Pages

Thursday, 28 November 2013

శ్రీ ఆంజనేయం!

సరిగ్గా పదిసంవత్సరాలక్రితం, అంటే 2003లో స్వాతి సపరివార పత్రికలో తిరుమల వేకటేశ్వరస్వామి గురించి ఒక సీరియల్ వచ్చేది. సీరియల్ అంటే కల్పిత కథ కాదు. టి.టి.డి ఎక్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేసిన శ్రీ పీ.వి.ఆర్.కె.ప్రసాద్ రాసిన ఆధ్యాత్మిక అనుభవాలు. `అధికారిగా నేను చేసినా, చేయించింది ఆ తిరుమలేశుడే` అనే దృక్పదంతో రాశారు. సర్వసంభవాం అనే పేరుతో ఈ శీర్షిక ఎంతో ఆసక్తికరంగా ఉండేది. చాలా భాగాలకి బాపూనే బొమ్మలు వేశారు. తరువాత కొన్నింటికి వర్మ అనే వేరే ఆర్టిస్టు వేశారు. ఈ శీర్షిక కోసం పత్రికని విడవకుండా చదివేవాళ్ళం. తరువాత అదే పుస్తకరూపంలో `నాహం కర్తా హరి: కర్తా` అనే పేరుతో విడుదల చేశారు.   
2007లో తిరుమలకొండమీదకి నడచివెళ్ళాం. అప్పుడు సర్వసంభవాం పుస్తకాన్ని తీసుకొని వెళ్ళి చదివినప్పుడు తిరుమలేశుడిమీద భక్తిభావం మరింత పెరిగింది. అలిపిరి దగ్గరనుంచి తిరుమలకి సుమారు తొమ్మిది కిలోమీటర్లు. మార్గమధ్యంలో నడకదారీ, వాహనాలు వెళ్ళే ఘాట్‌రోడ్డూ కలిసేచోట ఎత్తైన ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహాన్ని అక్కడ అలా పెట్టించడం వెనుకకథని ఓ భాగంలో రాశారు. 

నడకదారిలో సౌకర్యాలు సరిగ్గా ఉండేవి కాదట. ఒకసారి ఆ మార్గ మధ్యంలో ఒక ముసలావిడని ఎవరో హత్య చేశారట. ఆ నేపద్యంలో దారిని మెరుగుపరచి, లైటింగ్, షెల్టర్లు అవీ ఏర్పాటు చేశారు. ఇంకా ఏదన్నా చేస్తే బాగుండును అని అనిపిస్తూ ఉండేదట ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రసాద్ గారికి. ఆయన అత్తవారి ఊరు కాకినాడ. కుటుంబంతో కలిసి కాకినాడ కారులో వస్తూ దారిలో సామర్లకోట ప్రసన్నాంజనేయస్వామి విగ్రహాన్ని చూసి మంత్రముగ్ధులైపోతారు. ఆ విగ్రహం ఇదే! కాకినాడ, సామర్లకోట రోడ్డులో ఉంటుంది.
అలాంటి విగ్రహాన్ని తిరుమల నడక దారిలో ఏర్పాటు చేయిస్తే బాగుంటుందని అనిపించి, శిల్పి వివరాలు తెలుసుకొని, పెద్దాపురం దగ్గర చిన్న ఊరిలో ఉంటున్న తోగులక్ష్మణ స్వామి అనబడే ఆ శిల్పిని కలిశారు. పనిచెప్పి, ఒప్పించి, తిరుమల తీసుకొని వెళ్ళి, సుందరమైన ఆంజనేయుని విగ్రహాన్ని నడకదారిలో ఏర్పాటు చేయించారు. అది ఇదే!
© Dantuluri Kishore Varma 

2 comments:

  1. వావ్!!! నేను ఎప్పట్నుంచో ఇక్కడ అనజనేయ స్వామి విగ్రహం ఎలా పెట్టారో తెల్సుకోవాలనుకుంటూ ఉన్నాను, మీ పుణ్యమా అని ఇప్పుడు తెలిసింది.... :)

    ReplyDelete
    Replies
    1. మీకు నచ్చినందుకు ఆనందంగా ఉంది. ధన్యవాదాలు.

      Delete

క్షేత్ర స్కూల్ Kshetraschool.blogspot.com

క్షేత్ర స్కూల్  Kshetraschool.blogspot.com
ఉత్తమ విద్యాప్రమాణాలు...ఉన్నత విలువలు Click here to learn more!