Pages

Sunday, 12 January 2014

మళ్ళీ అలాగే జరిగింది

బీచ్ ఫెస్టివల్ గత సంవత్సరంకి లాగే ఉంది. నర్సరీ స్టాల్స్, అన్నవరం సత్యన్నారాయణ స్వామి గుడి సెట్, ఓపెన్ ఆడిటోరియం, జానపద కళాకారుల సందడి, ఫాస్ట్‌ఫుడ్ స్టాల్స్, సైకత శిల్పం... అన్నీ అలాగే ఉన్నాయి. నర్సరీ స్టాల్స్‌లో మొక్కల కొరత బాగా కనిపించింది. ఏవో ఒకటి రెండు పెట్టాం అన్న పేరుకి పెట్టారు. బోనసాయి ప్లాంట్స్ మాత్రం ప్రత్యేక ఆకర్షణ. 
గలివర్ ప్రయాణిస్తున్న నౌక ప్రమాదానికి గురయ్యి, మునిగిపోతే ఈదుకొంటూ వెళ్ళి లిల్లీపుట్ అనే ద్వీపంలో తీరంచేరతాడు. ఆ తరువాత ఏమిజరిగిందో మనలో చాలా మంది చిన్నప్పుడు కథల్లో విన్నాం, లేదా ఉపవాచకంగా చదువుకొన్నాం. చిన్న చిన్న మనుష్యులు, వాళ్ళ ఇళ్ళు, వస్తువులు, చెట్లు, జంతువులు... అదొక అద్భుత ప్రపంచం. అలాంటి ఒక అద్బుత ప్రపంచాన్ని మన డ్రాయింగ్‌రూంలో సృష్టించుకొంటే ఎలా ఉంటుంది? లిల్లీపుట్ మనుష్యులని సృష్టించడం కష్టమే కానీ చెట్లని సృష్టించవచ్చు. ఊడలు దిగిన పేద్ద మర్రిచెట్టు లాంటిది, అడుగున్నర ఎత్తుది మన లివింగ్ రూంలో ఉంటే ఎలా ఉంటుంది? బోన్‌సాయి వృక్షాలని (Bonsai Plants) అలా పెంచవచ్చు. మన ప్రాంతంలో పెరిగే ఎటువంటి చెట్టునైనా బోన్సాయ్ గా పెంచవచ్చు. లోతుతక్కువ ఉన్న చిన్న ట్రేలో చెట్టుని పాతి, క్రమంతప్పకుండా దానికి నీటిని, సూర్యరశ్మినీ అందేలా ఏర్పాటు చేసుకొని, పెరుగుతున్న కొమ్మలనీ, ఆకులనీ కత్తిరిస్తూ, పెరుగుదలని నియంత్రిస్తే క్రమంగా చెట్టు ఒక అందమైన ఆకారాన్ని పొందుతుంది. శతాబ్దాలక్రితమే జపాన్ వాళ్ళు ఈ ప్రక్రియని కళాత్మకంగా అభివృద్ది చేసి ప్రపంచానికి అందించారు. సాగర సంబరాలలో వీటికోసం ఒక స్టాల్‌ని ఏర్పాటు చేసి ప్రదర్శించారు.  కొంచెం సహనం, ఓపికా ఉంటే చక్కని బొనసాయ్ వృక్షాలని అభివృద్దిచెయ్యవచ్చు అని చెప్పాడు స్టాల్‌లో ఆయన. ఇక్కడ ప్రదర్శించిన వాటిలో ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల వయసు ఉన్న చెట్లు కూడా ఉన్నాయి. పెంచే ఆసక్తి ఉంటే ఇంటర్నెట్‌లో పెంపకానికి సంబంధించిన వివరాలు వ్యాసాల రూపంలో, వీడియోలుగా అందుబాటులో ఉన్నాయి. 
సందడి అంతా జానపద కళాకారులదే - పులివేషాలు, గంగిరెద్దులు, నెమలి నాట్యాలు, కథాకళి వేషదారులు, పగటివేషగాళ్ళు, పొడుగు మనుషులు, కింగ్‌కాంగ్ వేషగాళ్ళు సందర్శకుల మధ్య తిరుగుతూ హల్‌చల్ చేస్తున్నారు. 
