విజయావారు 1955లో నిర్మించిన మిస్సమ్మ సినిమా పెద్దహిట్. పింగళి నాగేంద్రరావు రాసి, సాలూరి రాజేశ్వరరావు స్వరపరచిన పాటలు అన్నీ ఎంతో బాగుంటాయి. ముఖ్యంగా రావోయి చందమామ పాట అత్యద్భుతం. లీల, ఏ.ఎం.రాజా లలితలలితంగా పాడారు.
పాటలో సినిమా కథ అంతా ఉంటుంది. ఎస్.వీ.రంగారావు ఒక జమిందారు. ఆయన నడుపుతున్న స్కూల్‌లో టీచర్లుగా పనిచెయ్యడానికి భార్యాభర్తలైన వాళ్ళు కావాలని ప్రకటన ఇస్తారు. రామారావు, సావిత్రిలకి ఉద్యోగం చాలా అవసరం. కానీ, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదు. ఎలాగోలా తిప్పలు పడి ఉద్యోగంకోసం అలా నటిద్దామని ఆమెని ఒప్పిస్తాడు. ఆమె పక్కా క్రీష్టియన్, అతను హిందువయినా పరమత సహనం మెండుగానే ఉన్నవాడు. సర్దుకొనిపోయే వ్యవహారం. అబద్దంచెప్పి కొలువులో చేరారే కానీ రోజుకొక గొడవ. పరస్పరం పైకి వ్యక్తం చేసుకోలేని ప్రేమ ఉంటుంది. దానిని కోపంతో, అలకతో, ఆటపట్టించడంతో వ్యక్తంచేస్తుంటారు.
ఇలాంటి అవ్యక్తప్రేమని ఎవరితో పంచుకొంటారు, చందమామతో తప్ప?
రావోయి చందమామ మా వింత గాద వినుమా
రావోయి చందమామ మా వింత గాద వినుమా
సామంతము గలసతికీ ధీమంతుడ నగు పతినోయ్
సామంతము గలసతికీ ధీమంతుడ నగు పతినోయ్
సతి పతి పోరే బలమై సత మతమాయెను బ్రతుకే
ఎస్.వీ.రంగారావు కూతురు జమున `బాలనురా మదనా` అని పాడితే సావిత్రి, రామారావుకి డైరెక్టుగా చెప్పలేక `మగవారికి దూరముగా మగువలెపుడు మెలగాలని తెలుసుకొనవె చెల్లీ,` అని పాట నేర్పిస్తుంది. అతను గడుసువాడు మాటకి మాట అప్పజెప్పకుండా ఊరుకొంటాడా? అందుకే తనవంతుగా ఇదిగో ఇలా నేర్పించాడు - `సాధింపులు, బెదరింపులు ముదితలకిక కూడవని, హృదయమిచ్చి పుచ్చుకొనే చదువేదో నేర్పాలని తెలుసుకొనవె యువతీ`. ఇంకేముంది గొడవ మొదలు. అది అలా చిలికి చిలికి గాలివాన అయ్యింది.
మనసులో ఉన్న ప్రేమ, తనవాడు పరాయివాడవుతాడేమో అనే ఆందోళన. మరొక సందర్భంలో జమునకు పాటనెర్పిస్తూ `బృందావనమది అందరిదీ` అని అతను పాడేసరికి అగ్నిపర్వతంలా బద్దలయ్యింది. ఆవిషయాన్ని ఎత్తిచూపిస్తున్నాట్టు ఆమె అంటుంది..
ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్
ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్
మాటలు బూటకమాయే నటనలు నేర్చెను చాలా
అతను:
తన మతమేమో తనదీ మన మతమసలే పడదోయ్
తన మతమేమో తనదీ మన మతమసలే పడదోయ్
మనమూ మనదను మాటే అననీయదు తాననదోయ్
ఆమె:
నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో
నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో
ఈ విధి కాపురమెటులో నీవొక కంటను గనుమా
ప్రేమపాటల్లో ఇంత మంచి పాట మరొకటి లేదేమో అనిపిస్తుంది. చెట్ల చుట్టూ పరుగులు పెట్టి, స్టెప్పులు వెయ్యక పోయినా సావిత్రీ, రామారావుల ముఖాలలో పలికించిన భావాలు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ మనల్ని కళ్ళు తిప్పుకోనివ్వవు. అందుకే ఇది ఆల్‌టైం ఫేవరెట్ సాంగ్. మీరేమంటారు?
© Dantuluri Kishore Varma
కిషోర్ గారు మన కాకినాడలో మీరు చెప్పే ప్రతీ విషయం చాలా బాగుంది , ఆ కబుర్ల ద్వారా మా అందరినీ ఒకసారి కాకినాడకు తీసుకువెళుతున్నారు.
ReplyDeleteఅలాగే మిస్సమ్మ సినిమా కూడా ఇప్పుడూ , ఎప్పుడూ ఆణిముత్యమే, మన హృదయాల్లో చిరస్తాయిగా నిలిచిపోయే కళాఖండం.
ధన్యవాదాలు శ్రీశాంతి గారు. మీకు కాకినాడ బ్లాగ్‌కి స్వాగతం.
Deleteవర్మగారూ, మీ ప్రయత్నం బాగుంది,
ReplyDeleteధన్యవాదాలు మెరాజ్ గారు.
Delete