అరకులోయకి ట్రెయిన్‌లో వెళ్ళారా ఎప్పుడైనా? విశాఖపట్నం నుంచి అరకు 132 కిలోమీటర్లు దూరం. అరకు వెళ్ళే రైలు మార్గాన్ని డి.బి.కే(దండకారణ్య, బాలంగీర్, కిరుఖురి)రైల్వే లైన్ అంటారు. కొత్తవలస - కిరుండుల్ లైన్ అనికూడా వ్యవహరిస్తారు. యాభై ఏళ్ళ క్రితం జపాన్‌వాళ్ళు వేశారట దీనిని. కొండలని తొలచి టన్నెల్స్ ఏర్పాటు చేశారు. సుమారు 44 టన్నెల్స్ ద్వారా రైలు ప్రయాణం సాగుతుంది. విజయనగరం జిల్లాలో ఉన్న శృంగవరపుకోట వరకూ మైదానప్రాంతం, తరువాత బొడ్డువార అనే వూరినుంచి కొండప్రాంతం మొదలవుతుంది. ఈ లైన్‌లో ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే అరకులోయకి సమీపంలో ఉన్న సిమిలిగుడ అనే రైల్వే స్టేషన్ సముద్రమట్టానికి 3268 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇదే భారతదేశంలో కెల్లా ఎత్తైన బ్రాడ్వే రైల్వే స్టేషన్!
కొండలు, లోయలు, సెలయేర్లు, జలపాతాలు, పచ్చని ప్రకృతి మధ్యనుంచి మెల్లగా ప్రయాణించే రైలు - నాలుగు, ఐదు గంటల సమయం జీవితాంతం గుర్తుండిపోతుంది.
కళ్ళల్లోనుంచి మనసులోనికి దారి ఉన్నట్టు, వెలుగులోనుంచి మొదలైన టన్నెల్ ఓ చీకటిని దాటి, అటుచివర మిరుమిట్లు గొలిపే మరొక వెలుతురు ద్వారాన్ని చేరుతుంది. టన్నెల్‌లోకి ప్రవేశిస్తుండగా వెలుగు మాయమై చీకటి వస్తుంది. ఏ.సీ. గదిలోకి ప్రవేశించినట్టు ఒక్కసారి టెంపరేచర్ తగ్గుతుంది. ఎక్స్‌కర్షన్‌కి వెళుతున్న స్టూడెంట్స్ గ్యాంగ్ ఒక్కసారిగా అరుపులు, కేకలతో అల్లరి చేస్తారు. రైలు చప్పుడుతో కలిసి హోరెత్తిపోతుంది. ఉరుకులెత్తి మహోగ్రంగా వచ్చిన సముద్రకెరటం ఒడ్డునుతాకి నెమ్మదించినట్టు ట్రెయిన్ టన్నెల్ లోనుంచి బయటకు వస్తుంది.
ఆర్ట్‌గ్యాలరీ గోడలకి లేండ్‌స్కేప్ పెయింటింగ్స్ వరసగా వేలాడదీసినట్టు, అరకు వెళ్ళే దారిలో టన్నెల్, టన్నెల్ కీ మధ్యన ఒక సీనిక్ బ్యూటీ. చుట్టూ కొండలు. కొండవాలుల్లో మట్టి నిలబడి ఉండే చోటుల్లో మడులు కట్టి సాగుచేసే వ్యవసాయం. బకెట్లతో తెచ్చి పచ్చరంగుని కళ్ళాపి జల్లినట్టు లోయంతా అద్బుతమైన సోయగం. దట్టంగా పెరిగిన అడవి, కొడలపైనుంచి క్రిందికి జారే వాటర్‌ట్రేక్స్, ఎక్కడో తెలియని ఎత్తుల్లోనుంచి సన్నగా కురిసే జలపాతాలు, నీటిగలగలల్లో సంగీతం, వంతపాడే కోయిలగీతం.. ఆస్వాధించడానికి ఓ వందేళ్ళు సరిపోతాయా!?
మరి అక్కడ ఉండేవాళ్ళు ఎలా ఉంటారో? పట్టణాలకి వెళ్ళి అక్కడే జీవితాంత గడపాలనుకొంటారా? ఏమో.. కానీ, ఉన్న నాలుగు మడుల వ్యవసాయం, కొన్ని గొర్రెలు, ఓ పూరి గుడిసే, చూట్టూ కొండలు, కొండల మధ్యలోనుంచి ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి నెమ్మదిగా సాగిపోయే రైలు బండి, మంచుని చీల్చుకొని ఉదయించే సూర్యబింబం, సాయంత్రం అస్తమిస్తున్న సూర్యుడి మీదనుంచి ఎగిరి వెళ్ళిపోయే ఓ కొంగలబారు, వంట దాలిలోనుంచి కొండల ఎత్తువరకూ సాగే కమ్మని పొగమేఘం - అరకులోయలో సుందర దృశ్యం.
అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో అరకు సందర్శించడానికి మంచి టైం. ఇంకా అందమైన ప్రదేశాలు చూసిన వాళ్ళకి అరకు అత్యద్భుతంగా కనిపించక పోవచ్చు, కానీ, మనకి దగ్గరగా ఉన్న చక్కటి విహారస్థలం ఇది.
© Dantuluri Kishore Varma
baga chepparu vizag nundi vellavalasina train cheppandi sir
ReplyDeleteకిరుండుల్ పాసింజర్ ఉదయం ఆరు - ఏడు గంటల మధ్యలో వైజాగ్లో బయలుదేరుతుందండి. ఖచ్చితమైన సమయంకోసం రైల్వే ఇంక్వయరీలోగానీ, `కిరుండల్ పాసింజర్ ట్రైన్ టైమింగ్స్` అని గూగుల్ సెర్చ్ చేసి గానీ తెలుసుకోవచ్చు. మీ కామెంటుకి ధన్యవాదాలు హుస్సేన్‌గారు.
Deleteబాగా రాసారండి .బాగున్నాయి ఫోటోలు .
ReplyDeleteపన్నెండేళ్ళక్రితం ఫిలంరోల్ కెమేరాతో తీసిన ఫోటోలండి. డిజిటల్ కెమేరాతో తీసినంత క్లియర్‌గా ఉండవు. పోస్ట్ మీకు నచ్చినందుకు సంతోషం.
Deletemaaku daggara Pranthame Ayina marosaari Kalla mundhu niliparu. Chaalaa Baagaa raasaru.
ReplyDeleteChaala Baaga Raasru. Daggaraga Chusina Anubhoothi Kaoligindi.
ReplyDeleteధన్యవాదాలు నాయుడుగారు.
Delete