పబ్లిక్ లైబ్రరీలు, రెంటెడ్ లైబ్రరీలు ఉండేవి. తెలుగు పత్రికలు, నవలలు చదివేవాళ్ళు చాలా మందే ఉండేవారు. అయిదవతరగతి కూడా పాసవని ఇల్లాళ్ళు, వాళ్ళ భర్తలు వారం,వారం ఇంటికి పోస్టులో వచ్చే పత్రికలు చదవడానికి వంతులువేసుకొనేవారంటే చదివే అలవాటు ఎంత బాగుండేదో అర్థంచేసుకోండి. సహజంగానే అలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలకి కూడా అదే అలవాటు అవడంలో విచిత్రంలేదు కదా! ఇది ఇంచుమించు ముప్పై, నలభై సంవత్సరాల క్రితం మాట.
తరువాత కొంచెం పరిస్థితులు మారాయి. ప్రైవేట్‌స్కూళ్ళు, కాన్వెంటులు, హోంవర్క్, ర్యాంకులు మొదలయ్యాయి. టీ.వీలు డ్రాయింగ్ రూంలోకి వచ్చాయి. మమ్మీలూ, డాడీలూ `మనకి ఎలాగూ చదువు లేదు. మనదీ, వాళ్ళదీ కలిపి పిల్లలచేతే చదివించేద్దాం` అని కంకణం కట్టుకొని, క్లాసు పుస్తకాలు తప్ప మిగిలినవేమీ పిల్లలకి అందకుండా చేసేశారు. పిల్లలు అలసిపోతే బూస్టు గ్లాసు చేతికి ఇచ్చి టీ.వీ. ముందు కూర్చోబెట్టారు. ఇంకేముంది, ఆ తరానికి మంచి ర్యాంకులు, ఉద్యోగాలూ వచ్చాయి. చందమామలు, జీవితచరిత్రలు, కథలపుస్తకాలు, నవలలూ అటకెక్కాయి.
`వ్యాయామం శరీరానికి ఎలాగో, పుస్తకాలు చదవడం మెదడుకి అలాగ,` అంటారు. నిశ్సబ్ధంగా కూర్చొని చక్కని పుస్తకం చదువుతూ ఉంటే సమయం తెలియదు. ద్యానం చేసుకొన్నప్పటి ఏకాగ్రతలాంటిది కలుగుతుంది. మెదడుమీద వొత్తిడి తగ్గుతుంది. రచయిత మనుష్యులని, ప్రదేశాలనీ వర్ణించి చెపుతుంటే మెదడులో న్యూరాన్లు కొత్త, కొత్త బొమ్మలను సృష్టిస్తాయి. సన్నివేశాల కల్పనచేస్తుంటే నిజమా అన్నంత స్పష్టంగా ఊహాలోకంలో కనిపిస్తుంది. ఒక మహానుభావుడు అత్యంత ప్రభావవంతమైన జీవితాన్ని గడిపితే అతని ఆత్మకథ చదవడం వల్ల ఆ జీవితాన్ని మనం జీవించినట్టే ఎన్నో లైఫ్‌స్కిల్‌ని నేర్చుకోవచ్చు.
వంద పదాలని తీసుకొని, వాటి అర్థాలని డిక్ష్నరీలో చుసి తెలుసుకోవాలంటే, జ్ఞాపకం ఉంచుకోవాలంటే ఎంతలేదన్నా మూడునాలుగు రోజులు పడుతుంది. అదే ఒక కథను చదివితే దానిలో తారసపడే కొత్త పదాలను ఏ డిక్ష్నరీనీ చూడకుండానే ఉపయోగించిన సందర్భాన్ని బట్టి అర్థంచేసుకోవచ్చు. వాటి వినియోగం కూడా తెలికగానే అవగాహన అవుతుంది. అందుకే, చదవడం అనే హాబీ ఉన్నవాళ్ళకి ఎక్కువ పదాలు తెలిసి ఉంటాయి. పదసంపద సమృద్ధిగా ఉన్నవాళ్ళకి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెపుతారు.
స్వంత అభిప్రాయాలు వ్యక్తం చెయ్యడానికి, రచనలు చెయ్యడానికి, ఉపన్యాసాలు ఇవ్వడానికి, సంఘంలో నలుగురితో కలివిడిగా ఉండడానికి కావలసిన వాక్చాతుర్యం అభివృద్ది చేసుకోవడానికి, విజయాలను అందుకోవడానికి, పరీక్షల్లో ఎక్కువ మార్కులు సంపాదించడానికి నిస్సందేహంగా పుస్తకాలు చదవడం అనే అభిరుచి సహాయపడుతుంది.
మరి ఇప్పటి తరం దానిని ఎందుకు అలవాటు చేసుకోవడంలేదు? టి.వీ. ని, ఇంటర్‌నెట్‌ని, ముఖ్యంగా సోషల్‌నెట్వర్కింగ్ సైట్లని పిల్లలకి దూరంగా ఉంచి, మంచి పుస్తకాలని దగ్గరగా ఉంచితే బాగుంటుంది. ఇప్పటికే తమ పిల్లలకి ఈ అలవాటుని కలిగించడానికి ప్రయత్నిస్తున్న తల్లితండ్రులూ, ఉపాద్యాయులూ అభినందనీయులు. మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కనీసం వారానికి ఒక్కరోజయినా పిల్లలని గ్రంధాలయాలకి తీసుకొనివెళితే ఒక మంచి అభిరుచిని వాళ్ళకు పరిచయం చేసినట్టు ఉంటుంది.
జాతీయగ్రంధాలయ వారోత్సవాలు జరుగుతున్నాయి (14.11.2013 నుంచి 20.11.2013 వరకూ). చలో లైబ్రరీ!
© Dantuluri Kishore Varma
Truly said Varma garu!
ReplyDeleteథాంక్స్ మూర్తిగారు.
Delete