Pages

Monday 4 November 2013

ప్రతిరాత్రి వసంత రాత్రి

ప్రతిరాత్రి వసంత రాత్రి, ప్రతిగాలి పైరగాలి... అని దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు ఓ సినిమాకోసం రాస్తే, దానికి స్వరకల్పన చేసి, రికార్డ్ చేశారట. కానీ ఆ సినిమా విడుదలకి నోచుకోక పోవడంతో 1969లో విడుదలైన ఏకవీర సినిమాలో ఉపయోగించారు. ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించినాయన కే.వీ.మహదేవన్. ఎన్‌టీ రామారావు, కాంతారావు, కేఆర్ విజయల మీద చిత్రీకరించారు. ఘంటశాల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు.

ఈ పాటలో మధురమైన విషయాల సంగమం ఉంది. ప్రేమలో మునిగి తేలుతున్నప్పుడు దానిని మనసులో దాచుకొని ఉండడం అసాధ్యం. వెన్నెల్లో, చల్లగాలిలో, ఆరుబయట స్నేహితుడితో కలిసి కూర్చున్నప్పుడు ఆ విశేషాలు పంచుకోకుండా ఉండలేరు. ప్రేయసితో ప్రేమ ఎలా ఉండాలో మైమరచిపోయి వర్ణిస్తారు. ప్రేయసి నర్తకి, ప్రియుడు గాయకుడు అయితే ఒకరికి ఒకరు కాంప్లిమెంటరీ(పరిపూర్తి) అవుతారు. మనసు పరిమళభరితం అవుతుంది. చందమామలాంటి అతను చుక్కలాంటి ఆమెవైపు వొరిగితే, ఆమె లతలా అతనిని అల్లుకుపోతుంది. ఈ చరణంలో `సుంత` అనే మాటను ఎంత బాగా వాడారో చూడండి. దాన్ని బాలసుబ్రహ్మణ్యం అంత చక్కగానూ పలికారు. 

పల్లవిలో `బ్రతుకంతా ప్రతి నిముషం పాటలాగ సాగాలి ... ప్రతి నిముషం ప్రియా, ప్రియా పాటలాగ సాగాలి` అని పాడుతున్నప్పుడు `ప్రియా, ప్రియా` దగ్గర ఘంటశాల స్వరంలో ఆర్తి, రామారావు అభినయం చూడండి. అలాగే -`ఒరిగింది చంద్రవంక` అన్నప్పుడు కే.ఆర్.విజయ కళ్ళల్లో తన్మయత్వం, `ఒయ్యారి తారవంక` అని ముగించినప్పుడు అతిశయం చూడండి.

ఇవన్నీ సరైన పాళల్లో కలిశాయి కనుకే ఈ పాట అంత గొప్పగా ఉంటుంది. చూసినప్పుడు ఎంతబాగుంటుందో, విన్నప్పుడు కూడా అంతే బాగుంటుంది.

పల్లవి :
ప్రతి రాత్రి వసంత రాత్రి
ప్రతి గాలి పైర గాలి
బ్రతుకంతా ప్రతి నిముషం పాటలాగ సాగాలి
ప్రతి నిముషం ప్రియా, ప్రియా పాటలాగ సాగాలి ||| ప్రతి రాత్రి |||

చరణం 1 :
నీలో నా పాట కదలీ
నాలో నీ అందె మెదలీ
లోలోన మల్లె పొదల
పూలెన్నో విరిసి విరిసీ
మనకోసం ప్రతి నిముషం మధుమాసం కావాలి
మనకోసం ప్రియా, ప్రియా మధుమాసం కావాలి ||| ప్రతి రాత్రి |||

చరణం 2 :
ఒరిగింది చంద్రవంక
ఒయ్యారి తారవంక
విరజాజి తీగ సుంత
జరిగింది మావిచెంత
ననుజూచీ, నినుజూచీ వనమంతా వలచింది
ననుజూచీ ప్రియా, ప్రియా వనమంతా వలచింది ||| ప్రతి రాత్రి |||
© Dantuluri Kishore Varma 

4 comments:

  1. మా శంకర్ని బాగా గుర్తు తెచ్చారండీ 'మా కాకినాడ కబుర్లు' చెప్తూ . బ్లాగ్ బాగుంది

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి. మీ ఆప్తుల్ని బ్లాగ్ ద్వారా మీకు జ్ఞాపకం చెయ్యగలిగినందుకు ఆనందంగా ఉంది.

      Delete
  2. వర్మగారూ, మీ బ్లాగ్ కూర్పులో మీ నేర్పు పసందు ... గో హెడ్ ...

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు ప్రసాదరావు గారు.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!