చీకటిపడిన తరువాత సత్యన్నారాయణస్వామి గుడి నీలి బల్బుల వెలుగులో మెరిసిపోతుంది. సముద్రం మీదనుంచి వచ్చే చల్లని గాలిని ఆస్వాదిస్తూ, ఫాస్ట్‌ఫుడ్ స్టాల్స్ దగ్గర గోబీ మంచూరియానో, పావ్‌బాజీనో, రగడానో, పెద్ద అప్పడమో తింటూ దూరంగా కనిపించే గుడిగోపుర అందాలను తిలకించడం బాగుంటుంది. 
అన్నట్టు ఒక స్టాల్ కి ఫ్లెక్సి తమాషాగా ఎలా పెట్టారో చూడండి. కావాలని పెట్టింది కాదు కానీ అక్కడ అమ్మే పదార్థాలనన్నింటినీ వరసగా రాయడంతో అలా అయ్యింది. 
పెసరటుప్మా గారి మైసూర్బజ్జీ
నిన్నో, మొన్నో న్యూస్‌పెపర్లో బీచ్‌ఫెస్టివల్ గురించి ఒక వార్తలో జెయింట్‌వీల్ ఏర్పాటు చేశామని, దానిపైనుంచి సాగర అందాలను అస్వాదించడం బాగుంటుందని రాసారు. ఎప్పుడూ జాలీ రైడ్స్ ఎక్కే సరదా, అలవాటు లేకపోయినా ఆ వార్త చూసిన తరువాత కొంచెం టెంప్ట్ అయ్యను. కానీ, వెళ్ళి చూస్తే పరిస్థితి మరొకరకంగా ఉంది. చొల్లంగి తీర్థంలో ఎర్పాటుచేసేలాంటి చిన్న జెయింట్‌వీల్ అది. పైపెచ్చు దానిని సాగరానికి అభిముఖంగా కాకుండా, సంబరాలకి అభిముఖంగా వేశారు.  
ప్రతీ ఏడాదీ కుళాయి చెరువు దగ్గర పెట్టే ఎక్జిబిషన్‌నే మా కాకినాడ వాళ్ళం వదలం. అలాంటిది సాగరసంబరాలని వదులుతామా? నేమాం, పండూరు మీదనుంచి ఇరవై కిలోమీటర్ల వన్‌వే, అదికూడా గతుకులమయంగా తాత్కాలిక ఏర్పాటు చేసినా విక్రమార్కుల్లా వేళ్ళి, చూసి ఆనందించేస్తాం. ఊరిలోనుంచి సాగరసంబరాలకి వెళ్ళి, తిరిగి రావాలంటే ఓ నలభై, ఏభై కిలోమీటర్ల ప్రయాణమే. `అయినా వాకే,` అని వెళ్ళిచూస్తే కొత్తదనం ఏమీ కనిపించదు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ గారి అమ్మాయి శర్మిష్ట క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రాం ఉన్నవల్లనో, ఏమిటో గానీ పోలీసుల హడావుడి ఎక్కువగా కనిపించింది.  
మూడురోజుల సంబరాలలో ఇప్పటికే రెండురోజులు గడిచిపోయాయి. ఇంకా చూడకపోతే సాగరసంబరాలకి వెళ్ళండి. ఎంజాయ్ చెయ్యగలిగితే చెయ్యచ్చు, లేదంటే ఏదో సినిమాలో చెప్పినట్టు `పోయేదేముంది డూడ్ - రెండు, మూడు గంటల టైం తప్ప!` అనుకోవడమే.
© Dantuluri Kishore Varma

2 comments:

  1. i didnt know they were beach festivals organised in kkd.

    ReplyDelete
    Replies
    1. They started this last year. Some articles were written about last year`s beach festival as well. You can read them in `ఉప్పొంగెలే గోదావరి` page

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!