Pages

Sunday 5 January 2014

పద్మాపురం కబుర్లు

అరకులో పద్మాపురం గార్డెన్ ప్రవేశద్వారం ఆకర్షణీయంగా ఉంటుంది. ఆర్చ్ మీద మనిషి బుర్రా, చేతులూ ఉంటాయి. ఒకచెయ్యి చెంపకు చేర్చుకొని ఉంటే, మరొక చేతిలో భూగోళం ఉంటుంది. సందర్శకులు తప్పనిసరిగా దానిముందు ఫోటోలు తీయించుకొంటారు. మేము కూడా అక్కడ నుంచొని ఫోటోలు దిగుతుండగా స్వెట్టర్ వేసుకొన్న ముసలి వ్యక్తి దగ్గరకు వచ్చి, `టీ తాగుతారా?` అని అడిగాడు. `ఇప్పుడుకాదు, చూసి వచ్చిన తరువాత,` అన్నాం. ఎంట్రన్స్‌కి కుడివైపున, రోడ్డుకి అటువైపు ఉన్న చిన్న టీ స్టాల్‌ని చూపించి అక్కడికే రమ్మన్నాడు.  
సాధారణంగా అరకులోయలో నాలుగు గంటలనుంచే చలి పెరిగిపోయి, చీకట్లు కమ్ముకోవడం మొదలౌతుంది. ఒకవేళ లైటింగ్ ఫెయిలయితే పద్మాపురం గార్డెన్స్‌ని స్కిప్ చేసి వెళ్ళిపోదామనుకొన్నాం. కానీ, మా అదృష్టం కొద్దీ ఆరోజు అయిదున్నర అయినా వెలుగు ఉంది. నిటారుగా పెరిగిని ఎత్తైన చెట్లని, చెట్లమీదకట్టిన ట్రీటాప్ హౌస్‌ని చూద్దామని ఉద్దేశ్యం. మిగిలినదంతా మామూలు పార్క్ లాగానే ఉంటుంది. లోనికి వెళ్ళాం. ఎత్తైన చెట్లు ఉన్నాయి కానీ ట్రీహౌస్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఓ దశాబ్ధం క్రిత్రం వెళ్ళినప్పుడు చూసిన వాటిని ఇప్పుడు పిల్లలకి చూపించి ఆనంద పరుద్దామంటే నిరుత్సాహం మిగిలింది. బహుశా దానిని తీసేసి ఉంటారు. లేదా, మేమే మిస్సయ్యామో! 
పిల్లలు మా ఆల్బంలో చూసిన ఈ ప్లేస్ ఇప్పుడు మిస్సింగ్! `పోతే పోనీలెండి డూడ్స్ ఇప్పుడు మరో ఫన్ చేద్దాం,` అనుకొని డైనోసార్ల పని పట్టమంటే  ఒకళ్ళు డైనోసార్ పొట్టలో దూరి దానిని గిరగిరమని తిప్పితే, మిగిలిన ఇద్దరూ ఒకళ్ళు తోకా, మరొకళ్ళు బుర్రా పట్టుకొని చిట్టచివరికి దానిని మచ్చిక చేసుకొన్నారు. ఇంతకీ ఈ పిల్లలు ముగ్గురూ ఎవరో పరిచయం చెయ్యలేదు కదూ? చెప్తా - మా అమ్మాయిలు శ్రావ్య, వర్షితా; మా అన్నయ్యగారి అబ్బాయి ప్రణీత్. అప్పుడు తీసిన ఫోటో ఇదిగో ఇదే!  
తిరగని టోయ్ ట్రెయిన్, పనిచెయ్యని ఫౌంటెన్ అన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఏదీ సవ్యంగా లేకపోయినా ఎంట్రన్స్ టికెట్ కౌంటర్ మాత్రం చక్కగా నడుస్తుంది. టూరిజం డెవలప్మెంట్ వాళ్ళ దృష్ఠి అంతా ఆదాయం అభివృద్ది మీద మాత్రమే ఉన్నట్టుంది. ఎక్కడికక్కడ కలక్షనే! 
పార్క్ బయట టీ ముసలాయన మాకోసం ఎదురుచూస్తున్నాడు. టీ చాలా బాగుంది. టీ కాసే ఆవిడ పిల్లలు  అక్కడే కూర్చుని చదువుకొంటున్నారు. `బడికి వెళుతున్నారా?` అని అడిగాను. కాన్వెంటుకాదు, గవర్నమెంట్ బడికే వెళుతున్నారని చెప్పింది. ఒక స్వచ్చంద సంస్థవాళ్ళు పుస్తకాలు, బట్టలు ఉచితంగా ఇస్తారట. బట్టలంటే ఒకటో, రెండో జతలు కాదు; సంవత్సరానికి ఆరు జతలు - స్కూల్ యూనీఫాం, మామూలు బట్టలు, చలి కోట్లూ కూడా ఇస్తున్నారంది. ఏదయినా మతసంస్థ అయ్యివుంటుందని అనుకొన్నాను కానీ, కాదట. `ఇక్కడ ఉండడానికి బాగుంటుందా?` అని అడిగితే `చాలా!` అని నవ్వుతూ చెప్పింది. `వూరు వెళితే, ఏముంటుంది అక్కడ?` అంది. టీ కొట్టు మీద మంచి ఆదాయమే వస్తుంది, పిల్లలు చక్కగా చదువుకొంటున్నారు. ఇంకేమి కావాలి అనేదే ఆవిడమాటల్లో ఆంతర్యం.
వెచ్చని టీ గొంతుదిగిన తరువాత, చల్లని వాతావరణంలో ఘాట్‌రోడ్ ద్వారా వైజాగ్ వైపు బయలుదేరాం.

© Dantuluri Kishore Varma

2 comments:

  1. Varma Garu,Edi Savyanga leka poina Entrance Ticket Counter Baga Pani chestunnadi comment chala bavundi,,chala chakkaga lighter vein lo cjepparu

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ నవీన్‌గారు.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!