయినా సరే! మీ కామెంట్ చాలా సంతోషాన్నిచ్చింది చంద్రగారు. ధన్యవాదాలు.

      Delete
  3. చదువుతుంటే మనస్సు ఆనందంగా ఉంది, ఇలాంటి తలపులు మళ్ళీ జీవాన్ని నింపుతాయి యాంత్రిక జీవనము లో, అభినందనలు వర్మాజి

    ReplyDelete
    Replies
    1. నిజమే మెరాజ్‌గారు. మీరు చూసే ఉంటారు యూ ట్యూబ్‌లో గ్యాగ్స్-జుస్ట్ ఫర్ లాఫ్స్ అనే చానెల్ ఉందండి. దానిలో చూపించే జనాలని ఆటపట్టించే వీడియోలు చూస్తుంటే కడుపుబ్బ నవ్వవలసిందే! లాఫ్టర్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ ద ట్రబుల్డ్ మైండ్! మీ కామెంట్‌కి ధన్యవాదాలు.

      Delete
  4. కథ బావుందండి . ఇలాంటి చిన్న చిన్న సరదా సంఘటనలే ఎప్పుడు గుర్తుకు వచ్చినా మనసుకి ఆనందం. ఆహ్లాదం. నైస్ వర్క్ . రీడింగ్ హ్యాపీ.. thank you !

    ReplyDelete
    Replies
    1. మీనుంచి ప్రశంస అందుకోవడమంటే ఒక స్పెషల్ ప్రివిలెజ్ లాంటిదే! ధన్యవాదాలు వనజగారు.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!