Pages

Friday, 20 December 2013

కురుస్తున్న మంచూ, ఉడుకుతున్న పొత్తులూ.. ఇంకా చాలా...

Not my own pic. Taken from the web. Thanks to the photographer.
మంచుకురుస్తున్నప్పుడు కారులో ప్రయాణం చేస్తే చాలా బాగుంటుంది కదా? 
ఆ మాటకి వస్తే బస్సులో ఐనా సరే బాగానే ఉంటుంది.  
రోడ్డుకి రెండువైపులా పెరిగిన చెట్ల పైకొమ్మలు ఆర్చిల్లా వొంపుతిరిగి స్వాగతద్వారాల్లా కనిపిస్తాయి. 
వరిచేలుకోసి, పనలు ఆరబెట్టి, కుప్పలు నూర్చి, ధాన్యాన్ని రైసుమిల్లుకి తోలేసిన తరువాత, వరిగడ్డిని కుప్పలు వేస్తారు. రహదారికి ఇరువైపులా పంటకోసిన పొలాల్లో, మంచులో తడిసి పోతున్న వాటిని చూస్తుంటే తెల్లవారు జామున నిశ్చలంగా తపస్సుచేసుకొంటున్న మహా మునులు జ్ఞాపకం వస్తారు. 
అక్కడక్కడా కనిపించే గుడిగోపురాలు...
ఎటువంటి హడావుడీ లేకుండా మంద్రగతిన సాగిపోతున్న ఎడ్లబళ్ళ సోయగాలు. లయబద్దంగా ఊగుతున్నఎడ్లమెడల్లో కట్టిన  గంటలు. 
గోచీలు బిగించి కట్టి, నెత్తిమీద కట్టెల మోపుతో ఇళ్ళవైపు వెళుతున్న పల్లె పడుచులు...   
ఇవన్నీ చూసుకొంటూ, ఏ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానిదో పాత మెలోడీ వింటూ అలా, అలా ఎంతసేపైనా సాగిపోవచ్చు. 

కానీ, ఇక్కడొక చిక్కు వుంది. మీరు పిఠాపురం మీదుగా వెళుతుంటే రెండు, మూడు చోట్ల మీరు చూసే దృశ్యాలు మిమ్మల్ని ముందుకు పోనివ్వవు. ఆగి తీరవలసిందే! మూడురాళ్ళ కట్టెలపొయ్యిమీద పెద్ద డేగిశా(పాత్ర)లో కుతకుతమని మరుగుతున్న నీళ్ళూ, వాటిలో మొక్కజొన్నపొత్తులు... కార్న్ ఉడుకుతుంటే వచ్చే కమ్మని వాసన ఎప్పుడైనా చూశారా? ఇరెసిస్టబుల్! మీ నోటిలో నీళ్ళు ఊరడం ఖాయం! అందులోనూ ఉడుకు తున్నవి, రుచికి ప్రశిద్ది చెందిన పిఠాపురం పొత్తులైతే మరీనూ!  ఇరవై రూపాయలకి మూడు ఇస్తాడు, కాదంటే పదిరూపాయలకి రెండు. బేరం ఆడి, కుదరక వదిలేసి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళిపోవద్దు. తరువాత చాలా చింతించాల్సి వస్తుంది. ఆ ప్రక్కనే కనిపిస్తున్న తంపటివేసిన, లేదా కాల్చిన తేగలు కనిపించినా ఒక కట్ట కొనుక్కోండి. 

ప్రయాణం చేస్తున్నప్పుడు కేవలం మైలు రాళ్ళే కనిపిస్తున్నాయంటే, ఆ జర్నీ చాలా విసుగ్గా ఉందని అర్థం. ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాం అని కాదు, ఎన్ని మంచి విషయాలు మనసుపొరల్లో జ్ఞాపకాలుగా మిగల బోతున్నాయి అనేదే ముఖ్యం. అది రోడ్డు మీద ప్రయాణమైనా, జీవిత ప్రయాణమైనా! 

అయ్యబాబోయ్, ఇలా ఫిలాసఫీ వొచ్చేస్తుందేమిటీ! 

© Dantuluri Kishore Varma 

4 comments:

  1. బావుందండి పోస్ట్ ..ఫోటోలు కూడా ...నిజంగా శీతాకాలంలో ఉదయపు ప్రయాణాలు చాలా బావుంటాయండి .నాకు చాలా ఇష్టం .

    ReplyDelete
  2. Yep,,I too like to travel on winter mornings but don't like to wake up so early and get ready in biting cold.. :) ...

    ReplyDelete
    Replies
    1. Somehow your comment slipped out of my notice. Sorry indeed for not having reciprocated your comment.

      Anyways, thanks a million!

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!