1991 లో రిలీజయిన క్షణ క్షణం సినిమా చూసి మంత్రముగ్ధులమైపోయాం.
శ్రీదేవి నటన, సింపుల్ స్టోరీ, అద్భుతమైన టేకింగ్. `జుంబారే` అనే పాట ప్రారంభంలో కొలను మధ్యలో శ్రీదేవి నిలబడి `శ్రావణ వీణా స్వాగతం, స్వరాల వెల్లువా వెల్కం, లేతవిరివానా నవ్వామ్మా, ఆనందంతో...` అని ఒక బిట్ పాడే షాట్ ఉంటుంది.
అన్నింటికీ మించి `జామురాతిరి జాబిలమ్మ` పాట.
అన్నింటికీ మించి `జామురాతిరి జాబిలమ్మ` పాట.
పలుచటి నీలిరంగు మేలిముసుగు కప్పినట్టు వెన్నెల, చందమామ, చుట్టూ అడివి.. జోలపాటకి ఇంతకన్నా మంచి పరిసరాలు ఏమికావాలి?
కీటకాల అరుపుల్నీ, పక్షుల కూతల్నీ సంగీతంలో చక్కగా ఇమిడ్చేశారు కీరవాణి. సాహిత్యానికి వస్తే ఇది జోలపాటయినా సరే సిరివెన్నెల మార్కు స్పూర్తిని నింపే మాటలు ఉంటాయి. కావాలంటే చూడండి, "చిటికెలోన చిక్కబడ్డ కటిక చీకటి కరిగిపోక తప్పదమ్మ ఉదయకాంతికి". దానికితోడు ఎస్పీబాలు స్వీట్ వాయిస్.
గుడ్లగూబ, కప్ప, ఆకుపురుగు, చేప.. వీటిని చూపిస్తూ నాలుగు షాట్‌లు; కొలనులో ప్రతిబింబించే చందమామ; నీటిలోకి రాయి విసిరినప్పుడు ఆ చప్పుడుకి బెదిరి పరుగెత్తిన కుందేలు.. అందమైన ఆంబియన్స్ క్రియేట్ చేశారు.రాం గోపాల్ వర్మకి ఉత్తమ డైరెక్టర్‌గా నందీ అవార్డ్ వచ్చింది.
శ్రీదేవి కళ్ళతోనే నటించేసింది. ఎంతో కష్టపడి సృష్ఠించిన పరిసరాల్ని ఆమె సింపుల్గా డామినేట్ చేసి పారేస్తుంది. ఇక్కడ రాంగోపాల్‌వర్మ ఆమెగురించి చెప్పిన మాట ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. `క్షణ క్షణం సినిమా నేను శ్రీదేవికి రాసిన ప్రేమలేఖ,` అంటాడు నా ఇష్టం అనే పుస్తకంలో.
జామురాతిరి జాబిలమ్మ
జోలపాడనా ఇలా
జోరుగాలిలో జాజికొమ్మా
జారనీయకే కలా
వయారి వాలుకళ్ళలోనా...వరాల వెండిపూల వాన
స్వరాల ఊయలూగువేళ !!జామురాతిరి!!
కుహు కుహూ సరాగాలే శృతులుగా
కుశలమా అనే స్నేహం పిలువగా
కిల కిలా సమీపించే సడులతో
ప్రతిపొదా పదాలేవో పలుకగా
కునుకు రాక బుట్టబొమ్మ గుబులుగుందని
వనము లేచి వద్దకొచ్చి నిద్రపుచ్చనీ !!జామురాతిరి!!
మనసులో భయాలన్నీ మరచిపో
మగతలో మరోలోకం తెరుచుకో
కలలతో ఉషాతీరం వెదుకుతూ
నిదరతో నిషారాణీ నడచిపో
చిటికెలోన చిక్కబడ్డ కటిక చీకటి
కరిగిపోక తప్పదమ్మ ఉదయకాంతికి !!జామురాతిరి!!
© Dantuluri Kishore Varma
No comments:
Post a Comment