సాయంత్రం స్కూల్‌నుంచి ఇంటికి వెళుతుంటే తెలుసున్న ఆసామి ఒకరు `అక్కడికేనా?` అని అడిగారు. `కాదండి, ఇంటికివెళ్ళి, ఆతరువాత అక్కడికి వెళతాను. ఇంతకీ ఎప్పుడు మొదలవుతుంది?` అన్నాను. ఆయన టైం చెప్పారు.
బండి పార్క్‌చేసి ఇంటిలోకి వెళుతుంటే, పక్కింటవిడ ఎవరితోనో గట్టిగా ఫోన్‌లో మాట్లాడటం వినిపిస్తుంది. `రోజూ ఉండే పనులే కదా? ఇంటిలో ఎవరూ లేకపోయినా పరవాలేదు. తాళాలు వేసుకొని వచ్చెయ్యి,` అని. అక్కడికే అని అర్థమౌతుంది.
మాయింటికి కూతవేటు దూరంలో విష్ణాలయం ఉంది. దానికి అభిముఖంగా ఆంజనేయస్వామి గుడి. రెండింటినీ విద్యుత్‌బల్బుల వెలుగులతో అలంకరించారు. వారికీ, వీరికీ స్వాగతం అని బ్యానర్లు కట్టారు. విష్ణాలయం బయట చాలా వాహనాలు నిలిపి ఉన్నాయి. ప్రవేశద్వారానికి అటూ, ఇటూ ఆలయంలోనికి అప్పటికే వెళ్ళిన భక్తుల చెప్పులు విడిచి పెట్టి ఉన్నాయి. చూస్తూ ఉంటే చాలా మంది ఉన్నట్టున్నారు.
మైకులోనుంచి గంభీరమైన స్వరం వినిపిస్తుంది. గంభీరంగా ఉన్నా శ్రావ్యంగా ఉంది. హనుమంతుడు లంకలో ఎవరితోనో యుద్దం చేస్తున్న ఘట్టం వినిపిస్తున్నారు. హనుమంతుని ప్రత్యర్ధి మరెవరో కాదు స్వయంగా ఆతని కుమారుడే. మకరధ్వజుడు. ఎలా జన్మించాడో చెప్పే వాల్మీకి రామాయణంలోని కథ, ఆ తరువాత మకరధ్వజుని సహాయంతో మైరావణుని సంహారం...కథా ప్రవాహం జరిగిపోతుంది.
విష్ణాలయంలో వెనుకవైపు ఉన్న కళ్యాణ మండపం దగ్గరనుంచి, గుడివరకూ ఖాళీ స్థలంలో వేసిన కుర్చీలు అన్ని నిండి పోయాయి. వాటివెనుక చాలామంది కటిక నేలమీదే కూర్చుని వింటున్నారు. వాళ్ళకి ఇంకా వెనుక చాలా మంది నుంచొని ఉన్నారు. ప్రవచనం ఇంకొక గంటన్నర ఉండవచ్చు. అప్పటివరకూ ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉండిపోవడానికి నిర్ణయించుకొన్నట్టున్నారు. చెవులు ఒక్కటే బాగా పనిచేస్తున్నాయి. ప్రవచనం చెపుతున్నాయనా కథలోనుంచి కథ, సన్నివేశంలోనుంచి సన్నివేశం అల్లుకొని పోతున్నారు. మధ్యమద్యలో పద్యాలు, శ్లోకాలు, ఉపమానాలు, వివరణలు, పుణ్యక్షేత్రాల వివరాలు, వాటికీ, చెపుతున్న కథకీ ఉన్న సంబందం. శ్రోతలు ఆ ప్రవాహంలో కొట్టుకొని పోతున్నారు. పోతే పోనివ్వండి! మహా అయితే ఇంకొక నాలుగు రోజులు. మళ్ళీ వచ్చే సంవత్సరంవరకూ ఇక్కడివాళ్ళకి స్వయంగా వినే ఇలాంటి అవకాశం వస్తుందో, లేదో!
చెపుతున్నాయన మరొకరు ఎవరో అయితే ఈ సాయంత్రం అన్నిదారులూ అక్కడికే వెళ్ళి ఉండేవి కాదు. ఆయన స్వయానా ప్రవచన చక్రవర్తి!
ఇంతకీ ఆయన ఎవరో మీకు తెలిసిందా? తెలిస్తే చెప్పండి మరి.
© Dantuluri Kishore Varma
No comments:
Post a Comment