`ఈ ఊరికి కొత్తగా వాచ్చాం. ఒక ఇల్లు కొనుక్కొని స్థిరపడదామని అనుకొంటున్నాం. మీ తాతగారి ఇల్లు మెయిన్‌రోడ్డుకి ఆనుకొని మూడవ వీధిలో ఉందట. ఎంతో చెపితే, మిగిలిన వ్యవహారాలు మాట్లాడుకొందాం,` అన్నాడు అతను మురళీమోహనరావుతో.
చాలాకాలంనుంచి ఖాళీగా ఉన్న ఆయింటిలోనుంచి ప్రతీరాత్రీ ఏవో శబ్దాలు వస్తూ ఉంటాయని, మంచి మంచి వాసనలు కూడా వస్తాయని, ఎవరో మాట్లాడుకొంటున్నట్టు వినిపిస్తుంటుందనీ... ఇవేమీ చెప్పకుండా వచ్చినతనికి ఇల్లు అమ్మేశాడు.
చవకగా దొరికిన ఇంటిలోకి పెళ్ళాం పిల్లలతో దిగిపోయాడు ఇల్లు కొనుక్కొన్న దొరబాబు. మొదటి రాత్రినుంచీ చీకటిగదుల్లో లైట్ల కాంతి, వంటగదిలోనుంచి తియ్యని వాసనలు, గుసగుసలు.. వెన్నులోనుంచి వణుకు వచ్చేలా ఉంది. ఇల్లు ఖాళీ చేసి, లాడ్జీలో గది తీసుకొని పడుకొన్నారు.
మోసంచేసి ఇల్లు అమ్మేశారని తెలిసినా ఏమీ చెయ్యలేని పరిస్థితి. మురళీమోహనరావుని అడిగితే - `నేనేమన్నా అమ్ముతానన్నానా? మీరేకదా కోరి కోరి వచ్చి అడిగారు?` అని తప్పించుకొన్నాడు. విషయం తెలిసినవాళ్ళకీ, తెలియని వాళ్ళకీ చెపుతూనే ఉన్నాడు దొరబాబు. ఏమయినా ఫలితం ఉంటుందేమో అని ఒక వెర్రి ఆశ.
శివాజీరావు చెవిలో పడింది విషయం. `పద వెళ్ళి చూద్దాం అన్నాడు`.
చీకటి పడుతుండగా వెళ్ళారు. మార్పేమీలేకుండా అలాగే ఉంది సందడి అంతా. ఎవరూ ఏమీ వండకుండానే నోరూరించే వాసనలు. `దెయ్యాలు పార్టీ చేసుకొంటున్నట్టున్నాయి. పద అలా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుందాం,` అన్నాడు శివాజీరావు. దొరబాబుకి చాలా భయం వేస్తుంది. కానీ, విషయం ఏమిటో తెలియాలి కదా?
`ఏమైనా కబుర్లు చెప్పు అన్నాడు. కొత్తగా చూసిన సినిమాలో బ్రహ్మానందం గురించో, ఆలీ గురించో చెప్పు,` అన్నాడు శివాజీ రావు. మెల్లగా సంభాషణ జరుగుతుంది. ఇద్దరూ సినిమా జోకులు, మామూలు జోకులు, అవీ, ఇవీ అన్నీ చెప్పేసుకొంటున్నారు. నిమిషాలు గంటలుగా మారుతున్నాయి.
ఇళ్ళదగ్గర వాళ్ళ పెళ్ళాలకి భయం మొదలైంది. ఆరు గంటలకి వెళ్ళినవాళ్ళు ఎనిమిదయినా తిరిగిరాలేదు. జరగకూడనిది ఏమైనా జరగలేదుకదా అని.
వాళ్ళనీ, వీళ్ళనీ బ్రతిమాలి పోగేశారు. అందరూ వెళ్ళి చూసేసరికి శివాజీరావూ, దొరబాబు కూర్చొని జోకులమీద జోకులు చెప్పేసుకొని, నవ్వేసుకొంటున్నారు. ముఖ్యంగా దొరబాబు జోకులు అదిరిపోయేలా ఉన్నాయి. వచ్చినవాళ్ళూకూడా నవ్వడం మొదలుపెట్టారు.
`మీరు భలే చెప్తున్నారండీ కబుర్లు,` అన్నాడు, ఆడవాళ్ళకి తోడువచ్చినవాళ్ళలో ఒకడు.
`నిజమే, దొరబాబుదగ్గర మంచి నవ్వించే కళ ఉంది. రేపుసాయంత్రం కూడా కొంచంసేపు కూర్చుందాం రండి,` అని ఆహ్వానించాడు శివాజీరావు. ఒక కాలక్షేపం మొదలైంది. ఆ మరునాడు వాళ్ళు వస్తూ కూడా మరికొంతమందిని వెంటబెట్టుకొని వచ్చారు. అలా, అలా రోజువారీ కాలక్షేప కేంద్రంగా మారిపోయింది దొరబాబు ఇల్లు.
చిత్రం ఏమిటంటే అప్పటినుంచీ మళ్ళీ దెయ్యల హడావుడి ఏమీలేకుండా అయిపోయింది ఆ ఇంటిలో. `మనుషులు వచ్చేశారుకదా, మనమెందుకు ఇక్కడ అనుకొన్నాయేమే!`
నోట్: ఈ కథలో లాజిక్ వెతక్కండి. ఉత్కంఠత కలిగించడానికి సరదాగా రాసింది. హారిస్ టోబియస్ అనే ఆయన రాసిన హాంటెడ్ అనే కథ ఆధారం.
© Dantuluri Kishore Varma
No comments:
Post a Comment