Pages

Thursday, 26 December 2013

అలా నా నిరీక్షణ పూర్తయ్యింది!

పండుగ సీజన్. జనాలతో కిటకిటలాడుతున్న మెయిన్‌రోడ్‌లో, బట్టలషాపుల ముందు పార్కింగ్ ప్లేస్ దగ్గర పళ్ళ సైకిలు ఆపుచేశాడు అతను. కేరేజీకి కట్టిన వెడల్పుగా ఉన్న పెద్ద తట్టలో చాలా కమలాబలా పళ్ళు ఉన్నాయి. కొన్ని దానిమ్మ పళ్ళు కూడా ఉన్నాయి. ఎర్రని గింజలున్న రెండు దానిమ్మ పళ్ళని పువ్వుల ఆకారంలో కట్‌చేసి అందంగా అలంకరించాడు. సైకిల్ హ్యాండిల్‌కి వేలాడ గట్టిన రెండుబుట్టలు బరువుగా ఉన్నాయి. వాటిల్లో కూడా యాపిల్ పళ్ళు ఉన్నాయి. మధ్యాహ్నం నాలుగయ్యింది. బహుశా అది ఎవరూ పళ్ళు కొనే టైం కాకపోయి ఉండవచ్చు. ఒక్కరు కూడా ఆగి కొనడం లేదు. సైకిలు స్టాండ్ వేసి, పార్క్‌చేసి ఉన్న మోటారు్‌సైకిళ్ళ మధ్యనుంచి ఖాళీ చేసుకొని ప్లాట్‌ఫాం మీదకి వెళ్ళి అగరొత్తులకొట్టు వాడితో బాతాఖానీ వేశాడు. ఏమి మాట్లాడుకొంటున్నరో తెలియదు. వీడు బుర్రగొక్కుంటూ ఏదో అంటున్నాడు. కొట్టతను షాపులో సరుకులమీద పడిన దుమ్ము దులుపుకొంటూ సమాధానం చెపుతున్నాడు. 
మ్యాచింగ్ సెంటర్లోకి వెళ్ళిన మేడంగారు ఎప్పుడు తిరిగి వస్తుందో తెలియదు. అందుకే, ఏమీతోచక వాడిని గమనిస్తున్నాను. యుగాలనిరీక్షణ తరువాత ఆమె బయటికి వచ్చింది. ఈలోగా పళ్ళసైకిలువాడు అగరొత్తుల కొట్టువాడి దగ్గర అగ్గిపుల్ల తీసుకొని సిగరెట్ ముట్టించాడు. `ఏమీ దొరకలేదు. ఆ ముందుషాపుకి వెళదాం,` అంది. వెళ్ళాం. మళ్ళీ రోడ్డుప్రక్కన నిరీక్షణ మొదలైంది. జనాలు భీమాస్ హోటల్‌లోకి పోతున్నారు. బయటికి వస్తున్నారు. ఒక బట్టల షాపు ముందు చిన్న స్టూలు మీద కూర్చొని ఉన్న ఒక వ్యక్తి ప్లాట్‌ఫాం మీద పోతున్న ప్రతీ ఒక్కరినీ, `చాలా వెరైటీలు ఉన్నాయి, లోపలికి వెళ్ళి చూడండి,` అంటున్నాడు. చాలా మంది పట్టించుకోవడంలేదు. వెళ్ళాలనుకొన్న వాళ్ళు వెళుతున్నారు - ఖచ్చితంగా వాడి రికమండేషన్ విని మాత్రం కాదు. కిక్కిరిసిన మ్యాచింగ్ షాపుల్లోకి వెళ్ళలేక, లోపల ఉన్న వాళ్ళ, వాళ్ళ ఆడవాళ్ళకోసం బయట నాకులానే నిరీక్షిస్తున్న కొంతమంది ఉన్నారు. కష్టాలు ఎవరికైనా రావచ్చు :p ఆమె దగ్గారగా ఉన్నప్పుడు గంటలు, క్షణాల్లా గడిచిపోయినా; నన్ను బయటే వదిలేసి షాపింగ్ సెంటర్లోకి వెళ్ళినప్పుడు మాత్రం క్షణాలు, యుగాల్లా గడుస్తాయి. ఆమె షాపింగ్ ముగించుకొని బయటికి వచ్చింది. నా నిరీక్షణ పూర్తయ్యింది. 

బయలుదేరుతుండగా పళ్ళసైకిలు వాడు సిగరెట్‌కాల్చుకొంటూ, మమ్మల్ని  దాటుకొని కొంచెం ముందుకు వెళ్ళాడు. అక్కడ సైకిలు నిలుపుకొని ట్రాఫిక్ వైపు చూడడం మొదలుపెట్టాడు.  
© Dantuluri Kishore Varma 

No comments:

Post a Comment

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!