వేదవ్యాసుడు పరాశురుని కుమారుడు. 
వేదాలను కూర్చినవాడు.
అందరికీ ధర్మమార్గం గురించి వివరించడానికి ఒక కథని చెప్పాడు.
అదే మహాభారతం. 
చెప్పిన కథని రాయడానికి ఒక లేఖకుడు కావాలి.
మహర్షి చెప్పిన భారతాన్ని రాయగలవాడు వినాయకుడు ఒక్కడే.
అందుకే ఆయననే కోరాడు. 
వినాయకుడు అంగీకరించాడు.
మహాభారత రచన పూర్తయ్యింది.
ఇక దానిని తరువాతి తరాలకి అందించాలి. 
వేదవ్యాసుని కుమారుడు శుకుడు. ప్రియశిష్యుడు వైశంపాయనుడు. 
వాళ్ళిద్దరికీ నేర్పాడు.
దేవతలు, గాంధర్వులు, యక్షులు, రాక్షసులు, మనుష్యులు...
వీళ్ళందరికీ భారతం వినిపించడానికి ఒక్కరే సరిపోరు కదా? 
అందుకే,
నారదుడు దేవతలకి ఈ కథని వినిపించాడు.
శుకుడు గాంధర్వులు, యక్షులు, రాక్షసులకి చెప్పాడు.
వైశంపాయనుడు మనుష్యులకి చెప్పాడు.
మనుష్యులకి చెప్పడం ఎలా జరిగిందంటే...
పరీక్షిత్తు అనే గొప్పచక్రవర్తి ఉన్నాడు.
ఆయన కుమారుడు జనమేజయుడు. 
జనమేజయుడు చక్రవర్తి అయినతరువాత ఒక మహాయాగాన్ని చేశాడు.
ఆ సందర్భంగా వైశంపాయనుడు మహాభారతాన్ని వినిపించాడు.
విన్నవాళ్ళలో సూతుడు అనే మహాముని ఒకడు.
ఆయన నైమిశారణ్యానికి వెళ్ళి..
అక్కడ ఉన్న సౌనకుడు అనే మహామునికి,
ఇంకా చాలామంది మునులకీ భారతకథ చెప్పాడు.
విన్నవాళ్ళందరూ దానిని ధారణచేసి తరువాతి తరాలకి అందించారు.
అదే మనకు పరంపరగా వచ్చింది. 
మహాభారతం గురించి ముందుమాట చెప్పాలంటే ఈ పదిమంది పేర్లూ జ్ఞాపకం ఉంచుకోవాలి. పరాశురుడు, వేదవ్యాసుడు, వినాయకుడు, నారదుడు, శుకుడు, వైశంపాయనుడు, పరీక్షిత్తు, జనమేజయుడు, సూతుడు, సౌనకుడు. 
© Dantuluri Kishore Varma 

 
No comments:
Post a Comment